సాక్షి, ఒంగోలు: మహిళలపై పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రతి గ్రామ సచివాలయంలోనే మహిళా పోలీస్, స్త్రీ శిశు సంక్షేమ సహాయకులు, వార్డు మహిళ, బలహీనవర్గాల ప్రజలకు రక్షకులుగా కొందరిని నియమించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,944 పోస్టులను భర్తీ చేయనుండగా జిల్లాలో 1055 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో ఎక్కువ మంది మహిళలు ఉద్యోగులుగా మారే సువర్ణావకాశం వచ్చింది. ఈ ఉద్యోగాల్లో చేరే వారికి తొలి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్‌లో నెలకు రూ.15 వేలు చొప్పున ఇస్తారు. ప్రొబేషన్ పూర్తయిన అనంతరం వారికి స్కేల్ వర్తిస్తుంది. రూ.14,600 నుంచి రూ.44,870లుగా జీతం స్కేల్ నిర్ణయించారు. 1977 జూలై 2వ తేదీకి ముందు, 2001 జూలై 1వ తేదీ తర్వాత జన్మించిన వారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు. అంటే 2019 జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి 42 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులు. దరఖాస్తును ఆగస్టు 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయాలి.
దరఖాస్తుకు అర్హతలు
రాష్ట్ర పౌరులై ఉండాలి. ఏదేని యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టెక్నికల్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా (స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) అర్హులు. 40 శాతం వైకల్యం ఉన్న వారు, 60 డెసిబల్స్ కంటే ఎక్కువ వినికిడి లోపం ఉన్న వారు, అంధత్వ లోపం ఉన్న వారు తప్పనిసరిగా సంబంధిత విభాగ వైద్యులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. స్థానికంగా నాలుగేళ్ల పాటు విద్యాభ్యాసం, ఏడేళ్ల పాటు స్థానికంగా ఉన్నట్లు ధ్రువీకరణ తప్పనిసరి. జిల్లా యూనిట్‌గా లోకల్‌గా గుర్తిస్తారు. 80 శాతం సీట్లు లోకల్‌కు, 20 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీకి కేటాయించారు. అంటే 844 పోస్టులు లోకల్‌గా, 21 పోస్టులు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు.
►ఓసీ అభ్యర్థులు రూ.200 దరఖాస్తుకు, పరీక్ష ఫీజుకు రూ.200లతో పాటు అదనంగా నాన్ లోకల్ కింద మూడు జిల్లాలను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. ప్రతి నాన్ లోకల్ జిల్లాకు రూ.100 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు మాత్రం దరఖాస్తు రుసుం రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.
►ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికులు /ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు మూడేళ్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వయసును బట్టి గరిష్టంగా ఐదేళ్లు ఉంటుంది. అదే విధంగా వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, చట్టబద్దంగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళలు ఎస్సీ, ఎస్టీలు అయితే 48 ఏళ్లు, ఇతరులకు 43 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితిగా పేర్కొన్నారు.
దరఖాస్తు ఇలా..
గ్రామ సచివాలయం.ఎపి.జిఓవి.ఇన్ అనే వెబ్‌సైట్‌లో తమ వివరాలను పొందుపరిస్తే యూజర్ ఐడీ జెనరేట్ అవుతుంది. దానికి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని జతచేస్తే వన్‌టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) వస్తుంది. దానికి పాస్‌వర్డు అభ్యర్థి పుట్టిన తేదీ. ఇందులో లాగినై పూర్తి వివరాలు పొందుపరిచిన అనంతరం సబ్‌మిట్ చేస్తారు. సబ్‌మిట్ చేసిన వివరాలను సవరించాలనుకుంటే ప్రతి సవరణకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. పేరు, ఫీజు వివరాలు, వయసులను మాత్రం సవరించేందుకు అవకాశం ఉండదు.
ఎంపిక ఇలా..
జిల్లా స్థాయిలో జిల్లా ఎంపిక కమిటీ ఉంటుంది. దీనికి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాత పరీక్ష సెప్టెంబర్ 1వ తేదీ నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్–ఎలో జనరల్ స్టడీ విభాగం కింద 75 ప్రశ్నలకు 75 నిమిషాల్లో జవాబులు రాయాలి. పార్ట్–బిలో భారత చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం భౌగోళిక శాస్త్రాలకు సంబంధించిన అంశాలపై 75 ప్రశ్నలను 75 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, తప్పు సమాధానానికి 1/4 మార్కు కటింగ్ ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు 40, బీసీ 35, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు పొందాలి. పరీక్ష సమయంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాలులోకి అనుమతించరు.
వెయిటేజీ ఇలా..
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, హోమ్ గార్డులుగా ప్రభుత్వ విభాగాలు, పోలీసు శాఖలో పనిచేస్తున్న వారికి వెయిటేజీ కేటాయించారు. ప్రతి ఆరు నెలల సర్వీసుకు 1.5 మార్కులు కేటాయిస్తారు. గరిష్టంగా 15 మార్కులు కేటాయిస్తారు. అయితే వారి సర్వీసు అంత కంటే తక్కువ ఉంటే మాత్రం 1.5 మార్కుల చొప్పున ఎన్ని మార్కులు వస్తాయో అన్నే కేటాయిస్తారు. సర్వీసు ఎక్కువైనా 15 మార్కులకు మించి వెయిటేజీ ఇవ్వరు. పరీక్ష, ఫలితాలు తదితరాల కోసం అభ్యర్థులు గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌ను క్రమంగా చూసుకుంటూ ఉండాలని అభ్యర్థులకు డీజీపీ స్పష్టం చేశారు.
పోలీసు శాఖలో మహిళలకు ఉద్యోగాలు
Published Mon, Jul 29 2019 11:16 AM | Last Updated on Mon, Jul 29 2019 11:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment