వర్షం కురిసింది.. మన్యం మురిసింది
♦ చల్లబడ్డ ఏజెన్సీ వాతావరణం
♦ వేసవి తీవ్రత నుంచి ఉపశమనం
♦ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
పాడేరు : మన్యంలో వర్షాలు ఊపందుకుంటున్నాయి. నాలుగైదు రోజులుగా ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన్యం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మన్యంలో ఎండల తీవ్రతకు జనం అల్లాడిపోయారు. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో లక్షలాది చెట్లు నేలకొరగడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఈ సారి వేసవి తీవ్రత అధికంగా కనిపించింది.
15 రోజులుగా మన్యంలో మండిన ఎండల వల్ల చింతపల్లి, కొయ్యూరు, పాడేరు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లో వడదెబ్బకు గురై పలువురు మృతి చెందారు. ఎండల తీవ్రతకు వృద్ధులు, పిల్లలు అవస్థలు పడ్డారు. పాడేరు పరిసర ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో మధ్యాహ్నం గంటకు పైగా భారీ వర్షం కురవడంతో వేసవి తాపం నుంచి జనానికి పూర్తి ఉపశమనం కలిగింది. బాకూరు, హుకుంపేట, పాడేరు పరిసరాల్లో పిడుగులు, వడగళ్లతో వర్షం కురిసింది.