ఆంధ్రుల హక్కులు కాపాడాలి | Granting special status to the state Andhrula rights | Sakshi
Sakshi News home page

ఆంధ్రుల హక్కులు కాపాడాలి

Published Sun, Aug 2 2015 2:21 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Granting special status to the state Andhrula rights

 అనంతపురం ఎడ్యుకేషన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి ఆంధ్రుల హక్కులు కాపాడాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టవర్‌క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ సాగిం ది. అక్కడ మానవహారం నిర్వహించి తిరిగి టవర్‌క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ.యోగీశ్వర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, ప్రధాన కార్యదర్శి మారుతీ ప్రకాష్ మాట్లాడారు. గత యూపీఏ ప్రభుత్వం తెలుగుజాతిని రెండుగా విడదీస్తామంటే ఎన్‌డీఏ మద్దతు ఇచ్చిందన్నారు. పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కనబర్చలేదని, తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఎన్నికల ముందు మాట్లాడిన నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.
 
 ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి మద్ధతునిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం ఢిల్లీ నడివీధుల్లో ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తన పార్టీకి చెందిన ఎంపీలతో ఏ రోజైనా ప్రత్యేక హోదా విషయంపై ప్రధానమంత్రితో చర్చించారా? అని ప్రశ్నించారు. సింగపూర్, జపాన్ అంటూ పర్యటనలకే పరిమితమవుతున్నారన్నారు. కరువుకు నిలయంగా మారిన అనంతపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు సుధీర్‌రెడ్డి, లోకేష్‌శెట్టి, నగర అధ్యక్షులు జంగాలపల్లి రఫి, పెద్దన్న, మంజునాథ్, యువజన విభాగం నగర అధ్యక్షులు మారుతీనాయుడు, నాయకులు గోపి, సాకే నవీన్, సురేష్‌రెడ్డి, రాజునాయక్, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, బాబ్‌జాన్, హరి తదితరులు పాల్గొన్నారు.
 
 సమష్టిగా పోరాడుదాం: కాపు
 రాయదుర్గం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న ఎన్డీఏ ప్రకటన ఆంధ్రప్రదేశ్‌ను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని, ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షాలు సమష్టి పోరుకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శని వారం అఖిలపక్ష నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా లేకపోతే రాయలసీమ జిల్లాలు మరింత వెనుకపడిపోతాయ న్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఈనెల 10న ఢిల్లీలో దీక్షచేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
 
 11న జిల్లా బంద్ : సీపీఐ
 కళ్యాణదుర్గం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌పై ఈనెల 10లోగా సీఎం చంద్రబాబు స్పందించకపోతే 11న జిల్లా బంద్ నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎంవీ రమణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ సంజీవప్ప, సర్పంచ్ తిరుపాల్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అసోం, ఛత్తీస్‌గఢ్,  అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు విభజన సం దర్భంగా ప్రత్యేక హోదా కల్పించారని అదే తరహాలోనే రాష్ట్రానికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలోవ్యవసాయ రుణాలకు బీమా గడువు సెప్టెంబర్ వరకు పొడిగించాలని కోరారు.
 
 కేంద్రం నుంచి
 టీడీపీ వైదొలగాలి: డీసీసీ
 పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివా రం పట్టణంలోని కోటా కాంప్లెక్స్‌లో కాంగ్రెస్ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పక్షాలతో కలసి టీడీపీ, బీజేపీ నాయకులు ప్రత్యేక హోదా సాధించుకునేందుకు కలసి వస్తే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement