పెళ్లి ముహూర్తాలకు బ్రేక్
శ్రీకాకుళం కల్చరల్: పెళ్లి ముహూర్తాలకు బ్రేక్ పడింది. వచ్చే రోజుల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి భాజాలు మోగే అవకాశమే లేదని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 17 నుంచి జూలై 16 వరకు అధిక ఆషాఢమాసం, జూలై 17 నుంచి ఆగస్టు 14 వరకు నిజ ఆషాఢం వస్తోంది. దీంతో ఈనెలలో కల్యాణ ముహూర్తాలు ఉండవు. తరువాత ఆగస్టు 10 నుంచి 20 వరకు శుక్రమౌఢ్యం, సెప్టెంబర్ 9 వరకు గురుమౌఢ్యం ఉంది. అలాగే, జూలై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు కూడా ఉన్నాయి. శ్రావణ, భాద్రపద మాసాలలో కూడా మంచి ముహుర్తాలు లేకవడంతో అక్టోబరు వరకు పెళ్లి ముహుర్తాలు లేనట్టే. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నాలుగు నెలలపాటు వేచి ఉండాల్సిందే.
ఆందోళనలో చిరువ్యాపారులు
పెళ్లిళ్లు, శుభకార్యాలే ఆధారంగా జీవిస్తున్న చిరువ్యాపారులకు కష్టాలు ఆరంభమయ్యాయి. ఈ నెల 13 నుంచి మంచి ముహూర్తాలు లేవు. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగే అవకాశం లేదు. నాలుగు నెలల పాటు వ్యా పార కష్టాలు ఎదుర్కోవాల్సిందే నంటూ వాపోతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధిని చూసుకోవాల్సిందేనంటూ లైటింగ్, బ్యాండ్‌మేళం, సప్లయర్స్, పూల పందిళ్ల డెకరేషన్, వంట పనివారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పెళ్లి సీజన్ లేకపోతే ఖాళీ
పెళ్లిముహుర్తాలు కొన్నాళ్లు లేకపోతే ఖాళీగా ఉండాల్సిందే. మావద్ద కొందరు పని చేస్తున్నారు. వాళ్లకీ మా పరిస్థితే. పనిలేకపోయినా ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది. సామాన్లు బాగుచేయించుకుంటున్నాం. మళ్లీ సీజన్‌కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం.
-కె.కొండయ్య,
గుడ్‌విల్ సప్లయిర్స్,
శ్రీకాకుళం
ఇబ్బందులు తప్పవు
పెళ్లి ముహూర్తాలు లేకపోతే ఇబ్బందు తప్పవు. ఆదాయం లేకపోవడంతో స్టుడియోలో ఖాళీగా ఉంటున్నాం. మళ్లీ సీజన్ వరకు వేచి ఉండాల్సిందే. ఈ సమయంలో మా కుటుంబం నడిపించుకోవడానికి వేరే పనికి వెళ్లలేక అప్పుచేసి కాలం గడపాల్సిన పరిస్థితి.
-మహమ్మద్ అబ్దుల్,
ఫొటో స్టూడియో
ముహూర్తాలే మాకు ఆదాయం
ఏడాదిలో పెళ్లి ముహుర్తాలే మాకు ఆదాయం. ఈ ఏడాది మూఢాల వల్ల ఆదాయం తగ్గిపోయినట్లే. నా వద్ద పది మంది వరకు శిష్యులు ఉన్నారు. వాళ్లు, వాళ్ల కుటుంబసభ్యులు కూడా ఈ పనిపైనే ఆధారపడి ఉన్నారు. మూఢాల సమయంలో ఇతర పనులు, పూజలు కూడా ఉండవు. ఖాళీగా ఉండాల్సి వస్తోంది.
-పి.నర్సింహమూర్తి,
పురోహితుడు