సాక్షి ప్రతినిధి, కాకినాడ/మధురపూడి : సంక్రాంతి రద్దీని ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులపై టిక్కెట్ల మోత మోగిస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చి వెళ్లేవారిలో సామాన్యులతో పాటు ప్రముఖులూ ఎక్కువగానే ఉంటారు. ఈ రెండు జిల్లాల నుంచి.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో ఐటీ, ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత ఎక్కువగానే ఉన్నారు.
అక్కడ వ్యాపారం, తదితర రంగాల్లో స్థిరపడినవారూ ఎక్కువే. అలాగే దుబాయ్ తదితర గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లినవారి సంఖ్య కూడా అధికమే. వారిలో ఎక్కువమంది సంక్రాంతికి సొంతూరు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి వెళ్తూంటారు. అలాగే భారీ స్థాయిలో జరిగే సంక్రాంతి కోడిపందేలు చూడటానికి వచ్చేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇప్పటికే జిల్లాకు వచ్చే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో చివరికి విమానంలోనైనా సంక్రాంతి పండగకు స్వస్థలాలకు రావాలని పలువురు తాపత్రయపడుతున్నారు. దీనిని ప్రైవేటు విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.
పౌరవిమానయాన నిబంధనల ప్రకారం గంటలోపు ప్రయాణానికి టిక్కెట్ ధర రూ.2 వేలకు మించకూడదు. హైదరాబాద్ నుంచి మధురపూడిలోని రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు ప్రయాణం గంటలోపే. కానీ ప్రస్తుతం టిక్కెట్టు చార్జీని రూ.6 వేల వరకూ పెరిగిపోయింది. తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. హైదరాబాద్‌కు టిక్కెట్టు చార్జీని రూ.15 వేలకు మించి వసూలు చేస్తున్నారు. ముంబై, చెన్నై, బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా రాజమహేంద్రవరానికి జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్, ట్రూజెట్ సంస్థలు విమానాలు తిప్పుతున్నాయి. సాధారణంగా రోజూ రాజమహేంద్రవరానికి సగటున 350 మంది వస్తూంటారు. ఈ నెల ఒకటి నుంచి 10వ తేదీ వరకూ వచ్చినవారు 6,300 మంది. కానీ 11వ తేదీ నుంచి ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు 4 వేల మంది చేరుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రైవేట్ సంస్థలకు పండగ
పెరిగిన రద్దీకి తగ్గట్టుగానే విమాన టిక్కెట్ చార్జీ కూడా పెరిగిపోయింది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి విమాన టిక్కెట్టు చార్జీ మామూలు రోజుల్లో రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ఉంటుంది. కానీ, 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ టిక్కెట్టు చార్జీ రూ.8,600 నుంచి రూ.15,600 వరకూ వసూలు చేస్తున్నారు. అదే 17వ తేదీన కేవలం రూ.4,800 మాత్రమే ఉంది. ఇక తిరుగు ప్రయాణం విషయానికొస్తే ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ టిక్కెట్టు చార్జీ ఉంది. పండగ సందడి ముగిసిన తర్వాత 17వ తేదీ నుంచి టిక్కెట్ చార్జీ ఒక్కసారిగా పెరిగిపోతోంది. 17, 18 తేదీల్లో రూ.15 వేలకు వెళ్లిపోయింది. ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియా విమానాలు వస్తేనే ప్రైవేటు సంస్థల బాదుడు తగ్గుతుందని విమాన ప్రయాణికులు భావిస్తున్నారు.
గగన ప్రయాణమూ గగనమే
Published Fri, Jan 15 2016 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM
Advertisement
Advertisement