నిరుద్యోగి నిర్వేదం! | DSC Student suicide In Kurnool | Sakshi
Sakshi News home page

నిరుద్యోగి నిర్వేదం!

Published Thu, Oct 11 2018 12:24 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

DSC Student suicide In Kurnool - Sakshi

కర్నూలు సిటీ:  ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం రోజుకో రకమైన ప్రకటన చేస్తూ.. నోటిఫికేషన్‌ తరచూ వాయిదా వేస్తుండడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశ, నిçస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. బుధవారం కర్నూలు నగరంలో విజయలక్ష్మి (26) అనే అభ్యర్థి డీఎస్సీ వాయిదా పడడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె స్వగ్రామం దేవనకొండ మండలం కరివేముల. భర్త గిడ్డయ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత మూడు పర్యాయాలు డీఎస్సీ శిక్షణ తీసుకున్నప్పటికీ ఉద్యోగం సాధించలేకపోయింది. చివరకు టెట్‌లో అర్హత సాధించి.. డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తోంది. బుధవారం రావాల్సిన నోటిఫికేషన్‌ వాయిదా వేశారన్న సమాచారంతో తీవ్ర నిరాశకు గురై.. బలవన్మరణానికి పాల్పడింది. 

అంతా హడావుడే 
డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం గత ఏడాది నవంబరు నుంచి హడావుడి చేస్తోంది. ఇప్పటికీ అతీగతీ లేదు. నోటిఫికేషన్‌ ఇప్పటికి మూడు సార్లు (గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జూలై, ఈ నెల 10) వాయిదా వేసింది. గత నవంబరులో డీఎస్సీపై నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించింది. ఇందులో తక్కువ మంది అర్హత సాధించారు. ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తామంటూ ఈ ఏడాది మేలో మరోసారి టెట్‌ ప్రకటించి.. జూన్‌లో పరీక్ష నిర్వహించింది. 

ఈలోపు బీఈడీ చేసిన వారు సైతం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు పోటీపడాలంటే ముందుగా వారు టెట్‌–1లో అర్హత సాధించాలి. కావున వీరి కోసం ఇప్పుడు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలా? లేక గతంలో మాదిరి టెర్ట్‌ (టీచర్స్‌ ఎలిజిబులిజీ అండ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) పెట్టాలా అనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.   

ఆందోళనలో అభ్యర్థులు  
డీఎస్సీ ప్రకటన తరచూ వాయిదా పడుతుండడంతో అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ, అప్పులు చేసి ప్రిపేర్‌ అవుతున్నట్లు చాలామంది వాపోతున్నారు. మరి కొందరైతే వయసు మీద పడుతుండడంతో ఇళ్లలో పెళ్లిపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. 

పోస్టులు అరకొరే.. 
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా 2,685 టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలన్న డిమాండ్‌ ఉంది. అయితే..కేవలం పదవీ విరమణ చేసిన వారి స్థానంలో ఏర్పడిన ఖాళీలను మాత్రమే భర్తీ చేయడానికి నోటిఫై చేశారు. దీనికితోడు పీఈటీ, పండిట్‌ పోస్టులు, ఫిజికల్‌సైన్సు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వేకెన్సీ చూపించకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో జిల్లాలో మొత్తం 499 సాధారణ పోస్టులతో పాటు మున్సిపాలిటీలలో 60 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పీఈటీ, పండిట్‌ పోస్టులు ఖాళీలు ఉన్నా..వాటిని చూపకపోవడంతో అభ్యర్థు«లు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే పీఈటీలు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి పండిట్‌ అభ్యర్థులు సైతం ఉద్యమించనున్నారు.  

ఖర్చు రూ.150 కోట్లకు పైనే! 
డీఎస్సీ కోసం సుమారు ఏడాదిగా అభ్యర్థులు కోచింగ్‌ తీసుకుంటున్నారు. టెట్‌తో పాటు డీఎస్సీ కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వెచ్చించారు. అలాగే అద్దె గది/హాస్టల్‌లో ఉండడానికి నెలకు రూ.3 వేల వరకు ఖర్చు వస్తోంది. పుస్తకాలకు రూ.3 వేలు అవుతోంది. ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి ఇప్పటివరకు ఒక్కో అభ్యర్థి  రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చించారు. జిల్లాలో సుమారు 40 వేల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మిగనూరు, కర్నూలు నగరంలో సుమారు పది కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 20 వేల మంది వరకు కోచింగ్‌ తీసుకుని ఉంటారు. ఒక్క కోచింగ్‌కే రూ.40 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఇతరత్రా ఖర్చులన్నీ కలిపితే రూ.150 కోట్లకు పైమాటే! 

నెలకు రూ.3 వేలు ఖర్చవుతోంది 
ఉపాధ్యాయ పోస్టు కోసం నాలుగేళ్లుగా ప్రిపేరవుతున్నా. నెలకు రూ.3 వేలు ఖర్చు అవుతోంది. జిల్లాలో అధికంగా ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తామంటోంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు ఉపాధ్యాయులను నియమిస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల విద్యా ప్రమాణాలు కూడా పెరుగుతాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలి. 
– శివయ్య, ఎస్‌జీటీ అభ్యర్థి 

నిరుద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్నారు 
డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారనే ఆశతో ఏడాదిన్నరగా ప్రిపేర్‌ అవుతున్నా. అంతకుముందు ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుండేదాన్ని. డీఎస్సీ నిర్వహిస్తారన్న ఆశతో ఇంట్లో ఇబ్బందులున్నా కష్టపడి చదువుతున్నా.  ప్రభుత్వం మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తోంది. ఆలస్యమయ్యే కొద్దీ ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం నిరుద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది.  
– బి.రేఖ, కర్నూలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement