‘చాంబర్’ ఎన్నికలకు రంగం సిద్ధం
Published Wed, Aug 21 2013 4:27 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్:ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్(వర్తక సంఘం) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడేళ్లకోసారి ఈ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. వివిద శాఖలకు చెందిన 229 మంది చాంబర్ ఆఫ్ కామర్స్‌లో నూతన సభ్యత్వాల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ప్రస్తుత కమిటీలో వివాదం చెలరేగి రెండువర్గాలుగా విడిపోయారు. కొత్తవారికి సభ్యత్వాలు ఇవ్వాలని ఒక వర్గం, ఎన్నికల తరువాత ఏర్పడే నూతన కమిటీలో వారికి స్థానం కల్పించాలని మరో వర్గం పట్టుబట్టాయి. ఎట్టకేలకు చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు ఈ వివాదాన్ని పరిష్కరించటంతో ఎన్నికలకు సుగమమైంది. నూతన సభ్యులను పక్కనబెట్టి ప్రస్తుతం ఉన్న 993 మంది సభ్యులతో సెప్టెంబర్ 8న ఎన్నికలు నిర్వహించాలని ప్రస్తుత కమిటీ నిర్ణయించింది. కమిటీలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఐదుగురు కార్యవర్గ సభ్యులు ఉంటారు.
మొత్తం 19 వ్యాపార శాఖలకు చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. ఎన్నికల అధికారులుగా వి.వి.అప్పారావు, సర్వదేవభట్ల సోమశేఖర శర్మ వ్యవహరిస్తున్నారు. ఓటర్లలో మార్కెట్ వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు అధికంగా ఉన్నారు. మార్కెట్‌లో వ్యాపారం చేసే 417 మంది, క్లాత్ అండ్ రెడీమేడ్ దుకాణాల వ్యాపారులు 70 మంది, బంగారం, వెండి దుకాణాల వ్యాపారులు 114 మంది, కిరాణం దుకాణాలకు చెందిన 29 మంది, ఎగుమతి శాఖకు చెందిన 50 మంది, దాల్ మిల్ వ్యాపారులు 23 మంది,
ఆయిల్ మిల్ వ్యాపారులు 11 మంది, రైస్‌మిల్ వ్యాపారులు 11 మంది, జనరల్ మనియారీ శాఖకు చెందిన 33 మంది, సామిల్స్‌కు చెందిన 42 మంది, మిర్చి శాఖకు చెందిన వ్యాపారులు 45 మంది, సిమెంట్ వ్యాపారులు 21 మంది, కలప వ్యాపారులు 11 మంది, మోటార్స్ అండ్ పైప్స్ వ్యాపారులు 14 మంది, ఇనుము వ్యాపారులు 19 మంది, ధాన్యం వ్యాపారులు 15 మంది, కాన్వాసింగ్ వ్యాపారులు 26 మంది, కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు 13 మంది, డిస్ట్రిబ్యూటర్లు 33 మంది, జిన్నింగ్ మిల్ వ్యాపారులు ఏడుగురు ఓటర్లుగా ఉన్నారు. వీరంతా కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
Advertisement