కొయ్యూర్ టు ఢిల్లీ | koyyur to delhi | Sakshi
Sakshi News home page

కొయ్యూర్ టు ఢిల్లీ

Published Fri, Nov 29 2013 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

koyyur to delhi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మరో రెండు రోజులు గడిస్తే.. కొయ్యూర్ ఎన్‌కౌంటర్ జరిగి పద్నాలుగేళ్లు. పీపుల్స్‌వార్ అగ్రనేతలు ముగ్గురు నేలకొరిగిన ఈ సంఘటన ఇప్పటికీ వివాదాస్పదంగానే మిగలడంతో పాటు నక్సలైట్ల ఉద్యమ చరిత్రలో నెత్తుటి అధ్యాయంగా నిలిచిపోయింది. అప్పటి తాడిచెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 1999 డిసెంబర్ 2 తెల్లారుజామున జరిగిన ఆ ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రం సంతోష్‌రెడ్డి అలియాస్ మహేశ్, శీలం నరేశ్ అలియాస్ మురళి మృతి చెందారు.
 
 ఎదురుకాల్పుల్లో ఆ ముగ్గురిని మట్టుబెట్టినట్లుగా పోలీసు అధికారులు ప్రకటించారు. తీవ్రవాదుల అణిచివేతలో విశేష కృషి చేసినందుకు గుర్తింపుగా... కొయ్యూర్ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వం గ్యాలంటరీ శౌర్య పతకాలను బహుకరించింది. కానీ.. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బెంగళూరులో అగ్రనేతలను పట్టుకున్న పోలీసులు హెలి కాప్టర్‌లో తీసుకెళ్లి కొయ్యూర్ అడవుల్లో కాల్చి చంపినట్లుగా వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో 2008 అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. శౌర్య పతకాలను ఎందుకు వెనక్కి తీసుకోవద్దో తెలియజెప్పాలని వారి నుంచి వివరణ కోరింది.
 
 డిసెంబర్ 2న ఉదయం6.35 నుంచి 7.02 గంటల వ్యవధిలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లుగా రికార్డుల్లో నమోదైంది. కానీ.. ఆ సమయంలో ముగ్గు రు ఐపీఎస్ అధికారులు భౌతికంగా ఆ ఘటనా స్థలిలో లేరనేది ప్రధాన అభియో గం. ప్రభుత్వ నోటీసులకు ఐపీఎస్ అధికారులు వివరణ ఇచ్చినప్పటికీ.. తదుపరి ప్రత్యేక విచారణలతో ఈ వివాదం కోర్టుకెక్కింది. కానీ.. హెలికాప్టర్ పెలైట్ ఇచ్చిన సమాచారం కీలకంగా మారడంతో... ఒక దశలో ఈ కేసు పోలీసు ఉన్నతాధికార వర్గాలను సైతం కుదిపేసింది. తాజాగా ఈ కేసు కు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైనట్లు తెలిసింది.
 
 సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా? తిరస్కరిస్తుం దా? అనేది వేచిచూడాల్సిందే. కొయ్యూరు ఘటనకు 14 ఏళ్లు నిండుతున్న నేపథ్యంలో ఈ కేసు మళ్లీ తెరపైకి రానుండడం చర్చనీయాంశంగా మారింది. పీపుల్స్‌వార్‌లో ఆదర్శనేతలుగా గుర్తింపుపొందిన ఆ ముగ్గు రు అగ్రనేతల మరణంతో ఉత్తర తెలంగాణలో విప్లవోద్యమ పతనం ఆరంభమైంది. అప్పటినుంచి పీపుల్స్‌వార్ సైతం తమ వ్యూహాన్ని మార్చుకుంది. ఏడాది తర్వాత అమరుల సంస్మరణ ఉత్సవాలను తలపెట్టడంతోపాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ)ని ఏర్పాటు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement