రాజకీయ రంగం అంటే.. అనుక్షణం వ్యూహాత్మకంగా పావులు కదపాల్సిన రంగం. డబ్బును మించిన ప్రభావవంతమైన పావు మరొకటి లేదనే పరిస్థితి.. ‘ఎన్నికలు ఖరీదైపోయాయి. రాజకీయరంగం సంపన్నులకు తప్ప సామాన్యులకు అందని రంగంగా మారింద’ని అనుకోక తప్పడం లేదు. అలాంటి సమయంలో ఉద్భవించిన వినూత్న కాన్సెప్ట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఇందులో రాజకీయ వ్యూహాలుండవు. ఉన్నదంతా పారదర్శకతే. అందుకే భవిష్యత్తు జీరో బడ్జెట్ పాలిటిక్స్‌దే అయి తీరాలి. ఇందుకోసం కంకణం కట్టుకున్న ఓ సామాజికోద్యమకర్త ‘జీరో బడ్జెట్ మాధవరెడ్డి’.- వాకా మంజులారెడ్డి
దేశవిదేశాల్లో జీరో బడ్జెట్
‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ కాన్సెప్ట్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దేశమంతటా పర్యటిస్తున్నారు పోతిరెడ్డి మాధవరెడ్డి. బ్రిటన్, అమెరికాలో ప్రసంగించారు. న్యూఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, రాజస్తాన్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, మంగళగిరి, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, కాగజ్‌నగర్, పెద్దపల్లి నగరాల్లో సదస్సులు నిర్వహించారు. రాజస్తాన్‌లోని బిట్స్ పిలాని, ఎమ్‌ఐటీ పుణే, ఐఐటీ ముంబై వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థులను చైతన్యవంతం చేశారు. సమాజహితమైన, ప్రజాస్వామ్యహితమైన ఈ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆయన ఆశయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
నాయకులు సమాజాన్ని ప్రేమించాలి
రాజకీయ రంగంలో వస్తున్న మార్పులు.. ఎన్నికలు జరుగుతున్న తీరుతెన్నులను గమనించినప్పుడు ప్రజాస్వామ్యం ఎటుపోతోందనే ఆవేదన కలిగేది. ఏదో ఒకటి చేయాలనిపించేది. ఆ ఆవేదనలో నుంచి పుట్టిన పరిష్కార మార్గమే జీరో బడ్జెట్ పాలిటిక్స్. నిజానికి ఇందులో బడ్జెట్ లేదు, పాలిటిక్స్ లేవు. ఉన్నదంతా మానవత్వం, మంచితనమే. నాయకుడు తన కుటుంబాన్ని ప్రేమించినట్లే సమాజాన్ని కూడా ప్రేమించగలగాలి. ముసుగు వేసుకోకుండా పారదర్శకంగా పని చేయాలని చెప్పడమే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉద్యమం.
ప్రజలకు దూరమైతే..
అసెంబ్లీ నియోజకవర్గం ఒక చివర నుంచి మరో చివరకు 50 కిలోమీటర్లకు మించదు. నియోజకవర్గం పరిధిలో సుమారు వంద గ్రామాలుంటాయి. ఐదేళ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని గ్రామాల ప్రజలతో మమైకమేతే ఆ నాయకుడికి తర్వాతి ఎన్నికల్లో డబ్బు అస్సలు ప్రభావం చూపనే చూపదు. గ్రామాల్లో పర్యటిస్తే వాళ్ల అవసరాలు తెలుస్తాయి. అన్నీ ఒక్కసారే తీర్చలేకపోయినా దఫదఫాలుగా అయినా పనులు జరుగుతుంటాయి. దాంతో తమ ప్రతినిధిపై విశ్వాసం ఏర్పడుతుంది. ఈసారి గెలిపిస్తే మిగిలిన పనులు కూడా చేస్తారనే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకమే ఎన్నికలకు పెట్టుబడి. అయితే చాలా సందర్భాల్లో డబ్బు లేని అభ్యర్థికి గెలుపు అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఒక వ్యక్తి నిరాడంబరంగా చేతులు జోడించి ప్రజల ముందు నిలబడి నేను సేవ మాత్రమే చేయగలను, డబ్బు పంచలేను అని నిజాయితీగా చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఒక్క అవకాశం ఇవ్వవలసిన బాధ్యత మాత్రం సమాజానిదే.
సోమ్ ప్రకాశ్‌సింగ్ ,బారోనెస్ వర్మ
బ్రిటన్ ఎంపీ.. బిహార్ ఎమ్మెల్యే
బ్రిటన్ పార్లమెంట్‌లో ఒక అనధికారిక సెషన్‌లో పాల్గొన్నప్పుడు అక్కడి ఎంపీ బారోనెస్ వర్మ ‘‘నేను ఇక్కడ (బ్రిటన్‌లో) ఎంపీని. అదే ఇండియాలో అయితే వార్డు మెంబర్‌ని కూడా కాలేకపోయేదాన్ని’’ అన్నారు. ఇండియా రాజకీయాల్లో డబ్బు ప్రభావం, వారసత్వ రాజకీయాలపై వాళ్లకు ఏర్పడిన అభిప్రాయం అది. అయితే మనం ఇక్కడ మరో సంగతి కూడా గుర్తు చేసుకోవాలి. సోమ్ ప్రకాశ్‌సింగ్ బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లా ఓబ్రా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఎన్నికల ఖర్చుల కోసం ప్రజలు విరాళాలు పోగు చేసి రూ.1.,48 లక్షలు ఇచ్చారు. అందులో రూ.1.22 లక్షలు మాత్రమే ఖర్చయ్యాయి అతడికి. అలాగే తెలంగాణలో సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి రిటైర్డ్ టీచర్. గడచిన పంచాయతీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి పంచాయతీ సర్పంచ్‌గా గెలిచారు. అతడికి కూడా గ్రామస్తులే లక్షా ఏడు వేల రూపాయల విరాళాలు సేకరించి పెట్టారు. అతడి ఎన్నికల ఖర్చు ఐదు వేలకు మించలేదు. మిగిలిన డబ్బు పంచాయతీకి జమ చేశారు. నిజాయతీగా ఉండే నాయకుడి వెంట జనం ఉంటారు. ఇలాంటి వాళ్లను గెలిపించడానికి పార్టీ అధిష్టానం నుంచి నాయకులు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరమే ఉండదు. వాళ్లను ప్రజలే గెలిపించుకుంటారు. అలా ప్రజల చేత గెలిపించుకోగలిగిన సత్తా ఉన్న నాయకులను తయారు చేయడమే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉద్దేశం.
అరవై ఏళ్ల బారోనెస్ వర్మ, బ్రిటన్ పార్లమెంట్ (హౌస్ ఆఫ్ లార్డ్స్) మెంబర్. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో పుట్టారామె. బాల్యంలోనే తల్లిదండ్రులతో ఇంగ్లండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
రచ్చబండ వేదికగా..
ఎన్నికల ప్రచారం ఎంత ఆడంబరంగా ఉంటే అంతగా జనాన్ని ప్రభావితం చేయవచ్చనే అపోహలో ఉన్నారు నాయకులు. నిరాడంబరంగా ప్రజలతో మమేకమయ్యే వారికే నిజమైన ఆదరణ లభిస్తుంది. ఒక గ్రామానికి వెళ్లి రచ్చబండ మీద ఒక పూట గడిపితే, గ్రామస్తులు ఆ నాయకుడిని అక్కున చేర్చుకోకుండా ఉండగలుగుతారా? అంత సమయం కేటాయించే ఓపిక ఉండడం లేదెవ్వరికీ. భారీ హోర్డింగులు, మైకులతో గంట సేపట్లో ఊరంతటినీ చుట్టేసి కాలు కింద పెట్టకుండా ప్రచారం అయిందనిపిస్తున్నారు. జనం కూడా ‘నాయకులు వచ్చారు, వెళ్లారు’ అన్నట్లే అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. వాళ్లటు వెళ్లగానే మర్చిపోతున్నారు.
రేపటి తరాన్ని సిద్ధం చేయడం కోసం
ఆలోచన ఉంటే ఏదీ అసాధ్యంకాదు. భవిష్యత్తు తరం ఇప్పటి విద్యార్థులదే. వారిలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆలోచన రేకెత్తిస్తే వాళ్లే భవిష్యత్తు సమాజాన్ని ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంతో పరిఢవిల్లేలా చేయగలుగుతారు. అందుకే విద్యాసంస్థలపై దృష్టి పెడుతున్నాను. కొత్తగా తెరమీదకొస్తున్న నాయకులు చిలుక పలుకుల్లా ‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ను తమ ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. కానీ వాళ్లు కూడా ఆచరణలో పెట్టడం లేదని వాళ్ల చర్యలే చెబుతున్నాయి.
కులం ఒక అపోహ
ఏ కులానికైనా సరాసరిన ఐదు శాతం ఓటర్లు మాత్రమే ఉంటారు. ఒక పార్టీ నాయకుడి కులం ఐదు శాతం, స్థానిక అభ్యర్థి కులం ఐదు శాతం కలిసినా పది శాతమే. ప్రత్యర్థి పార్టీలోనూ అంతే. పది– పది ఇరవై శాతం పోగా మిగిలిన ఎనభై శాతం మంది ఓట్లు ఉంటాయి కదా! ఒకవేళ పార్టీ నాయకుడు, అభ్యర్థి ఒకే కులం వాళ్లయితే వాళ్లకు లభించే కుల మద్దతు ఐదు శాతమే. కాబట్టి కులం గెలిపిస్తుందనేది ఒక అపోహ మాత్రమే. గెలిపించేది మానవత్వం, నాయకత్వం మాత్రమే.
వైఎస్‌ఆర్‌ని గుండెల్లో పెట్టుకున్నారు
పాలకుడు ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులు విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, రోడ్డు, కరెంటు. వీటిని ఏర్పాటు చేస్తే ఆ నాయకుడిని సమాజం వదులుకోదు. గుండెల్లో పెట్టుకుంటుంది. మళ్లీ ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలు మనసారా స్వాగతిస్తారు. వైఎస్‌ఆర్ విజయవంతమైంది ఇక్కడే. మిగిలిన వాళ్లు ఎదురీదుతున్నది కూడా ఈ విషయంలోనే.
ఇది మహావృక్షం
నేనెక్కడికి వెళ్లినా ‘ఈ ఫార్ములాని నిరూపించడానికి మీరే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా’ అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఒక మహావృక్షానికి 2016లో బీజం వేశాను. మొలకెత్తి, ఎదిగి విస్తరించడానికి కనీసం ఒక దశాబ్దం పడుతుంది. మా జిల్లాలో తిమ్మమ్మ మర్రిమాను విస్తరించినట్లు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంశం కూడా ఊడలతో పరిపుష్టమవుతుంది. ఆ రోజున నేను, నాతోపాటు ఈ యజ్ఞంలో యూఎస్ నుంచి సహకరిస్తున్న శివారెడ్డి, జనార్దన్‌రెడ్డి, కోదాడ మోహన్, ఐఐటీ శివాజీ, బాలసుబ్రహ్మణ్యంతోపాటు అనేక మంది మిత్రులు కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారు. వేదికను పటిష్టంగా నిర్మించిన తర్వాత మాత్రమే ప్రదర్శన మొదలు పెట్టాలి. – పి. మాధవ్‌రెడ్డి,జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉద్యమకర్త
నమ్మకమే ఓటు విలువ
పోతిరెడ్డి మాధవ్‌రెడ్డిది అనంతపురం జిల్లా ఎలనూరు మండలం వాసాపురం గ్రామం. అమ్మానాన్నలు సుభద్రమ్మ, చినవీరారెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్న కమతంతో, ముగ్గురు అక్కలకు ఓ తమ్ముడు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. భార్య లక్ష్మి, బాబు ప్రణవ్, పాప భవ్యశ్రీ.. ఇదీ ఆయన కుటుంబం. మూడేళ్ల వయసులో సోకిన పోలియోనే తన జీవితాన్ని మలుపు తిప్పిందంటారు మాధవరెడ్డి. ఫ్యాక్షన్ గ్రామంలో పుట్టిన తాను ఆ చట్రంలో ఇరుక్కోకుండా బయటకు రావడమే కాక సోదరుడి వరసయ్యే వ్యక్తికి ‘పగ ప్రతీకారాల కోసం జీవితాలను అంతం చేసుకోవద్ద’ని నచ్చచెప్పారు. ఇప్పుడు దేశంలోని రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి పూనుకున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రచారంలో ఆయన ఇస్తున్న నినాదం ఇది..
‘ఇప్పుడు కాకుంటే ఎప్పుడు...మనం కాకుంటే ఎవరు?చక్కదిద్దుదామా...మనకెందుకని వదిలేద్దామా?’
Comments
Please login to add a commentAdd a comment