పులకించిన అమరావతి | Puskara feast ends at Amaravathi | Sakshi
Sakshi News home page

పులకించిన అమరావతి

Published Tue, Aug 23 2016 10:58 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

పులకించిన అమరావతి - Sakshi

పులకించిన అమరావతి

సాయంత్రం కళాకారులతో భారీ ర్యాలీ
మంగళ హారతితో ముగిసిన కార్యక్రమాలు
 
సాక్షి, అమరావతి : అమరావతిలో పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. అమరలింగేశ్వర స్వామిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. జిల్లాలో పుష్కర స్నానాలు చేసినవారిలో దాదాపు సగం మంది ఇక్కడే పుణ్యస్నానాలు చేశారు. జిల్లాలోని 70 ఘాట్లలో పుష్కరాల 12 రోజుల్లో 61,06,641 మంది పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు లెక్కగట్టారు. ఇందులో అమరావతిలోనే 29.62 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని వివరించారు. పుష్కరాల 12వ రోజు అమరావతిలో బుద్ధ విగ్రహం నుంచి హారతి ఇచ్చే అమరలింగేశ్వరుని స్వామి గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. హారతి సమయంలో బాణసంచా పేల్చుతూ.. పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
 
దాతల సేవలు మరువలేనివి...
పుష్కరాల 12 రోజులు దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పుష్కర భక్తులకు చేసిన సేవలు వెలకట్టలేనివి. రోడ్డు వెంబడి ఉండే గ్రామాల ప్రజలు సైతం స్వచ్ఛందంగా ఉచిత అన్న ప్రసాదాలు, తాగునీరు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా దాతలు ఏర్పాట్లు చేశారు. విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు కళ్లం హరినాథరెడ్డి ఆధ్వర్యంలో సేవాభారతి పేరుతో భక్తులకు విశేష సేవలు అందించారు. రెడ్‌క్రాస్, ఎన్‌ఎస్‌ఎస్, సత్యసాయి సేవా సంస్థ, ప్రజాపిత బ్రహ్మకుమారిలు, శ్రీవారి సేవకులు, బ్రాహ్మణ సేవా సంస్థ, శ్రీరామ భక్త సేవా సమితి, రైస్‌మిల్లర్స్‌ అసోషియేషన్, మౌర్య క్యాటరింగ్‌ అధినేత పి.సుబ్రమణ్యంతో పాటు పలువురు స్వచ్ఛందంగా లక్షల మందికి ఉచిత అన్న ప్రసాదాలు అందించారు. ఘాట్‌లను శుభ్రంగా ఉంచడంతో పాటు, దేవాలయాల్లో క్యూలైన్‌ వద్ద మంచినీరు అందించడం వంటి కార్యక్రమాల్లో సేవా సంస్థలు కీలకపాత్ర పోషించాయి.
 
పుష్కర విధుల్లో...
పుష్కర విధుల్లో అన్ని శాఖల అధికారులు అమరావతిలోనే ఉండి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, ఎప్పటికప్పుడు ఘాట్‌లను పరిశీలిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గుంటూరు కమిషనర్‌ నాగలక్ష్మి, డీసీపీ శ్రీదేవి, జెడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఎంహెచ్‌వో పద్మజ, రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీహరి, డీఎస్‌వో చిట్టిబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement