ఈ డాక్టరుకు కబ్జారోగం
వైద్య వృత్తికి బై - ఆక్రమణకు సై ఆక్రమించాక సెటిల్‌మెంటు
భూకబ్జాలతో పలు దందాలు
విశాఖలో అరెస్టయిన నెల్లూరు వాసి
విశాఖపట్నం : చదివింది ఎంబీబీఎస్.. చేస్తోంది భూ కబ్జాలు, మోసాలు. నెల్లూరు నుంచి విశాఖ వచ్చి ఓ ముఠాను ఏర్పరుచుకుని భూ యజమానులను బ్లాక్‌మెయిల్ చేస్తూ సొమ్ములు గడిస్తున్నాడు. ఇప్పటికే రెండు జిల్లాల్లోనూ అనేక కేసులు పెండిం గ్‌లో ఉన్నాయి. తాజాగా కోట్ల రూపాయల విలువ చేసే భూ మిని దౌర్జన్యంగా ఆక్రమించడానికి స్కెచ్ గీసి పోలీసులకు చిక్కాడు. ఏసీపీ దాసరి రవి బాబు ఇతని భూకబ్జా వివరాలను సోమవారం విలేకరుల తెలియజేశారు. నెల్లూరు జిల్లా విడతలూరు మండలానికి చెందిన ఒంటేలు నాగేంద్రకుమార్ ఎం.బి.బి.ఎస్ వరకూ చదువుకున్నాడు. ఖాళీ భూములను కబ్జా చేయడాన్ని వృత్తిగా పెట్టుకున్నాడు. 8 సంవత్సరాలుగా భూమిని ఆక్రమించి తరువాత అసలు యజమానులతో సెటిల్‌మెంట్లు చేసి అడ్డంగా ఆర్జించడాన్ని అలవాటుగా పెట్టుకున్నాడు. ఈ పరంరలో మధురవాడ సర్వేనెంబరు 2 లో ఉన్న ఎకరా భూమి తనదే అని ప్లాట్లు వేసి విక్రయంచడానికి నకిలీ పత్రాలు సృష్టించాడు.
ఈ విషయం హక్కు దారులకు తెలియడంతో అసలు రంగు బయట పడింది. ఆ భూమిని 1984లో హైదరాబాదుకు చెందిన గుత్తా బాపినీడు మరో 10 మంది కొనుగోలు చేశారు. తమ భూమిని అక్రమించడాన్ని అడ్డుకున్న బాపినీడును, అతని కుటుంబ సభ్యులను రౌడీయిజంతో భయబ్రాంతులకు గురి చేసాడు. దీంతో బాధితులు పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు నాగేంద్రపై సోమవారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాగేంద్ర, అతని అనుచరగణంపై నెల్లూరు జిల్లా అల్లూరు, విడలూరు, విశాఖ పీఎంపాలెం, మధురవాడ పోలీస్‌స్టేషన్‌లో అనేక కేసులు పెడింగ్‌లో ఉన్నాయి. విజయవాడ, హైదరాబాద్‌లకు చెందిన కొందరితో పాటు స్థానికంగా ఓ గ్రూఫును ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా ఎంవీపీలో ఇళ్లు తీసుకుని ఉంటూ స్టార్ హోటల్‌లో సెటిల్‌మెంట్లు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా అల్లూరు స్టేషన్‌లో మే, 2012లో ఐపిసి 323,506తో సెక్షన్లతో పాటు పోటా యాక్ట్ నమోదు చేశారు. జూన్‌లో మరో కేసు జూన్‌లో, ఇంకో కేసు సెప్టెంబర్‌లో ఐపిసి 506 సెక్షన్‌లో నమోదయ్యాయి.నెల్లూరు జిల్లా విడవల్లూర్‌లో 2014 సెప్టెంబర్‌లో వివిధ సెక్షల కింద కేసు నమోదు చేశారు. పిఎం పాలెంలో 2015 ఏప్రిల్‌లో కేసు పెట్టారు.