కాడెద్దులు తప్పిపోయాయని ప్రాణాలు వదిలిన రైతు
బొంరాస్‌పేట, న్యూస్‌లైన్: కాడెద్దులు రైతుల జీవితంలో అంతర్భాగం. వారి ఆరో ప్రాణం. అవి లేకుంటే పొద్దు గడవదు. కుటుంబాన్ని ఆదుకుంటు న్న అవి కనిపించకుండా పోతే.. ఆ ఊహనే భరించలేరు. వాస్తవంలో తాను ప్రేమతో చూసుకుంటున్న ఎద్దులు తప్పిపోతే తట్టుకోలేక ఆ యాదిలో వునస్తాపంతో ఓ రైతు ఏకంగా ప్రాణాలనే విడిచాడు. గుండెలను కదిలించే ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం జరిగింది. బొంరాస్‌పేట మండలం రేగడి మైలారం గ్రామానికి చెందిన ముసులగళ్ల చిన్న మొగులప్ప(58) ఏడాదిన్నర క్రితం రూ.40 వేలు పెట్టి కాడెద్దులు కొన్నాడు. వాటితో పాటు, తాము పెంచుకుంటున్న కోడె కూడా నెల రోజుల కిందట తప్పిపోయాయి. ఎద్దుల ఆచూకీ కోసం ఊరూరా తిరిగాడు. రూ.10 వేలు ఖర్చుచేసి అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి కోడెదూడ కనిపిం చినా, కాడెద్దులు మాత్రం చిక్కలేదు. దీంతో బెంగ పెట్టుకున్న మొగులప్ప తిండి తినడం మానేశాడు. ఇలా వేదన పెరిగి శనివారం తెల్లవారుజామున నిద్రలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు, స్థానికులు కంటతడి పెట్టారు.