అనంతపురం క్రైం/తాడిపత్రి, న్యూస్‌లైన్:చమటోడ్చి డబ్బు సంపాదించి, అప్పు తీర్చాల్సిన ఆ యువకులు నేరానికి పాల్పడ్డారు. ఉపాధి కల్పించిన అధికారినే టార్గెట్ చేశారు. బెదిరిస్తే పెద్ద ఎత్తున డబ్బు తెచ్చిస్తాడని కలగన్నారు. పోలీసుల ఉచ్చులో చిక్కుకుని ఆరుగురు ముఠా సభ్యులు కటకటాల పాలయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వైఎస్సార్ జిల్లాలో పైడిపాళ్యం రిజర్వాయర్ నిర్మాణ పనులను చేపట్టిన హిందూస్థాన్ ఇంజనీరింగ్ సిండికేట్ కంపెనీ మేనేజర్‌గా ఇంజనీర్ సుబ్రమణ్యం పని చేస్తున్నారు. ఆ పనుల్లో కొంత భాగాన్ని వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం డొంకపల్లికి చెందిన జగదీశ్వరరెడ్డి, లక్ష్మిరెడ్డి సబ్ కాంట్రాక్టు చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా యాడికి మండలం, బోగాలకట్ట గ్రామానికి చెందిన బాబయ్య వద్ద అత్యవసరమై జగదీశ్వర్‌రెడ్డి రూ.70 వేలు చేబదులు తీసుకున్నాడు.
ఆ డబ్బును చెల్లించాలంటూ బాబయ్య ఒత్తిడి చేశాడు. దీంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇంజనీర్ సుబ్రమణ్యంను బెదిరించేందుకు పూనుకున్నాడు. వెంటనే తోటి సబ్ కాంట్రాక్టర్ లక్ష్మిరెడ్డి, బాబయ్య, ఇతని చిన్ననాటి మిత్రులైన శివ(జేసీబీ డ్రైవర్), రమేష్, ప్రసాద్(ప్రస్తుతం వెంకటాంపల్లిలో నివాసం ఉంటున్నాడు)తో ముఠా కట్టాడు. పథకంలో భాగంగా ఆదివారం సాయంత్రం తాళ్లపొద్దుటూరు శివారుల్లోని ఓ డాబాకు చేరుకుని, సుబ్రమణ్యంకు ఫోన్ చేశారు. తక్షణమే రూ.20 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో కిడ్నాప్ చేసి హతమారుస్తామంటూ బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన ఆయన తన మిత్రుల సలహాతో సోమవారం ఉదయం కొండాపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
రూ.10 లక్షలు తీసుకెళ్లి ట్రాప్
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఠా సభ్యుల సూచన మేరకు కొండాపురం, తాడిపత్రి మండల సరిహద్దుల్లో రూ.10 లక్షల నగదుతో సుబ్రమణ్యం వేచి ఉండాలని పోలీసులు సూచించారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ముఠా సభ్యులందరూ ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. ఆయన నుంచి డబ్బు తీసుకుంటుండగా అక్కడికి సమీపంలోనే మాటు వేసిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అదనపు ఎస్పీ అప్పలనాయుడు నేతృత్వంలోని అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐ, వైఎస్సార్ జిల్లా తాళ్లపొద్దుటూరు సీఐ, జమ్మలమడుగు సీఐల పోలీసు బృందాలు మూకుమ్మడిగా దాడి చేసి ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నాయి. ఆ ముఠాను జమ్ములమడుగుకు తరలించారు. ఏఎస్పీ నేతృత్వంలో విచారణ జరుపుతున్నారు. కాగా ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు.