సభలో నాతో మాట్లాడించరా?: చంద్రబాబు
అసెంబ్లీ ముగిసిన తర్వాత మాట్లాడిన చంద్రబాబు
అనుభవం ఉన్న వాడిని.. అభిప్రాయాలను కాగితంపై రాసివ్వాలా?
బిల్లును పార్లమెంట్‌కు పంపాలన్న తొందర రాష్ట్రపతికి ఎందుకో?
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ అనుభవం కలిగిన తనతో రాష్ట్ర విభజన బిల్లుపై శాసన సభలో మాట్లాడించరా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బిల్లుపై సభలో తనతో మాట్లాడించాల్సిన బాధ్యత స్పీకర్‌కు, ప్రభుత్వానికి ఉందన్నారు. ‘‘ప్రస్తుత సభలో ఉన్న వారిలో అన్ని రకాలుగా సుదీర్ఘ అనుభవం ఉన్నవాడిని. నా అభిప్రాయాలను కాగితాలపై రాసి స్పీకర్‌కు ఇవ్వాలా? నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడాలా? ఆమాత్రం విజ్ఞత లేదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన బిల్లుపై చర్చ ముగిసి, సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత శుక్రవారం చంద్రబాబు తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదేళ్లు సీఎంగా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కుట్రలో భాగమేనని ఆరోపించారు.
బిల్లుపై తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి చెబుతానన్నారు. విభజన తప్పని అనడంలేదని, అనుసరించే విధానమే తప్పని చెప్పారు. సీఎం కిరణ్ బలం పెంచేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. బిల్లును పార్లమెంట్‌కు పంపాలన్న తొందర రాష్ట్రపతికి ఎందుకో చెప్పాలని అన్నారు. ఈ అంశంపై త్వరలో రాష్ట్రపతిని, వివిధ పార్టీల జాతీయ నేతలను కలుస్తామని తెలిపారు. కిరణ్‌కు పాలన చేతకాకుంటే తమకు వదిలేయాలని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. స్పీకర్ సభలో తీర్మానం చదివిన నిమిషంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీడి యాతో ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తే తాము చేయగలిగింది ఏమీ లేదన్నారు.
ఈ విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తను ఇస్తున్నాం. సాక్షిని అనుమతించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలు అడిగి సమాధానం కోరేది.
1. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే మీ పార్టీ బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తుందా? వ్యతిరేకిస్తుందా? సూటిగా సమాధానం చెప్పగలరా? లేదా పార్లమెంటులో కూడా ఎంపీలకు ప్రాంతాలవారీగా ఎవరి వాదన వారు వినిపించమని చెబుతారా?
2. సుదీర్ఘ అనుభవం కలిగిన మీరు సభలో మాట్లాడమని స్పీకర్ కోరినప్పుడు ఈరోజు కాదు సోమవారం మాట్లాడతానని ఎందుకు దాటవేశారు? తెలంగాణపై ఏదో ఒక స్పష్టమైన వైఖరి చెప్పాల్సి వస్తుందనే ఇలా దాటవేశారని అంటున్నారు. నిజం కాదంటారా?
3. విభజన బిల్లు అసెంబ్లీకొచ్చిన తర్వాత 4 సార్లు బీఏసీ భేటీ జరిగినా ఏ ఒక్కదానికీ రాకపోవడంలోని ఆంతర్యమేమిటి? రెండు ప్రాంతాల్లో ఓట్లు పోతాయన్న భయంతో ఇలా ఎంతకాలం దాటవేస్తారు?