ఆస్పత్రిలోనే దుకాణం! | Medical Reps Offers in Hospitals | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలోనే దుకాణం!

Published Mon, Nov 13 2017 6:43 AM | Last Updated on Mon, Nov 13 2017 6:43 AM

Medical Reps Offers in Hospitals - Sakshi

భుత్వం నెల నెలా ఇచ్చే వేతనం తక్కువైందో ఏమో.. వైద్యులు ప్రజారోగ్యాన్ని పక్కనబెట్టి.. మందుల వ్యాపారంపై మక్కువ చూపుతున్నారు. మందుల కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసం పాకులాడుతున్నారు. అడిగేవారు.. అడ్డుచెప్పేవారు లేకపోవడంతో ‘నాకింత.. నీకింత’ అంటూ పర్సంటేజీలతో∙కాలం వెళ్లబుచ్చుతున్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ రెప్స్‌ నేరుగా ప్రభుత్వాస్పత్రుల్లోకే చొరబడుతుండండంతో... వైద్యసేవ వ్యాపారమైంది. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన అభాగ్యులు మాత్రం వైద్యం కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది.  

జిల్లాలోని చాలా మంది వైద్యులు పర్సెంటేజీల కోసం కక్కుర్తిపడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా వైద్యులు వ్యవహరిస్తున్న తీరు రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యశాఖ వర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. మెడికల్‌ రెప్స్‌ అందించే పర్సెంటేజీలపై ఆసక్తి చూపుతున్నారు. రూ.లక్షకు 20 నుంచి 40 శాతం వరకు పర్సెంటేజీలు తీసుకొని మందుల బిజినెస్‌ చేస్తున్నారు. పర్సెంటేజీలిచ్చే కంపెనీల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

కమీషన్లతో వైద్యులు ఫిదా
మెడికల్‌ రెప్స్‌ ఆఫర్లకు వైద్యులు ఫిదా అవుతున్నారు. తాము అధికంగా పర్సెంటేజీ ఇస్తామని తమ కంపెనీ మందులు రాయాలంటూ వైద్యులు చుట్టూ రెప్స్‌ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వైద్యులు పర్సెంటేజీలకు పెద్దపీట వేస్తున్నారు. గతంలో మెడికల్‌ రెప్స్‌ టీవీలు, రెఫ్రిజిరేటర్లు, విదేశీయానాలంటూ ఆశ చూపి వైద్యులతో ఏడాది పాటు మందుల బిజినెస్‌ మాట్లాడుకునే వారు. ఇప్పుడు వైద్యులు ఆ పద్ధతికి స్వస్తి పలికారు. కంపెనీలను బట్టి 20 నుంచి 40 శాతం పర్సెంటేజీ మాట్లాడుకొని మందులు రాస్తున్నారు. రూ. 5 లక్షల  బిజినెస్‌కు నెలకు రాస్తే వైద్యులకు ప్రత్యక్షంగా 40 శాతం ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఇక ఆర్‌ఎంపీ, పీఎంపీల కమీషన్ల కహానీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. 

‘జనరిక్‌’మందులకు టాటా...
జనరిక్‌ మందులు ఎంతో మేలని వైద్యులు రోగులకు చెప్పాలి. ధర కూడా చౌక,  త్వరగా కోలుకుంటారని అవగాహన కల్పించాలి. కానీ వైద్యులు జనరిక్‌ మందులను రాయడం లేదు. రోగికి అందించాల్సిన మందు జనరిక్‌లో అందుబాటులో ఉంటున్నప్పటికీ పర్సెంటేజీ కారణంగానే ఇతర కంపెనీలు మందులు రాస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి సర్వజనాస్పత్రిలోని కొందరు వైద్యులు కూడా కమీషన్ల కోసం మందులు బయటకు రాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించేందుకు సర్వజనాస్పత్రిలోని ఉన్నతాధికారులెవరూ ముందుకు రావడం లేదు.

ఆ ఒక్క చోటే...
కొందరు వైద్యులు ఫార్మా కంపెనీలతో కుమ్మక్కవుతున్నారు. కంపెనీ పేరుపై రూ. 30 వేల నుంచి రూ. 50 వేలు డీడీ లేదా నగదు బ్యాంకు ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. సదరు కంపెనీ నిర్వాహకులు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల సరుకును పంపుతారు. మెడికల్‌ రెప్స్‌ అవసరం లేకుండా భారీ మొత్తంలో వైద్యులు లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుతం చాలా నర్సింగ్‌హోంలు, ఆస్పత్రుల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. సదరు కంపెనీ మందు ఏ ఇతర మెడికల్‌ షాపులోనూ దొరకదు. దీంతో రోగులు తప్పని సరి పరిస్థితుల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. 

దుష్పరిణామాలెన్నో
నాణ్యత లేని మందులు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో రోగులకు దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కిడ్నీ, గుండెపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్నారు. ఎక్కువ మోతాదుతో కూడిన పెయిన్‌ కిల్లర్స్‌ వాడడం ద్వారా కిడ్నీ వ్యాధికి గురై మృత్యువుతో పోరాడుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలపై దృష్టిసారిస్తే ప్రజారోగ్యం కాపాడొచ్చని ఆరోగ్యశాఖ వర్గాలే అంటున్నాయి. 

ఆస్పత్రిలోనే మందుల వ్యాపారం
మూడు నెలల క్రితం గుంటూరులోని ప్రభుత్వాస్పత్రుల్లో మెడికల్‌ రెప్స్‌ హల్‌చల్‌ చేయడంపై అక్కడి కలెక్టర్‌ కోన శశిధర్‌ సీరియస్‌ అయ్యారు. సదరు మెడికల్‌ రెప్స్‌పై కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ‘అనంత’లో మాత్రం  అలాంటి పరిస్థితి కన్పించడం లేదు. ఓపీ సమయంలో బిజినెస్‌ కోసం రెప్స్‌ ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు క్యూలో నిలుచుకొని పడిగాపులు కాస్తుంటే..వీరు మాత్రం దర్జాగా ఓపీ విభాగంలోకి వెళ్తున్నారు. అదుపు చేయాల్సిన సెక్యూరిటీ సిబ్బంది సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యమూ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. వైద్యుల సైతం వారు రాగానే రోగులను పక్కనపెట్టి దుకాణం పెట్టేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement