జగన్‌కు రాజకీయ హక్కులన్నీ ఉన్నాయి | jagan has politcal rights to protest in jail | Sakshi
Sakshi News home page

జగన్‌కు రాజకీయ హక్కులన్నీ ఉన్నాయి

Published Mon, Aug 26 2013 2:28 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

jagan has politcal rights to protest in jail

సాక్షి, హైదరాబాద్: జైలులో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హక్కులను హరించే అధికారం ప్రభుత్వానికి, జైలు అధికారులకు లేదని న్యాయ నిపుణులు స్పష్టంచేశారు. ఏదైనా కేసులో నిందితులుగా జైలులో ఉన్నవారికి పౌర హక్కులతో పాటు అన్ని రాజకీయ హక్కులూ ఉంటాయని పేర్కొన్నారు. జగన్ జైలులో నిరాహార దీక్ష చేసినా ఆయన హ క్కులను హరించజాలరని స్పష్టంచేశారు. దీక్ష క్రమంలో ఆరోగ్యం క్షీణిస్తే ఆయనను ఆస్పత్రికి తరలించవచ్చని రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జన రల్ ఎస్.రామచంద్రావు, సీనియర్ న్యాయవాది రవిచంద్రలు ‘సాక్షి’ టీవీ చర్చాకార్యక్రమంలో వివరించారు. వారు వెల్లడించిన అంశాలు వారి మాటల్లోనే...
 
 నిరసన వ్యక్తంచేయటం రాజ్యాంగ హక్కు
 
 జైలులో ఉన్నంత మాత్రాన పౌరుడు తన పౌర హక్కులను కోల్పోడు. ప్రజాస్వామ్యంలో నిరసనను తెలియజేస్తూ నిరాహార దీక్ష చేయవచ్చు. చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఆ స్వేచ్ఛ, హక్కు జగన్‌మోహన్‌రెడ్డికి ఉంది. రాజ్యాంగం, చట్టం, జైలు నిబంధనల ప్రకారం ఆయన హ క్కులను హరించటానికి వీల్లేదు. జైలు రూల్స్‌లో హక్కులను తగ్గించే ఒక ప్రొవిజన్ ఉన్నా.. అది శిక్ష పడిన వారి విషయంలో వర్తిస్తుంది. ఆ ప్రొవిజన్ ప్రకారం.. జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష విషయంలో ఆయన ములాఖత్‌ను ఆపటం, దీక్ష చేయనీయకపోవటం అనేది కుదరదు. క్రిమినల్ లా ప్రకారం నేరం రుజువు అయ్యే వరకు నిందితుడు అమాయకుడే అనే భావ న ఉంది. అలాగే జైల్ ఈజ్ ఎక్సెప్షన్.. బెయిల్ ఈజ్ రూల్ అనేది ఉంది.
 
 జగన్ విషయంలో ఈ రెండింటిని ఇక్కడ మరచిపోయారు. ఆయన అండర్ ట్రయల్‌గా (విచారణ ఖైదీగా) ఉండి 15 నెలలు అవుతోంది. 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా అది జరగలేదు. ఇది న్యాయ విరుద్ధం. ఇదీ సీబీఐ మోటివేటెడ్ అనిపిస్తోంది. మన దగ్గర ఆరోపణలు మోపితే చాలు.. రుజువు అయినట్టే అనుకుంటున్నారు. అమాయకుడే తన అమాయకత్వాన్ని రుజువు చేసుకోవాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. జగన్‌ను 15 నెలలుగా జైల్లో ఉంచారు. రేపు నేరం రుజువు కాకపోతే ఆ పదిహేను నెలల కాలమంతా ఏమైనట్టు? కోర్టులు దీనిని కూడా ఆలోచించాలి. గతంలో మహాత్మా గాంధీ జైలులో ఉన్నా సత్యాగ్రహం చేశారు కదా? ఆయన్ని జైలులో పెడితే అక్కడ కూడా దీక్ష కొనసాగించారు. జగన్ శిక్ష పడిన నేరస్తుడు కాదు కాబట్టి జైల్లో ఉన్నా ఆయన రాజకీయ హక్కులు పోవు. ములాఖత్‌లు కట్ చేయటం అంటే.. ఏకపక్ష చర్య అవుతుంది. ఆర్టికల్ 14(21) ప్రకారం అది నేరమే. ఇక జైలు బయట అంత పోలీసు బందోబస్తు అనవసరం. అర్థరహితం. ఎందుకంటే ఆయన జైలు నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. అయినా ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వానికే తెలియాలి. జగన్ దీక్ష చేస్తూ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఆయన్ని ఆసుపత్రికి తరలించవచ్చు.
 
 - ఎస్.రామచంద్రరావు, రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జన రల్
 జగన్ నిందితుడు మాత్రమే.. అన్ని హక్కులూ ఉంటాయి
 
 ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిందితుడు మాత్రమే. నేరస్తుడు కాదు. ప్రభుత్వం న్యాయబద్ధంగా నడిస్తే ఆయన బయటే ఉండేవారు. న్యాయానికి విరుద్ధంగా ఆయన్ని జైల్లో వే శారు. ప్రభుత్వంలో ఉన్నవారు నిరాహార దీక్ష చేపట్టే హక్కు చట్టంలో ఎక్కడా లేదు. కాని రాష్ట్ర విభజనపై ఏ పార్టీ నిర్ణయం తీసుకుందో.. ఆ పార్టీకి చెందిన వారు నిరసనలు చేశారు. కాబట్టి జగన్‌మోహన్‌రెడ్డి చేయటానికి వీల్లేదనటం కుదరదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. జైలులో ఉన్నా నిందితుడికి ఓటు హక్కు ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కేసులో శిక్ష పడి జైల్లో ఉన్నవారికి మాత్రమే రాజకీయ హక్కులు ఉండవు. జగన్ నిందితుడు మాత్రమే. ఆయన హక్కులను హరిస్తామంటే కుదరదు. ములాఖత్‌లు పోవు. పైగా హక్కు ఆయన ఒక్కరిదే కాదు.
 
 ఆయన కుటుంబ సభ్యులవి కూడా. వారి హ క్కులు ఎలా పోతాయి? జైలు వద్దకు పోలీసులు అంత మంది రావటం జైలు అధికారుల నిర్ణయం కాదు.. ప్రభుత్వ నిర్ణయం కావచ్చు. మన దగ్గర ఏ సమస్య వచ్చినా, ఏ విషయాన్ని అయినా శాంతిభద్రతల సమస్యగా, రాజ్యాంగ వ్యతిరేకం అన్నట్లుగానే చూస్తుండటం దురదృష్టకరం. మీడియాపరంగా చూస్తే రైట్ టు ఎక్స్‌ప్రెషన్ (భావప్రకటన హక్కు) అనేది ముఖ్యం. ఏం చెబుతారనేది ముఖ్యం కాదు. దాన్ని మీడియా కచ్చితంగా అనుసరిస్తే జగన్ వైపు నిలిచేది తప్ప.. ఆయనకు దీక్ష చేసే హక్కు ఉందా? లేదా? జైల్ మాన్యువల్‌లో ఉందా? లేదా? అనే ది చూడదు. చట్టానికి విరుద్ధమైన పని చేయొద్దని చట్టంలో రాసి ఉన్నపుడు.. అలాంటి పని చేస్తే చట్టపరంగా వ్యతిరేకం అవుతుంది. అయితే ప్రిజన్ యాక్ట్, ప్రిజన్ మాన్యువల్‌లో నిరాహార దీక్ష చేయొద్దని రాసి లేదు. నిరాహార దీక్షతో జైలు క్రమశిక్షణకు భంగం కలిగిస్తున్నారని భావిస్తే, ఆయన్ని విచారించవచ్చు. అయితే రాష్ట్రంలో ప్రజలు అనేక నిరాహార దీక్షలు చేశారు. వాటిల్లో ఎలాంటి చర్యలు చేపట్టారో, జగన్ దీక్ష విషయంలోనూ అదే విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది.    - రవిచంద్ర, సీనియర్ న్యాయవాది
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement