నమ్ముకున్నవాళ్లకు చేసే న్యాయం ఇదేనా?
నమ్ముకున్నవాళ్లను నట్టేట ముంచడం చంద్రబాబుకు ముందునుంచి ఉన్న అలవాటేనని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారని, ఆయన మంచి విలువలు, క్రమశిక్షణ కలిగిన నాయకుడని.. చివరకు అలిపిరిలో బాంబుదాడి జరిగినప్పుడు కూడా చంద్రబాబు వెంటే ఉన్నారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని ఆరోగ్యం బాగోలేదని చెప్పి పక్కన పెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న జక్కంపూడి రామ్మోహనరావు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని చాలామంది అన్నారని.. కానీ, జక్కంపూడి అప్పటికి సంతకం పెట్టగలుగుతున్నారని, వింటున్నారని, విధి నిర్వహిస్తున్నారని.. అలాంటివాళ్లను తొలగిస్తే దిగులుతో చనిపోతారని చెప్పి చివరి వరకు ఆయనను మంత్రివర్గంలో కొనసాగించిన మహానుభావుడు వైఎస్ఆర్ అని రాంబాబు అన్నారు. నమ్మినవారి కోసం ఎంతదూరమైనా వెళ్లగలిగిన వ్యక్తి రాజశేఖరరెడ్డి అయితే, నమ్మినవాళ్లను నట్టేట ముంచే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని అడిగినందుకు బోండా ఉమాను పిలిపించి బెదిరించినట్లు వినిపిస్తోందని.. మరి అలాంటప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎందుకు బెదిరించలేదు, ధూళిపాళ్ల నరేంద్రను ఎందుకు బెదిరించలేదని ప్రశ్నించారు. కాపులు అంటేనే చంద్రబాబు ఒంటికాలి మీద లేస్తున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు.
పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదని తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని, ప్రారంభం నుంచి ఉన్నవారిని వదిలేసి, తమ నుంచి లాక్కున్నవారిని అందలం ఎక్కించారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. కడపలో వివేకానందరెడ్డిని ఓడించామని ప్రగల్భాలు పలుకుతున్నారని, నిజంగా మీకు ప్రజాబలం ఉంటే వైఎస్ఆర్‌సీపీ గుర్తుమీద గెలిచిన మంత్రులు నలుగురితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రాగలిగే సత్తా ఉందా అని ప్రశ్నించారు. కక్కిన కూటి కోసం ఆశపడే దౌర్భాగ్య రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబు ఇప్పటికైనా ఆలోచించుకోవాలన్నారు. వైఎస్ఆర్‌సీపీ తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిందని గుర్తు చేశారు. ఆ 5 లక్షల ఓట్లు అటూ ఇటూ అయితే బాబు జాతకం తలకిందులయ్యేదని చెప్పారు. గుంటూరు, విశాఖ లాంటి పలు చోట్ల మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికలున్నా వాటిని వాయిదా వేయిస్తున్నారని, దాన్నిబట్టే వాళ్లకు ప్రజాబలం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు.
ప్రజాబలం లేదు కాబట్టే, ఓటమి భయంతో జగన్ మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, తన అనుకూల మీడియాతో పిచ్చి కథనాలు రాయిస్తున్నారని చెబుతూ.. ఆ పత్రికలు రాసేవన్నీ అభూత కల్పనలని, వాటిని ప్రజలు నమ్మద్దని చెప్పారు. జగన్ బలపడుతున్నప్పుడల్లా ఆయన మీద కేసులు పెట్టించాలని టీడీపీ చూస్తోందని తెలిపారు. చంద్రబాబు వ్యతిరేక శక్తులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని అన్నారు. చంద్రబాబు రాక్షస పాలనను అంతం చేయడానికి అందరూ ఐక్యమై ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో బట్టలూడదీసిన చంద్రబాబును వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసులో నేరుగా దొరికిపోతేనే ఎవరూ ఏమీ చేయలేరని బాబు అంటున్నారు గానీ.. ఎంతటివాడైనా ఐదేళ్లకోసారి ఓటు అడగాల్సిందేనని.. అప్పుడు ప్రజలు న్యాయం చేస్తారనే విశ్వాసం తమకుందని అన్నారు. టీడీపీలో మునిగిపోయిన వాళ్లు ఏం చేస్తారో వేచి చూడాల్సిందేనని చెప్పారు.