'ప్రజలకు మంచి చేయాలనే సీఎం కావాలనుకున్నా'
ఒంగోలు : ప్రజలకు మంచి చేయాలనే తాను ముఖ్యమంత్రిని కావాలనుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారమిక్కడ అన్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల సమీక్షలను ఆయన రెండోరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో పాటు, టీడీపీ చేస్తున్న అరాచకాలను కలిసికట్టుగా ఎదిరిద్దామంటూ వారిలో ధైర్యం నింపారు.
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి వచ్చిన మెజార్టీ కేవలం అయిదు లక్షల ఓట్లు అని వైఎస్ జగన్ అన్నారు. కడపలో వైఎస్ఆర్ సీపీకి వచ్చిన మెజార్టీ 5 లక్షల ఓట్లు అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చూసినపుడు ఇది పెద్ద తేడా కాదని, చంద్రబాబు ఇచ్చినట్లుగా మనం కూడా రైతు రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక్క కోరికతో అడ్డమైన అబద్ధాలు చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
చంద్రబాబు మాటలు నమ్మి రైతులు మోసపోయారని వైఎస్ జగన్ అన్నారు. రుణాలు కట్టకపోవడం వల్ల రూ.14వేల కోట్ల అపరాధ రుసుం వారిపై పడిందన్నారు. మార్చిలోగా రూ.28వేల కోట్ల వడ్డీ భారం పడిందని, అయితే చంద్రబాబు కేవలం రూ.5వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు.
జాబు కావాలంటే...బాబు రావాలన్నారు, ఇప్పుడు బాబు వస్తే...ఉన్న జాబు పోయిందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలకు పచ్చ పత్రికలు కొమ్ము కాశాయని ఆయన అన్నారు. చంద్రబాబుకు లేనిది.. తనకు ఉన్నది ప్రజల ఆశీర్వాదమని వైఎస్ జగన్ పేర్కొన్నారు.