పాలకొల్లు అర్బన్ : దళితులను టీడీపీ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్ విమర్శించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలోని మాలమహానాడు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది ఎస్సీ రుణాల మంజూరు కోసం నోటిఫికేషన్ జారీ చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారని, వారికి రుణాలు ఇవ్వకపోగా మళ్లీ ఈ ఏడాది రుణాల మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించడం దళితులను మోసం చేయడమేనన్నారు. ఎంతోమంది ఎస్సీ నిరుద్యోగులు ఉద్యోగం రాకపోయినా కనీసం స్వయం ఉపాధి ద్వారా బతుకుదామనే ఆశతో ఎదురుచూస్తుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లుజల్లిందని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో షెడ్యూలు కులాలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. ఎస్సీ హాస్టల్స్ మూసివేతకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దళితుల సమస్యలపై ఈ నెల 12వ తేదీన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రాజేష్ తెలిపారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణి జోగయ్య, యలమంచిలి మండల అధ్యక్షుడు విప్పర్తి నవీన్, పోడూరు మండల ఉపాధ్యక్షుడు నెల్లి శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మోకా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
దళితులను మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
Published Mon, Aug 10 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM
Advertisement