కలెక్టర్ల మధ్య ఇసుక దుమారం | Collectors between the sand storm | Sakshi
Sakshi News home page

కలెక్టర్ల మధ్య ఇసుక దుమారం

Published Mon, Oct 26 2015 12:24 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

కలెక్టర్ల మధ్య  ఇసుక దుమారం - Sakshi

కలెక్టర్ల మధ్య ఇసుక దుమారం

అందుబాటులోకి రాని డికాస్టింగ్ ఇసుక
సిద్ధంగా ఉందంటున్న శ్రీకాకుళం కలెక్టర్
ఇంకా ప్రారంభించలేదంటున్న విశాఖ కలెక్టర్
సీఎస్ వద్దకు చేరిన పంచాయతీ
ప్రత్యేక అధికారితో విచారణ-సీఎస్‌కు నివేదిక
 

నిర్మాణ రంగాన్ని సంక్షోభంలోకి  నెట్టిన ఇసుక ఇప్పుడు ఇద్దరు కలెక్టర్ల మధ్య దుమారం రేపింది. ఏకంగా చీఫ్ సెక్రటరీ రంగంలోకి దిగినా రాజకీయ కారణాల వల్ల పరిస్థితి సద్దుమణగలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇసుక అందుబాటులోకి వస్తే తప్ప జిల్లా అవసరాలు తీరే పరిస్థితి లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు.
 
 
విశాఖపట్నం : జిల్లాలో నెలకొన్న ఇసుక కొరత నిర్మాణ రంగాన్నే కాదు.. రాష్ర్ట ప్రభుత్వాన్ని కూడా కుదిపేస్తోంది. ప్రస్తుత అవసరాలకు 11 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అంచనా. స్థానికంగా ఆ స్థాయి లో ఇసుక లేకపోవడంతో జిల్లా యంత్రాంగం చేతులెత్తేసింది. చివరకు చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి కలెక్టర్లతో సమీక్షించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా పద్మాపురం మండలంలోని పలాస డిపో నుంచి 5,775, వీరఘట్టం మండలం కంబార రీచ్ నుంచి 40 వేలు, కొత్తూరు మండలం మాతాల వద్ద 8.30 లక్షలు, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండ లం గోపాలపురం రీచ్ నుంచి 30 వేల క్యూ.మీ ఇసుకను రప్పించాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం రీచ్ కోర్టు వివాదాల  నేపథ్యంలో మళ్లీ మూతపడింది. దీంతో విశాఖ అవసరాల కోసం పూర్తిగా శ్రీకాకుళం జిల్లా ఇసుకపైనే ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
పెండింగ్ ఆర్డర్స్‌కే సరిపోయింది..
 ఇప్పటి వరకు పొరుగు జిల్లాల నుంచి రప్పించిన సుమారు ఏడు వేల క్యూ.మీ ఇసుక పెండింగ్ ఆర్డర్స్‌కే సరిపోయింది. ప్రభుత్వ శాఖల అవసరాలకు తోడు మంత్రుల సిఫార్సులతో బల్క్ ఆర్డర్స్ కోసం ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో తమకు కేటాయించిన డికాస్టింగ్ రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు అనుమతించాలని కోరుతూ కలెక్టర్ యువరాజ్ శ్రీకాకుళం కలెక్టర్ లక్ష్మీనృసింహను కోరారు ‘తమ వద్ద ఇసుక సిద్ధం.. వాహనాలు పెట్టుకుంటే చాలు.. ఇసుక రవాణాకు ఏర్పాట్లు చేస్తాం’ అంటూ శ్రీకాకుళం జిల్లా అధికారులు చెప్పడంతో పది రోజులపాటు వరుసగా రీచ్‌ల వద్దకు వాహనాలను పంపడం.. ఇంకా తవ్వకాలు ప్రారంభం కాలేదంటూ వెనక్కి పంపడం జరిగేది. దీంతో విసుగెత్తిన విశాఖ ఉన్నతాధికారులు విషయాన్ని నేరుగా సీఎస్ కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు.

 రాజకీయ ఒత్తిళ్లతోనే..
 స్వయంగా సీఎస్ అడిగినా శ్రీకాకుళం జిల్లా అధికారుల నుంచి అదే సమాధానం రావడంతో అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు తొలుత విశాఖ జేసీని పంపించారు. హైదరాబాద్ నుంచి ఓ ఉన్నతాధికారిని స్వయంగా రీచ్‌ల వద్దకు పంపించి వాకబు చేశారు. వీరిద్దరు తమ నివేదికలను ఇప్పటికే సీఎస్‌కు ఇచ్చారు. వీటిపై ఆరా తీస్తే రాజకీయ ఒత్తిళ్లతోనే ఆ జిల్లా అధికారులు అలా చెబుతున్నారని తెలుసుకున్న సీఎస్‌కు సైతం ఏం చేయాలో పాలుపోని దుస్థితి ఏర్పడింది.

 మొదలుకాని డికాస్టింగ్ ఇసుక తవ్వకాలు
 వీరఘట్టం మండలం కంబార రీచ్ వద్ద ఇసుక ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేనట్టు గుర్తించారు. మాతాల వద్ద రైతుల పొలాల్లో పేరుకుపోయిన 8.30 లక్షల క్యూ.మీ. ఇసుక తవ్వకాలు ఇంకా మొదలు కాలేదు. దీని వెనుక రాజకీయశక్తుల హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా మంత్రి ఒత్తిళ్లతోనే విశాఖ అవసరాలకు ఇసుక ఇచ్చేందుకు స్థానిక రైతులు విముఖత ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే డికాస్టింగ్ ఇసుక తవ్వకాలు ఇంకా మొదలు కాలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం చివరకు శ్రీకాకుళం-విశాఖ జిల్లా కలెక్టర్ల మధ్య చిచ్చుకు కారణమైంది. వీరి మధ్య మాటల యుద్ధానికి తెరతీసినట్టు సమాచారం. ఇసుక వివాదం నేపథ్యంలో ఇరువురు మాట్లాడుకోవడం లేదని చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement