డోన్ : అర్టీసీ అధికారులు.. వ్యాపారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏకంగా మూడేళ్ల పాటు ఎలాంటి అద్దెలు లేకుండా ప్యాపిలి బస్టాండ్‌లో దుకాణాలను కేటాయించారు. ఇదే అదునుగా చేసుకొని మరి కొందరు అనుమతి లేకుండా ఇక్కడ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మూడేళ్లుగా సుమారు రూ.5 లక్షల వరకు ఆర్టీసీ నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్యాపిలి బస్టాండులో 15 దుకాణాలు ఉన్నాయి. ఇందులో బస్టాండ్‌లో ఉన్న రెండు దుకాణాలతోపాటు 14, 12, 10వ నంబర్ల షాపులు అద్దెలు చెల్లిస్తున్నాయి. ఇక మిగిలిన తొమ్మిది దుకాణాలు బస్టాండుకు ఎదురుగా ఏర్పాటు చేశారు. ఇవి రోడ్డు ముఖానికి ఉన్నాయని, వ్యాపారాలు జరగడం లేదని తాము అద్దెలు చెల్లించలేమని వ్యాపారులు చెప్పడంతో ఆర్టీసీ అధికారులు గుడ్డిగా తల ఊపారు.
అనధికార షాపులకు అధికారుల అండ:
టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిలో ప్యాపిలికి చెందిన వెంకటేశ్వర్లకు 0.65 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ 18.07.2013న ఆదేశాలుజారీ చేశారు. అదే విధంగా వెంకటరమణకు, తిమ్మారెడ్డి అనే వ్యక్తికి కూడా దుకాణాలు కేటాయించారు. వీరు తమ సొంత ఆదాయం కోసం కేటాయించిన స్థలంలోనే మరిన్ని షాపులను నిర్మించి సబ్‌లీజుదారులకు ఇచ్చారు. నిబంధనలకు మేరకు సబ్‌లీజ్ ఇవ్వడం సరికాదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో 02.06.14వ తేదీన లెసైన్సు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా వెంకటరమణ, తిమ్మారెడ్డికి చెందిన షాపులను కూడా రద్దు చేశారు.
దీంతో తమకు అన్యాయం జరిగిందని ఆయా దుకాణదారులు కోర్టును ఆశ్రయించడంతో వాటినన్నంటినీ సీజ్ చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ అనధికార షాపులను నడుపుతున్నారు. వీటి నిర్వాహకులకు డోన్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అండ ఉన్నట్లు తెలుస్తోంది. సదరు ఉద్యోగి తన భార్యను పోస్టల్ ఆర్డీ ఏజెంటుగా నియమించుకొని.. వ్యాపారుల వద్ద నుంచి వేలకువేల రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగి ప్యాపిలి బస్టాండులో బినామీ పేరుతో ఒక దుకాణాన్ని దక్కించుకొని సబ్‌లీజుకు ఇచ్చాడు. ఆ దుకాణం లెసైన్సు రద్దు అయినప్పటికీ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక డిపో మేనేజర్ జయచంద్రను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.
బంపర్ ఆఫర్..!
Published Wed, Aug 5 2015 3:40 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement