తెలంగాణలోని రెండు పట్టభద్రుల స్థానాల ఎన్నికకు సీఈసీ షెడ్యూల్
ఈ నెల 19న నోటిఫికేషన్.. 26 వరకు నామినేషన్లు..
మార్చి 16న ఎన్నికలు.. 19న ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రెండు స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 16న ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘తూర్పు-పశ్చిమగోదావరి’, ‘కృష్ణా-గుంటూరు’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
నామినేషన్ల దాఖలుకు 26 తుదిగడువు. 27న నామినేషన్ల పరిశీలన.. మార్చి 2 వరకు ఉపసంహరణకు గడువు. అదే నెల 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఓట్లు లెక్కించి, ఫలితాలను విడుదల చేస్తారు. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న కె.నాగేశ్వర్ (మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్), కపిలవాయి దిలీప్ కుమార్ (వరంగల్-ఖమ్మం-నల్లగొండ)ల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తోంది. దీంతో ఎన్నికలు జరుగుతున్నాయి.
వాస్తవానికి మార్చి 29వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా ముగుస్తోంది. కానీ ముందుగా కేవలం రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికకే షెడ్యూలు వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా
Published Thu, Feb 12 2015 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM
Advertisement