కమీషన్ల కక్కుర్తి! | M RI scanning serious delays in the acquisition ofmachines | Sakshi
Sakshi News home page

కమీషన్ల కక్కుర్తి!

Published Sat, Jun 11 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

కమీషన్ల కక్కుర్తి!

కమీషన్ల కక్కుర్తి!

ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్ల కొనుగోలులో తీవ్ర జాప్యం
మూడుసార్లు టెండర్లు పిలిచి రద్దుచేసిన వైనం
పీపీపీకి వెళ్లే యోచనలో వైద్యవిద్య ఉన్నతాధికారులు
ఎంఆర్‌ఐ లేకపోతే గుంటూరు వైద్య కళాశాలకు 200 సీట్లు కష్టమే
►  అధికారుల తీరుతో ఆందోళనలో వైద్య విద్యార్థులు

 
సాక్షి, గుంటూరు :  కమీషన్ల కోసం కక్కుర్తిపడి టెండర్లను సైతం రద్దుచేయాలని చూస్తున్నారు. ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్ కొనుగోలు చేస్తే కమీషన్లు రావనే నెపంతో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) ద్వారా అద్దెకు పెట్టించాలని చూస్తున్నారు. కొనుగోలు కోసం టెండర్లు పిలవడం, రద్దు చేయడం వీరికి పరిపాటిగా మారింది. మూడేళ్లుగా టెండర్లు రద్దుచేసిన అధికారులు నాలుగోసారి కూడా రద్దుకు కుట్రపన్నుతున్నారు. ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్ కొనుగోలు చేయాలంటే సుమారు రూ. 9.5 కోట్లు ఖర్చవుతుంది. పీపీపీ ద్వారా ఏర్పాటుచేస్తే నెలకు రూ. 30 లక్షల చొప్పున చెల్లించేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఐదేళ్ళలో వీరికి చెల్లించే అద్దెతో మిషన్ కొనుగోలు చేయవచ్చని తెలిసినా కాసులకు కక్కుర్తిపడి వైద్య విద్యార్థులు, రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు పరిశీలిస్తే...

ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్ల కొనుగోలుకు మూడు నెలల క్రితం టెండర్లు
 గుంటూరు జీజీహెచ్, తిరుపతి స్విమ్స్, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్‌లు కొనుగోలుకు మూడు నెలల కిందట టెండర్లు పిలిచారు. మూడు ఆస్పత్రుల్లో మూడు ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్‌లు కలిపి రూ. 28 కోట్లకు ఫిలిప్స్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన టెండర్ దక్కించుకుంది. టెండర్ పూర్తయి నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకూ డబ్బు విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారు. డబ్బు విడుదల చేసిన వెంటనే మూడు ఆస్పత్రుల్లో మిషన్‌లను బిగించేందుకు ఫిలిప్స్ కంపెనీ సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు తాత్సారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగిఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పీపీపీ  విధానంలో మిషన్‌లను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే నెలనెలా లక్షల్లో కమీషన్లు వస్తాయనే భావనతో వైద్య, విద్య ఉన్నతాధికారులు ఇలా చేస్తున్నారని ఆస్పత్రి వైద్యులు ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా ప్రతి సంవత్సరం టెండర్లు పిలవడం, రద్దుచేయడం వీరికి పరిపాటిగా మారిందని, ఇప్పుడు నాలుగోసారి కూడా టెండర్ రద్దుచేయాలని యోచిస్తున్నారని వారు మండిపడుతున్నారు.


రోజుకు 35 మందికి స్కానింగ్ పరీక్షలు
 పీపీపీ   ద్వారా ఏర్పాటుచేస్తే ఒక్కో ఆస్పత్రిలో రోజుకు సుమారు 35 మంది రోగులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తారని, ఒక్కో రోగికి రూ. 2 వేలు చొప్పున రోజుకు రూ.70 వేలు చెల్లించాలని, నెలకు సుమారుగా రూ. 25 లక్షల వరకూ చెల్లించాల్సిఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఏడాదికి రూ. 3 కోట్లు చెల్లించాలి. వీరికి మూడున్నరేళ్లపాటు చెల్లించే డబ్బుతో కొత్త ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్ కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత మిషన్ ఆస్పత్రి సొంతమవుతుంది. నెలనెలా కమీషన్లు రావనే కారణంతోనే టెండర్ల రద్దుకు కొందరు ఉన్నతాధికారులు యత్నిస్తున్నట్లు సమాచారం.
 
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
భారత వైద్య మండలి తనిఖీల్లో ఎంఆర్‌ఐ స్కా నింగ్ మిషన్ లేదని గుర్తిస్తే ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న 200 ఎంబీబీఎస్ సీట్లలో కోతపడే ప్రమాదం ఉంది. న్యూరాలజీ, యూరాలజీ, న్యూరోసర్జరీ, రేడియాలజీ విభాగాల్లో వైద్య విద్య పూర్తిచేసుకున్న విద్యార్థులకు గుర్తింపు లేకుండాపోతుంది. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయనే విషయం తెలిసినా ధనార్జనే ధ్యేయం గా ఉన్నతాధికారులు వ్యవహరించడం దారుణమని వైద్యాధికారులు మండిపడుతున్నారు.                          
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement