శిశు సంక్షేమం గాలికి! | Child welfare wind! | Sakshi
Sakshi News home page

శిశు సంక్షేమం గాలికి!

Published Sun, Nov 10 2013 3:29 AM | Last Updated on Fri, Oct 19 2018 7:14 PM

Child welfare wind!

 

=సీఎం జిల్లాలో ఆగిన అంగన్‌వాడీ భవన నిర్మాణాలు
 =స్థలం చూపలేక చేతులెత్తేసిన సీడీపీవోలు
 =నాబార్డు నిధులున్నా నిర్మాణానికి నోచుకోని భవనాలు
 =స్థలం ఎంపికలో చిక్కుముడి, మార్గదర్శకాల్లో లోపం
 =అద్దె భవనాల్లో 1662 అంగన్‌వాడీ కేంద్రాలు
 =కొన్నింటికి మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేదు


సాక్షి, చిత్తూరు:  సీఎం సొంత జిల్లాలోనే శిశుసంక్షేమ పథకానికి బీటలు పడుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు వారికి బుద్ధివికాస కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు మాత్రం అద్దెభవనాల్లో అరకొర వసతుల మధ్య నడుస్తున్నాయి. అయితే సొంత భవనాలు నిర్మించుకునేందుకు నిధులున్నా ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో చాలా చోట్ల ఆగిపోయాయి. జిల్లాలో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు 3,640, చిన్నవి 976 ఉన్నాయి.

వీటిలో 1662 అంగన్‌వాడీ ప్రాజెక్టులకు సొంత భవనాలు లేవు. వీటికి రెండేళ్లుగా నాబార్డు నిధులు మంజూరు చేసినా ఐసీడీఎస్ అధికారులు సొంత భవనాలు నిర్మించుకోలేకపోయారు. జిల్లాలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో పనిచేసే సీడీపీవోలు (చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు)  నాబార్డు కార్యక్రమం కింద మంజూరైన భవనాలకు స్థలాలను చూపాల్సి ఉంటుంది. వీరు సరైన స్థలం చూపకపోవడంతో భవనాలు నిర్మించలేకపోతున్నామని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.

భవనాలు కావాలని అడిగితే నాబార్డు 16 కార్యక్రమం కింద ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు గత ఏడాది 65 అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేసింది. ఇందులో కేవలం 10 భవనాల నిర్మాణం మాత్రమే అతికష్టంపై పూర్తి చేశారు. వారం రోజుల క్రితం నాబార్డు 18 కార్యక్రమం కింద 28 భవనాలకు తిరుపతి ప్రాజెక్టులో అనుమతి ఇచ్చారు. ఒక్కొక్క భవనానికి రూ.4 లక్షల నుంచి 6 లక్షలు నిధులు విడుదల చేశారు. ఇప్పుడు వీటి నిర్మాణానికి కూడా స్థల సమస్య ఎదురవుతోంది.
 
స్థల ఎంపికలో తిరకాసు

 ఐసీడీఎస్ రాష్ట్ర అధికారులు పంపించిన మార్గదర్శకాల ప్రకారం స్థల ఎంపికలోనే తిరకాసు పెట్టడంతో భవన నిర్మాణాల వ్యవహారం ముందుకు సాగలేదు. ఊర్లో అందరికీ అందుబాటులో ఉండేలా స్థలం చూడమనడంతో సీడీపీవోలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ భవననిర్మాణానికి అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఊరి మధ్యలో స్థలం అంటే దొరకని పరిస్థితి. శివారు ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే దానిని రెవెన్యూవారి అనుమతితో భవననిర్మాణానికి పొందాల్సి ఉంటుంది. దీనితో నిబంధనల్లో సూచించిన విధంగా తాము గ్రామాల్లో అంగన్‌వాడీభవనాలకు స్థలం చూపలేమని సీడీపీవోలు చేతులేత్తేశారు. దీనికితోడు గతంలో అంగన్‌వాడీ భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు నాలుగు, ఐదు సంవత్సరాలు గడిచినా ఐసీడీఎస్ అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పుడు భవనాలు నిర్మిం చేందుకు ముందుకు రావడం లేదు.
 
సమస్యల్లో అంగన్‌వాడీలు

 జిల్లాలో చాలా చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో అద్దెభవనాల్లో కొనసాగుతుండగా, కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీటి వసతీ లేదు. పిల్లలకు సంక్రమించే వ్యాధులు ఎక్కువగా నీటి కాలుష్యం ద్వారా వస్తుంటాయి. ప్రాథమికంగా ప్రభుత్వం రక్షిత మంచినీటి వసతి కల్పించాల్సి ఉండగా అద్దెభవనాల్లోనూ, సొంత భవనాల్లోని అంగన్‌వాడీల్లో కూడా ఈ సౌకర్యం లేదు. తంబళ్లపల్లె, ములకలచెరువు, కుప్పం మండలాల్లో అంగన్‌వాడీ ప్రాజెక్టుల నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉంది. తూర్పు మండలాల్లోని కేవీబీ.పురం, బీఎన్ కండ్రిగ తదితర మారుమూల ప్రాంతాల్లోని అంగన్‌వాడీల్లో కనీస వసతులు లేవు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లూ లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement