విజయవాడలో స్మార్ట్ గ్రిడ్
కరెంటును ఎంత వాడుకుంటున్నారు, రాబోయే 24 గంటల్లో ఎంత డిమాండు ఉంటుందనే విషయాన్ని కూడా కనిపెట్టే స్మార్ట్ గ్రిడ్ ఒకటి విజయవాడకు త్వరలో రానుంది. జపాన్కు చెందిన ఫుజి ఎలక్ట్రిక్ సంస్థ ఈ గ్రిడ్ను ఏర్పాటు చేయనుంది. ఏపీ సీఎం చంద్రబాబును శుక్రవారం కలిసిన ఫుజి ప్రతినిధులు ఆయనకు విజయవాడలో పైలట్ ప్రాతిపదికన స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటుచేస్తున్న విషయాన్ని తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫీజిబులిటీ స్టడీలను కంపెనీ ఇప్పటికే పూర్తిచేసింది. కొత్త రాజధానికి కూడా ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలలో భవనాల మీద సెన్సర్లను అమరుస్తారు. అవి ఇంధన వినియోగాన్ని ముందుగా అంచనా వేసి, దాని ప్రకారం ఎంత అవసరమో చెబుతాయి. డిమాండ్ తక్కువగా ఉంటే, విద్యుత్తును వేరే గ్రిడ్కు పంపేందుకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. ఈ పరిజ్ఞానంతో విద్యుత్ సరఫరాలో వస్తున్న నష్టాలను 12.9 శాతం నుంచి 6 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం.