పల్లె.. గుల్ల! | Heavily increased taxes | Sakshi
Sakshi News home page

పల్లె.. గుల్ల!

Published Sat, Apr 2 2016 3:38 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

పల్లె..   గుల్ల! - Sakshi

పల్లె.. గుల్ల!

భారీగా పెరిగిన పన్నులు
కుళాయి కనెక్షన్‌కు రూ.10 వేలు
లెసైన్సు ఫీజు ఏకంగా 100 శాతం అధికం
బిల్డింగ్ అనుమతి రుసుము భారీగా పెంపు
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్నులు
 

 సాక్షి ప్రతినిధి, కర్నూలు:  పల్లెలకు పన్నుల సెగ తగిలింది. కుళాయి కనెక్షన్ మొదలు.. బిల్డింగ్ అనుమతి, ఇతర అన్నిరకాల పన్నులు భారీగా పెంచేశారు. 5 నుంచి 150 శాతం వరకు వివిధ రకాల పన్నులు పెరిగాయి. ఇకపై గ్రామాల్లో కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఏకంగా రూ.10 వేల మేరకు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటి పన్ను కూడా 5 శాతం మేరకు పెరిగింది. లెసైన్స్ ఫీజు మొత్తం కూడా 100 శాతం అధికం చేస్తూ నిర్ణయించారు. పెంచిన పన్నుల భారం ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది.

 అన్నింటిలోనూ పెంపే..
గ్రామ పంచాయతీల ఆదాయం పెంచుకునేందుకు భారీగా పన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ఇంటికి కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఏకంగా రూ.10 వేల రూపాయలు చెల్లించాల్సి రానుంది. కుళాయి కనెక్షన్‌కు మొన్నటి వరకు రూ.5 వేలు మాత్రమే ఉండేది. తాజా మార్పుతో ఏకంగా 100 శాతం భారం పడుతోంది. ఇక బిల్డింగ్
 
అనుమతి ఫీజు కూడా భారీగానే పెరిగింది. మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం బిల్డింగ్ ఫీజు చదరపు అడుగునకు రూ.24లుగా ఉంది. ఇది కాస్తా ప్రస్తుతం రూ.85లకు చేరుకుంది. అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలో మార్కెట్ వేలాల ఫీజు కూడా 50 శాతం మేరకు పెంచారు. ఉదాహరణకు.. దేవనకొండ మేజర్ గ్రామ పంచాయతీలో మార్కెట్ వేలం ఫీజు రూ.3 లక్షల నుంచి రూ.4.5 లక్షలకు చేరుకుంది. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల మోత మోగుతోంది.

 పంచాయతీలపై ఒత్తిళ్లు
 పంచాయతీల్లో పన్నుల పెంపునకు తీవ్ర ఒత్తిళ్లు అధికమయ్యాయి. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరెంటు బిల్లుల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. దీంతో పన్నుల భారం వేయాల్సిన అవసరం పంచాయతీలకు ఉండేది కాదు. అయితే, ఈ కరెంటు బిల్లుల భారాన్ని మొత్తం పంచాయతీలే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఆర్థిక సంఘం నిధులు కూడా నేరుగా పంచాయతీలకే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

అయితే, ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలంటే అందులో 50 శాతం కచ్చితంగా పంచాయతీలే భరించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కాస్తా పంచాయతీల ఆదాయ వనరులను తప్పక పెంచుకోవాల్సిన పరిస్థితికి కారణమయింది. ఈ నేపథ్యంలో పన్నుల పెంపు దిశగా  పంచాయతీలు అన్వేషణ ప్రారంభించాయి. ఇందులో భాగంగా 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి పన్నుల భారాన్ని మోపడం మొదలయింది. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజల జేబుకు చిల్లు పడుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement