సోమవారం ఉదయం విజయవాడ రైల్వేస్టేషన్‌లో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలును భౌతికదూరం పాటిస్తూ ఎక్కుతున్న ప్రయాణికులు
సాక్షి, అమరావతి: దాదాపు 71 రోజుల తర్వాత రైళ్లు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ప్రధాన రైల్వేస్టేషన్లు సందడిగా మారాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్లకు చేరుకున్నారు. రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివచ్చారు. స్టేషన్‌లలో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపించారు. ప్రయాణం పూర్తయ్యేవరకు ప్రయాణికులు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కడప, గుంతకల్ ఇలా ప్రధాన స్టేషన్‌లన్నీ కళకళలాడాయి. ఈ నెల 29 నుంచి తత్కాల్ టికెట్లను కూడా జారీ చేయనున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి సోమవారం వివిధ ప్రాంతాలకు 9 రైళ్లు బయలుదేరాయి.
► హైరిస్క్ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు చేసి వారం పాటు క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం మరో వారం హోం క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలు విధించారు.
► చెన్నై, ముంబై, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌లను హైరిస్క్ ఉన్నవిగా గుర్తించారు.
► ఏపీ హెల్త్ ప్రొటోకాల్‌ను ప్రకటించిన 18 స్టేషన్లలో దిగే ప్రయాణికుల్లో ప్రతి కంపార్ట్‌మెంట్‌లో 5 శాతం మందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 60 ఏళ్లు పైన చిన్నారులు, పదేళ్ల లోపు ఉన్నవారు, గర్భిణులు, అస్వస్థతకు గురైన వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌కు అనుమతిస్తున్నారు. వీరికి రైల్వే స్టేషన్లలోనే స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తారు.
► విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే.. వారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గుర్తించిన ల్యాబ్ నుంచి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.
18 రైల్వేస్టేషన్లలోనే హాల్ట్
సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైన 200 ప్రత్యేక రైళ్లలో ఏపీ మీదుగా 22 రైళ్లు వెళుతున్నాయి. వీటికి 71 హాల్ట్‌లను ఇవ్వడంతో వీటన్నింటిలో ప్రయాణికులకు పరీక్షలు చేయడం కష్టం కాబట్టి 18 రైల్వేస్టేషన్లకు మాత్రమే హాల్ట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్‌కు లేఖ రాశారు. ఇందుకు సానుకూల స్పందన వచ్చింది. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, మంగళగిరి, కడప, గుంతకల్, ఆదోని, మంత్రాలయం, అనంతపురం, ఒంగోలు, నెల్లూరు, కుప్పం, రేణిగుంటల్లో మాత్రమే హాల్ట్ ఉంటుంది.
ఏపీ మీదుగా నడిచిన 11 జతల (22) రైళ్లు ఇవే..
► రెండు వైపులా నడిచే హైదరాబాద్–విశాఖపట్నం (గోదావరి ఎక్స్‌ప్రెస్),
► గుంటూరు–సికింద్రాబాద్ (గోల్కొండ),
► తిరుపతి–నిజాముద్దీన్ (రాయలసీమ),
► విశాఖ–న్యూఢిల్లీ (ఏపీ ఎక్స్‌ప్రెస్),
► ముంబై–భువనేశ్వర్ (కోణార్క్),
► ముంబై–బెంగళూరు (ఉద్యాన్),
► దాణాపూర్–బెంగళూరు (సంఘమిత్ర),
► హౌరా–సికింద్రాబాద్ (ఫలక్‌నుమా),
► హౌరా–యశ్వంత్‌పూర్ (దురంతో),
► న్యూఢిల్లీ–బెంగళూరు, న్యూఢిల్లీ–చెన్నై.
Comments
Please login to add a commentAdd a comment