‘వార్’పై సంయమనం
- మావోయిస్టు అమరుల వారోత్సవాలు తొలిరోజు ప్రశాంతం
- ప్రజాప్రతినిధులకు మరింత భద్రత
పాడేరు : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు తొలిరోజు ప్రశాంతత నెలకొంది. ఏజె న్సీ, ఆంధ్రా ఒడిషా సరిహద్దులో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోవడంతో గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తుండడంతో మారుమూల పల్లెల్లో జన సంచారం పెద్దగా లేదు. మావోయిస్టుల జాడ కూడా కానరాలేదు. కానీ ముందస్తు జాగ్రతగా మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల సర్వీసులను నిలిపివేశారు.
పోలీసులు కూడా ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీని చేపడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ జరుగుతోంది. అదనపు పోలీసు బలగాలను కూడా అన్ని పోలీసు స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంచారు. రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్, నర్సీపట్నం ఓఎస్‌డీ ఏఆర్ దామోదర్ ఏజెన్సీలోని పరి స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పాడేరు ఏఎస్పీ బాబూజీ, చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్‌లు కూంబింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ఇళ్లకే పరిమితమైన ప్రజాప్రతినిధులు
వారోత్సవాలు ముగిసేంత వరకు ప్రజా ప్రతినిధులంతా మారుమూల గ్రామాల సందర్శనలు మానుకోవాలని పోలీసుశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో వారంతా మండల కేంద్రాలు, ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసు శాఖ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతరస్థానిక ప్రజాప్రతినిధులందరికీ గట్టి రక్షణ చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలను కలిసే వారిని క్షుణంగా పరిశీలించాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యేలకు రక్షణగా ఉన్న గన్‌మెన్లంతా మరింత అప్రమత్తమయ్యారు.
పాడేరులో మావోయిస్టు యాక్షన్ టీం సంచరిస్తుందనే సమాచారంతో పోలీసులు నిఘా చర్యలను ముమ్మరం చేశారు. పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులకు భద్రతను మరింత పెంచారు. అలాగే మారుమూల గ్రామాలలోని ఎంపీటీసీలు, సర్పంచులు కూడా సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారు.