అలుపెరగని యోధుడు కిషన్
తెలంగాణ సాయుధపోరాటంలో ఆయనో అగ్నికణం, రజాకర్లకు ఎదురొడ్డి పోరాడిన వీరుడు. జాగీరుదారుల, పెత్తందారుల కోరలు పీకిన సింహస్వప్నం, వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. భూస్వాములను గడగడలాడించి పేదప్రజలకు భూములు పంచి వారి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకుడు. ఆయన పోరాట పటిమ మింగుడుపడని కొందరు భూస్వాములు, పెత్తందార్లు రోడ్డు ప్రమాదంలో ముసుగులో చంపి నేటికి 53 యేళ్లు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
మెదక్ రూరల్, న్యూస్‌లైన్:
చిన్నశంకరంపేట మండలం తుర్కల మాందాపూర్‌కు చెందిన కేవల్ నారాయణ, మున్నాబాయిల మూడో సంతానంగా 1920లో కేవల్ కిషన్ జన్మించా రు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1941లో డీగ్రీ పట్టా పొందారు. చిన్ననాటి నుంచే విప్లవభావాలు కలిగి ఉన్నారు. అయితే తెలంగాణలో హైద్రాబాద్ సం స్థానాధిపతి నిజాం నవాబుల పాలన కొనసాగుతోం ది. భూస్వామి, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, పటేల్ పట్వారీల నిరంకుశ, దోపిడీ విధానాలు చోటుచేసుకుంటున్న రోజులు. దీంతో నిజాం ప్రభుత్వానికి వ్యతి రేకంగా తెలంగాణ రైతాంగ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సాయుధపోరాటం ప్రారంభమైంది. అందులో మెతుకుసీమ పోరుబిడ్డ కేవల్ కిష న్ తానుసైతం అంటూ నిజాం పాలనకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేశాడు. దోపిడీదారుల, పెత్తందార్ల గుండెల్లో బల్లెంలా నిలిచాడు.
నిజాంపాలన విమోచనం వరకు పోరాటం సాగించాడు. అనంతరం దున్నేవాడిదే భూమి అంటూ భూస్వాముల మిగులు భూముల్లో జెండాలు ప్రజలతో పాతించారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో మెదక్ జిల్లాలోని జోగిపేటలో ఆంధ్రమహాసభ ఏర్పాటుచేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. పెత్తందారులపై తిరుగుబాటు బావుట ఎగురవేయడంతో ఆయనకు ఎనలేని గుర్తింపు లభించింది. అప్పట్లో మెదక్ మున్సిప్ మెజిస్ట్రేట్ ద్వారా తహశీల్దార్ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం నుండి పిలుపు కూడా వచ్చింది. కానీ దానిని ప్రజల కోసం త్యజించారు. మెదక్ డివిజన్‌లో ని కాట్రియాల, పాతూర్, అక్కన్నపేట, జక్కన్నపేట, మాసాయిపేట గ్రామాల్లో నిరుపేదలకు వేల ఎకరాల భూములు ఇప్పించి పేదల నాయకుడు అయ్యారు. ఊరూర కమిటీలు వేసి సీపీఐని గడపగడపకు తీసుకెళ్లారు.
మెదక్ మండల పరిధిలోని జక్కన్నపేట గ్రామశివారులోగల బ్రాహ్మణ చెరువు ఆయకట్టు భూముల ఆక్రమణను అడ్డుకునే క్రమంలో పోలీసులు తుపాకులు ఎక్కు పెట్టినా బెదరని ధీరుడు. ఆ భూములను పెదలకు అందించడంతో ఆ గ్రామంలో కేవల్ కిషన్ విగ్రహం ఏర్పాటు చేసి ప్రతియేటా ఉత్సవాలను నిర్వహిస్తారు. 1951-52లో జరిగిన ప్రథమ సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రసీ పార్టీ(పీడీఎఫ్)తరఫున మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి కేవలం 200 ఓట్ల తేడాతో ఓటమిచవి చూశారు. 1960 డిశంబర్ 26న వెల్దూర్తి మండలం మాసాయిపేటకు ఆయన సన్నిహితుడు లక్ష్మయ్యతో బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా చేగుం ట మండలం పొలంపల్లి గేటు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో కిషన్, అతని సన్నిహితు డు మృతిచెందారు. అయితే ఆయన ఉద్యమ స్ఫూర్తిని నచ్చని కొందరు హత్య చేయించి, దీనిని రోడ్డు ప్రమాద మృతిగా చిత్రీకరించారన్నది కిషన్ అభిమానుల ఆరోపణ.
ప్రమాదం జరిగినచోటే కామ్రెడ్ కేవల్ కిషన్, ఆయన సన్నిహితుడు లక్ష్మయ్య విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతియేటా డిశంబర్ 26న ప్రజలు ఎడ్లబండ్లు ఊరేగించి ఉత్సవాలు నిర్వహిస్తునానరు. ఆయనపై ఉన్న అభిమానంతో చాలా గ్రామాల్లో పిల్లలకు పేర్లు పెట్టుకున్నారు. ఊరూరా విగ్రమాలను ఏర్పాటుచేశారు. నేటికి ఆయనపై బుర్రకథలు, ఒగ్గుకథలు పల్లెల్లో చె బుతారు. అయితే ఆయన భౌతికంగా లేకున్నా తమ గుండెల్లో గూడు కట్టుకున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. ఆయన మరణించాక కేవల్ కిషన్ భార్య ఆనందాదేవి 1964లో మెదక్ నియోజకవర్గం నుండి పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు