సాక్షి, అమరావతి: హైకోర్టు విభజన తీరు సరిగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయం ఇవ్వకుండా జనవరి ఒకటినే వెళ్లిపోవాలనడంతో న్యాయవాదులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. డిసెంబర్ 15 కల్లా కోర్టు భవనం పూర్తవుతుందని తాము చెప్పిన మాట నిజమేనని అయినా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అన్నింటినీ తరలించడం కష్టమవుతుందన్నారు. సమయం ఇవ్వకుండా నాలుగు రోజుల్లోనే అంతా వెళ్లిపోవాలని చెప్పారని, ఉద్యోగులు వెళ్లడానికి మానసికంగా సిద్ధం కావాలి కదా అని ప్రశ్నించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో శుక్రవారం విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సాంస్కృతిక శాఖలపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయవాడ క్యాంపు కార్యాలయం, సమీపంలోనే ఆర్‌అండ్‌బీ భవనంలో ఫైళ్లు, ఇతర కార్యాలయాలకు వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జడ్జిలు, న్యాయాధికారులకు హోటళ్లు, అపార్టుమెంట్లు, విల్లాల్లో వసతి చూస్తున్నామని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల విచారణలో జాప్యం చేసేందుకే హైకోర్టు విభజన జరిగిందనే అనుమానం కలుగుతోందన్నారు. హైకోర్టు విభజన వల్ల కేసుల విచారణ మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. సీబీఐ కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని అప్పుడు విచారణ ప్రక్రియ మొదటికొస్తుందని చెప్పారు. ఏపీని దేశంలో భాగంగా కేంద్రం చూడటం లేదని, రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో నిర్వహించకుండా కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. కేంద్రం ఇప్పుడు రుణమాఫీ అంటే ఎన్నికల స్టంటేనని ఆరోపించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ సమాచారం పలు ప్రెస్‌మీట్లు, ఇతర సమావేశాల్లో అన్ని విషయాలు కేంద్రానికి చెప్పామన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై వైఎస్ జగన్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
జనాభా పెరగాల్సిన అవసరం ఉంది
పదేళ్లలో రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని, ఈ రేటు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముగ్గురు పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులయ్యే నిబంధనను మారుస్తామని, పంచాయతీ ఎన్నికల్లో ఈ నిబంధనను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు ఏర్పాటుచేయడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గించామని, మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, హైస్కూళ్లలో వంద శాతం ఫర్నిచర్, టాయిలెట్ల నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయించామని తెలిపారు. 11 ప్రైవేట్ యూనివర్సిటీలు రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. నాలుగున్నరేళ్లలో విద్యా రంగంలో 1.31 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని అందులో స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.79.50 వేల కోట్లు, ఉన్నత విద్యకు రూ. 15 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు.
వైద్య రంగంలో పలు పథకాలు తెచ్చాం..
వైద్యరంగంలో 24 పథకాలను పీపీపీ పద్ధతిలో అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ముఖ్యమంత్రి బాల సురక్ష, ఈ–ఔషధి, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, మహాప్రస్థానం, ఎన్టీఆర్ బేబీ కిట్స్, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు, 108 బైక్ అంబులెన్సులు కొత్తగా ప్రవేశపెట్టామన్నారు. పేదవాళ్లకు ఉచితంగా డయాలసిస్ చేయడమే కాకుండా, నెలకు రూ. 2,500 పింఛన్ ఇస్తున్నామన్నారు. 108 సర్వీసును సంస్కరించామన్నారు. మలేరియా కేసులను తగ్గించామని, విశాఖలో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు చేసి ఒకేచోట అన్ని వైద్యపరికరాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని, ఇది ప్రపంచానికే మోడల్ అని చెప్పారు. భవిష్యత్‌లో మరింతగా మానవ వనరులపై శ్రద్ధ పెడతామన్నారు. సేవల రంగంలో రాష్ట్రం వెనుకబడిందని, దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీలో సేవల రంగం వాటా తక్కువుగా ఉందని చెప్పారు.
హైకోర్టు ఏర్పాటుపై చంద్రబాబు సమీక్ష
హైకోర్టు ఏర్పాటుపై సీఎం చంద్రబాబు శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఎనిమిది కోర్టు హాళ్లు ఏర్పాటుకు అవకాశం ఉందని జీఏడీ అధికారులు చెప్పగా వెంటనే వాటిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ బంగ్లాలో న్యాయాధికారులు, ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జడ్జిలు, న్యాయాధికారులు, ఇతర ముఖ్యులకు బస కోసం అనువైన అన్నింటినీ పరిశీలించి వెంటనే ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పారు. మరోవైపు రాజధానిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనంపై కాంట్రాక్టు సంస్థ, సీఆర్‌డీఏ అధికారులతో సంప్రదింపులు జరిపారు. జనవరి 22 నాటికి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో అడ్వొకేట్ జనరల్, సీఆర్డీఏ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైకోర్టు విభజన తీరు సరిగా లేదు
Published Sat, Dec 29 2018 4:45 AM | Last Updated on Sat, Dec 29 2018 4:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment