అమెరికాలో అమ్మ ఆలయం
విజయవాడ : కనకదుర్గమ్మ దేవాలయ ప్రతిష్టను అంతర్జాతీయస్థాయికి పెంచేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికి ప్రవాస భారతీయుల నుంచి పూర్తి సహకారం అందుతోందని తెలిసింది. ఇటీవల నగరానికి వచ్చిన తానా ప్రతినిధులు దుర్గగుడి ఈవో సీహెచ్ నర్సింగరావును కలిశారు. ఇప్పటికే అమెరికాలో వెంకటేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాలు ఉన్నాయని, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దుర్గమ్మ ఆలయాన్ని నిర్మించాలని కోరారు.
దీనిపై ఈవో స్పందిస్తూ దేవస్థానానికి అంతర్జాతీయస్థాయిలో ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రభుత్వ అనుమతి తీసుకుని అమెరికాలో అమ్మవారి దేవాలయం నిర్మించడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. తాము కూడా ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తామని, ఇందుకు కావాల్సిన స్థలాన్ని ఇప్పిస్తామని, ఇక్కడి దేవాలయం నమూనాలోనే అక్కడా అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలని తానా ప్రతినిధులు కోరినట్లు తెలిసింది.