జ్యుడిషియల్‌ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు | Justice Siva Sankara Rao To Head AP Judicial Review Committee | Sakshi
Sakshi News home page

జ్యుడిషియల్‌ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు

Published Wed, Sep 11 2019 7:08 PM | Last Updated on Wed, Sep 11 2019 8:42 PM

Justice Siva Sankara Rao To Head AP Judicial Review Committee - Sakshi

అమరావతి : అత్యుత్తమ పారదర్శక విధానం దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు తీసుకు వచ్చిన ముందస్తు న్యాయ సమీక్ష చట్టం అమలుకు సర్వం సిద్ధమవుతోంది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి శివశంకరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ప్రభుత్వ టెండర్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పారదర్శక విధానానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం రోజునే దీనిపై ప్రకటన చేశారు. తన పాలనలో సుపరిపాలన పారదర్శకత కోసం చట్టాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించారు. ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత ప్రక్రియ కోసం హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జిని సూచించాలంటూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. అందులో భాగంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో జులై 26, 2019న న్యాయ సమీక్ష బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన 25 రకాల పనులు ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సమయంలో మాట్లాడిన సీఎం వైఎస్‌ జగన్‌.. చరిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకు వచ్చామని అన్నారు. దేశ చరిత్రలోనే పారదర్శకత ఏపీ నుంచి మొదలు అవుతోందన్నారు. ఏపీ అవినీతికి దూరంగా ఉండే రాష్ట్రమనే సందేశం మన దేశానికే కాకుండా, అంతర్జాతీయ సమాజానికి కూడా వెళ్లాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.

జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఇలా సాగుతుంది..
పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటిన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. జడ్జి ఆ టెండర్‌కు సంబంధించిన పత్రాలను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు. ఇందుకు సంబంధించి జడ్జి టెక్నికల్‌ టీమ్‌ నుంచి సలహాలు, సూచనలు, వివరాలు పొందవచ్చు. సంబంధిత శాఖ జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఆ తర్వాత 8 రోజుల పాటు జడ్జి వాటిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందిస్తారు.  ఈ విధానంలో మొత్తం 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదన ఖరారు అవుతుంది. ఆ తర్వాతే బిడ్డింగ్‌ ఎవరికీ అదనపు లబ్ధి చేకూర్చకుండా.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు అభించనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement