వేటాడి...వెంటాడి ...కిడ్నాపర్లను పట్టిచ్చాడు | kidnap attempt in kakinada | Sakshi
Sakshi News home page

వేటాడి...వెంటాడి ...కిడ్నాపర్లను పట్టిచ్చాడు

Published Tue, May 9 2017 10:25 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

వేటాడి...వెంటాడి ...కిడ్నాపర్లను పట్టిచ్చాడు

వేటాడి...వెంటాడి ...కిడ్నాపర్లను పట్టిచ్చాడు

- ఓ కంపెనీ యజమాని భార్యను కిడ్నాప్‌ చేసే యత్నం
- 100 నంబరుకు ఓ యువకుడిచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం
- డ్రైవరు పరారీ, ఇద్దరిని పట్టుకున్న పోలీసులు


పిఠాపురం, కొత్తపల్లి:  ఒక కారు అనుకోకుండా అతి వేగంగా దూసుకుపోతోంది. అంతలోనే హఠాత్తుగా ఆగడం ... వేగంగా ఇద్దరు యువకులు ఆ కారులో ఎక్కడం ... మళ్లీ ఆ కారు దూసుకుపోవడం ... ఇందంతా చక,చకా జరిగిపోయాయి...ఈ తతంగమంతా అటుగా బైక్‌పై వెళుతూ చూసిన ఓ యువకుడికి ఏదో జరగరానిది జరుగుతుందన్న అనుమానం కలిగింది. ‘అదంతా మనకెందుకులే ’ అని అనుకోకుండా ఏం జరుగుతుందో చూద్దామని ఆ కారును వెంబడించాడు. అతను ఊహించినట్లే ఆ కారులో ఓ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు గుర్తించి ఇదేదో కిడ్నాప్‌ వ్యవహారంగా భావించాడు. ఓ వైపు కారును వెంబడిస్తూనే తన సెల్‌ఫోన్‌ ద్వారా 100 నంబరుకు ఫోన్‌ చేసి పోలీసులను అప్రమత్తం చేసి నిందితులను పట్టించి ‘శభాష్‌’ అనిపించుకున్నాడు.

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన యాక్ట్‌ షిప్పింగ్‌ ఫార్వర్డు కంపెనీ యజమాని వీర వెంకట సత్య సాయి భార్య ధనలక్ష్మి కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి రోజు కారు కాకినాడ కల్పన సెంటర్‌లో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి , దుమ్ములపేట మీదుగా పోర్టు సమీపంలో ఉన్న కంపెనీ కార్యాలయానికి వెళుతుంటారు. అప్పటికే ఇడ్నాప్‌ చేసేందుకు పన్నాగం పన్నిన డ్రైవరు దయ వైఎస్సార్‌ బ్రిడ్జి మీదుగా తీసుకువెళ్లాడు. కారు వేరే మార్గంలో వెళుతుండడంతో అనుమానం వచ్చి ‘అలా వెళ్లాల్సింది ... ఇలా వెళుతున్నావేమిటని’ ధనలక్ష్మి అడుగుతుండగానే  ముఖాలకు ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు అదే కారులోకి చెరో వైపు నుంచి హఠాత్తుగా ఎక్కి పీకపై కత్తి పెట్టి బెదిరించి ఆమెను కదలకుండా పట్టుకున్నారు. కారును స్పీడుగా వాకలపూడి మీదుగా కాకినాడ బీచ్‌ రోడ్డు వైపు పోనిచ్చాడు. అక్కడ నుంచి తుని వైపు వెళ్లి విశాఖపట్నం తీసుకువెళ్లి అక్కడ ఓ రహస్య ప్రదేశంలో ఆమెను దాచి రూ.50 లక్షలు డిమాండ్‌ చేయాలని కిడ్నాపర్లు వ్యూహం పన్నారు.

కిడ్నాపర్లను పట్టించిన యువకుడు
అయితే కల్పన సెంటర్లో నుంచి కారు అతి వేగంగా వెళుతుండడం ... ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కడం ... అటుగా తన బైక్‌పై వెళుతూ ఇదంతా గమనించిన ఓ యువకుడుకి కారులోంచి ఓ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ‘రక్షించమని’ కేకలు రావటంతో కారును వెంబడించాడు.  వెంటనే తన సెల్‌ నుంచి 100 నెంబరుకు ఫోన్‌ చేసి విషయాన్ని పోలీసులకు కారు నంబరుతో సహా సమాచారం అందించారు. కాకినాడ నుంచి బీచ్‌ రోడ్డు మీదుగా వస్తున్న కారును ఉప్పాడలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ కారు ఆపకుండా వేగంగా వెళ్లడంతో వెంబడించిన పోలీసులు కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట వాసులకు సమాచారం ఇవ్వడంతో ఓ లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి కారును అడ్డుకున్నారు. ‘మమ్మల్ని వదలక పోతే మహిళను చంపేస్తా’మని కారులో ఉన్న వ్యక్తులు ఆమె మెడపై కత్తి పెట్టి బెదిరించగా స్థానికులు చాకచక్యంగా కిడ్నాపర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. డ్రైవరు దయ తప్పించుకొని పారిపోగా మిగిలిన ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేసి కిడ్నాప్‌కు గురైన ధనలక్ష్మిని రక్షించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement