ఉత్సాహంగా పుష్కర స్నానం
సెలవుదినం కావడంతో భక్తుల కిటకిట
సాక్షి, అమరావతి: వరుస సెలవులు కావడంతో కృష్ణా పుష్కర ఘాట్లలో సోమవారం కూడా భక్తుల సందడి కొనసాగింది. నాలుగో రోజు అన్ని ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్రం నలుమూలల నుంచి కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు భక్తులు తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో రద్దీ కొనసాగింది. రైళ్లలో వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మూడో రోజు సుమారు లక్ష మందిపైన రైళ్ల ద్వారా పుష్కర స్నానాలకు వచ్చినట్లు రైల్వే శాఖ చెపుతోంది.
సాయంత్రం ఐదు గంటల వరకు 1.14 లక్షల మంది విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి పది గంటల వరకు 20,87,841 మంది పుష్కర స్నానం చేసినట్లు సమాచార శాఖ ప్రకటించింది.
దుర్గాఘాట్‌లోకి పాము
విజయవాడ దుర్గా ఘాట్‌లోకి ఒక పాము వచ్చి స్నానం చేస్తున్న యువకుడిని కాటు వేసింది. అతన్ని వెంటనే వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదంలేదు. నదిలోకి గుర్రపుడెక్క ఎక్కువగా కొట్టుకు వస్తున్నది. దీని నుంచి పాములు వస్తున్నందువల్ల ఆ గుర్రపుడెక్కను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
సాక్షి నె ట్‌వర్క్: కృష్ణా పుష్కరాల సందర్భంగా సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. నీటిలో మునిగి ఒకరు, గుండెపోటుతో ఇద్దరు, అస్వస్థతకు గురై ఒకరు మృతి చెందారు.