ఓ నిరుద్యోగిపై తల్లి ఆక్రోశం | Chandrababu Naidu must get award for cheating | Sakshi
Sakshi News home page

ఓ నిరుద్యోగిపై తల్లి ఆక్రోశం

Published Fri, Jan 30 2015 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

ఓ నిరుద్యోగిపై తల్లి ఆక్రోశం

ఓ నిరుద్యోగిపై తల్లి ఆక్రోశం

అటకెక్కిన రూ.2 వేల నిరుద్యోగ భృతి హామీ
  ఎన్నికల్లో యువత ఓట్ల కోసం గాలం
  అధికారం వచ్చాక ఆ ఊసెత్తని చంద్రబాబు
   నిరాశా నిస్పృహల్లో నిరుద్యోగులు
 
 ఉద్యోగం చేస్తాడని.. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడని చదివించాం. ఏ ఉద్యోగం రాలేదు.. ఓ నిరుద్యోగిపై తల్లి ఆక్రోశం. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటూ ఊళ్లో వాళ్లంతా అడుగుతుంటే సిగ్గేస్తోంది.. ఓ తండ్రి చిరాకు. ఏరా మాకంటే గొప్పగా చదివావు.. ఇంకా ఉద్యోగం రాలేదా?.. స్నేహితుల పరాచికాలు. ఇలా రోజూ నిరుద్యోగ యువకులు ఇంటాబయటా అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల వేళ ‘నిరుద్యోగ భృతిగా రూ.2 వేలు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. అధికార దండం చేతికొచ్చాక ఆ ఊసెత్తడమే మానేశారు. ఆయన హామీలు నమ్మిన జిల్లాలోని నిరుద్యోగ యువత తీవ్ర నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ఓట్ల కోసం నిరుద్యోగ భృతి అంటూ గాలం వేసిన చంద్రబాబు తీరా గెలిచాక ఆ ప్రస్తావనే తేవటం లేదు. పోనీ ఉద్యోగాలైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఉన్న ఉద్యోగులనే విడతల వారీగా తొలగిస్తున్నారు. దీనిపై నిరుద్యోగ యువత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
 - ఏలూరు సిటీ
 
 జిల్లా ఉపాధి కార్యాలయం లెక్కల మేరకు 58300 మంది తమ విద్యార్హతలను నమోదు చేయించుకున్నారు. వీరిలో ఎస్సీలు 18547 మంది, ఎస్టీలు 249 మంది, బీసీలు 28915 మంది ఉన్నారు. ఇక టెన్త్ అభ్యర్థులు 14293 మంది, ఇంటర్ 9226 మంది, డిగ్రీ 9721, స్టెనో 273, టైపిస్ట్ 2912, బీఎడ్ అభ్యర్థులు 2906, సెకండరీ గ్రేడ్ టీచర్ ఉపాధ్యాయులు 302, ఇంజినీరింగ్ డిప్లమో అభ్యర్థులు 1322, ఐటీఐ 11217మంది, ఇతరులు 4589మంది ఉన్నారు. వీరితో పాటు బీటెక్ విద్యార్థులు 15 వేల మంది, పీజీ అభ్యర్థులు 10 వేల మంది ఉన్నట్లు అంచనా. ఉపాధి కార్యాలయంలో నమోదు కాని నిరుద్యోగ యువత కూడా భారీగానే ఉంది. డీఎస్సీ-14 ప్రకటించినా జిల్లాలో కేవలం 506 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దీనిలో బీఎడ్ అభ్యర్థులు 25 వేల మంది ఉంటే, 223 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన నిరుద్యోగ అభ్యర్థులంతా ఖాళీగానే ఉంటున్నారు. ఇలా బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మశీ, పాలిటెక్నిక్, నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వస్తోంది.
 
 ఓట్ల కోసం జిమ్మిక్కు
 ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగ భృతి హామీ ఇవ్వగానే ఎంతో ఆనందించాం. అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నా హామీ కార్యరూపం దాల్చలేదు.
 - అబ్బదాసరి సురేష్, బీటెక్,
 ఏపీగుంట, నర్సాపురం మండలం
 
 ఉన్న ఉద్యోగం ఊడగొట్టారు
 చంద్రబాబు వస్తే ఉద్యోగం వస్తుందని.. నిరుద్యోగ భృతి కల్పిస్తామని విస్తృత ప్రచారం చేశారు. చంద్రబాబు రాగానే నాకున్న ఆదర్శ రైతు ఉద్యోగం ఊడిపోయింది.
 - అంబటి నరసింహమూర్తి, బీకామ్, ఉంగుటూరు
 
 యువత జీవితాలతో ఆడుకుంటున్నారు
 మా జీవితాలతో ఆటలాడుకుంటున్న చంద్రబాబును యువత ఊరుకోదు. యువత ఓట్లు వేయడం వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలి. నిరుద్యోగులకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకోవాలి.
 -పోలిశెట్టి సత్యప్రసాద్, రాయకుదురు
 
 హామీ నిలబెట్టుకోండి
  నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, లేని పక్షంలో భృతి కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అటకెక్కించేశారు. ఎన్నికల్లో ఇచ్చి న ఈ హామీని ముఖ్యమంత్రి అమలు చేయాలి.
 -  కె. ధర్మరాజు, లక్కవరం
 
 మాట తప్పితే గుణపాఠం తప్పదు
   చంద్రబాబు హామీతో నిరుద్యోగ భృతి వస్తుందని నాలాంటి ఎందరో నిరుద్యోగులు ఆశించారు. మాట తప్పితే భవిష్యత్తులో యువత సరైన గుణపాఠం చెబుతుంది.
 - ఎం.సూర్య, లక్కవరం
 
 ఉద్యోగాలైనా ఇప్పించండి
 నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే ఉద్యోగమో, ఉపా ధో కల్పించండి. రెండూ చేయకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. కూలి పనికెళ్లే అవకాశం కూడా లేక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నాం.  - పి.నరేష్, కవ్వగుంట
 
 ఇంజినీరింగ్ చదివినా ఏం లాభం
 వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఇంజినీరింగ్ చదివినా ఉపయోగం లేకపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇప్పిస్తే చాలు. ఇంట్లో తల్లిదండ్రుల బాధలు చూడలేకపోతున్నాం.
 - కె.నరేష్‌బాబు, బీటెక్ విద్యార్థి
 
 నిరుద్యోగుల్ని పట్టించుకోండి
 నిరుద్యోగులంతా చంద్రబాబుకే ఓటు వేసి గెలిపిస్తే ఆయన నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదు. ఇప్పటికైనా నిరుద్యోగ యువత సంక్షేమంపై దృష్టి సారించాలి.
 - ఎస్.కె.నియాజ్, ఐటీఐ విద్యార్థి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement