భూసారం తెలిసేదెలా..!
- ఏఎంసీల్లో మూతపడ్డ పరీక్ష కేంద్రాలు
- జిల్లాలో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లారైతులకు భూసార ఫలితాలు తెలుసుకోవడం ఒక పరీక్షే. జిల్లాలో భూ విస్తీర్ణానికి అనుగుణంగా పరీక్ష కేంద్రాలు లేకపోవడం, ఉన్నవాటిలో సైతం అంతంతమాత్రపు సిబ్బందితో నిర్వహించడం ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్వహించే భూసార పరీక్షలతో ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంటోంది. భూమిలో ఉండే పోషకాలను బట్టి రైతులు పంటమార్పిడి, ఎరువులను వినియోగిస్తే ఫలితం ఉంటుంది. దీని వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.
రైతులను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఖరీఫ్ ప్రారంభంలో భూసారపరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ. రెవెన్యూ గ్రామానికి 10 చొప్పున గ్రామీణ జిల్లాలో 8,100 మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్ష ఫలితాలను వీలైనంత తొందర్లో రైతులకు అందించేందుకు వ్యవసాయశాఖ చేస్తున్న ప్రయత్నాలు కేంద్రాలు, సిబ్బంది కొరత విఘాతం కలిగిస్తున్నాయి.
భూసారంపై అవగాహన లేకపోవడంతో రైతులు అవసరానికి మించి ఎరువులు వినియోగించడం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా మరికొన్ని చోట్ల వ్యవసాయం అంటేనే విరక్తి చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం భూసార పరీక్షలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి వాటిని నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేసింది.
అరకొర కేంద్రాలు
అయితే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాటికి అనుకూలమైన పరిస్థితులను కల్పించడంలో విఫలమౌతోంది. ఒక భూమిలో సేకరించిన నమూనాకు నైట్రోజన్, సల్ఫర్, జింక్, కాపర్ వంటి మొత్తం 16 రకాాల ఫలితాలు సేకరించవలసి ఉంటుంది. గతంలో ఈ పరీక్షలను నర్సీపట్నం, పాడేరు మార్కెట్ కమిటీలతో పాటు అనకాపల్లి భూసార పరీక్ష కేంద్రం, విశాఖ మొబైల్ యూనిట్లలో చేసేవారు.
ప్రస్తుతం పాడేరు, నర్సీపట్నంలలో నిర్వహించే పరీక్ష కేంద్రాలకు మార్కెట్ కమిటీలు నిధులు మంజూరు చేయకపోవడంతో వాటిని తాత్కాలికంగా మూసివేశారు. మిగిలిన వాటిలో విశాఖ మొబైల్ యూనిట్ మూడు జిల్లాల పరిధిలో నమూనాలకు పరీక్షలు నిర్వహించవలసి ఉంది. ప్రధానంగా అనకాపల్లి భూసార పరీక్ష కేంద్రంలోనే జిల్లా నమూనాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల రోజుకు 50 నమూనాలకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్‌కోతలు విధించడం వల్ల ఈ పరీక్షల నిర్వహణకు గండి పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ ప్రారంభానికల్లా నమూనాల ఫలితాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.