డీఎస్సీ తుస్‌స్‌స్‌... | DSC Notification Postponed ON 5Th time | Sakshi
Sakshi News home page

డీఎస్సీ తుస్‌స్‌స్‌...

Published Thu, Oct 11 2018 11:55 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

DSC Notification Postponed ON 5Th time - Sakshi

డీఎస్సీ నోటిఫికేషన్‌ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోంది. ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రకటించిన అధికార పార్టీ ఎన్నికలయ్యాక తూచ్‌మంటుంది. ఒక సారి డీఎస్సీ అని.. మరోసారి టెట్‌ అంటూ ఔత్సాహిక ఉపాధ్యాయులను ఒక ఆట ఆడుకున్న పాలకులు చివరకు డీఎస్సీకే జైకొట్టారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని ఇప్పటికి ఐదుసార్లు వాయిదా వేసింది. అయితే ఈ దఫా  నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తారనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ఊరించి ఊరించి.. ఉస్సూరుమనిపిస్తుంది. రూ.లక్షల ఖర్చులు పెట్టుకుని చదువుకున్న నిరుద్యోగులు అప్పుల పాలయ్యారు. పాలకుల తీరు చూస్తుంటే.. నోటిఫికేషన్ల పేరుతో కోచింగ్‌ సెంటర్లను పోషిస్తున్నట్లు కనిపిస్తుంది.

కోచింగ్‌కు రూ.50 వేల నుంచి 75 వేలు 
డీఎస్సీ కోచింగ్‌ కోసం అభ్యర్థులు వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో నగరంలోనే 8 ఉండగా జిల్లాలో మరో 7 ప్రాంతాల్లో కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. జిల్లాతో పాటు నందిగామ, తిరుపతి ప్రాంతాల్లో కోచింగ్‌ తీసుకునేందుకు పలువురు అభ్యర్థులు వెళ్లారు. టెట్, డీఎస్సీ కోచింగ్‌లకు ఆయా సెంటర్లను బట్టి రూ.8 వేల నుంచి రూ.14 వేలకు పైగా డబ్బులు తీసుకుంటున్నారు. హాస్టల్‌కు 75 రోజులకు కలిపి రూ.10 వేలకు పైగా ఖర్చు అవుతుంది. ఈ లెక్కన ఒక్కో విద్యార్థి రెండు మూడు డీఎస్సీ నోటిఫికేషన్లకు కోచింగ్‌లు తీసుకుంటూ రూ. 75 వేలకు పైగా ఖర్చు చేశారు. గతేడాది డిసెంబరు నుంచి అంటే 10 నెలలుగా టెట్, డీఎస్సీల కోసం కోసం వేలాది మంది అభ్యర్థులు కోచింగ్‌ తీసుకుంటున్నారు.

నెల్లూరు (టౌన్‌):   డీఎస్సీ ప్రకటిస్తే ఉద్యోగం వస్తుందన్న ఆశతో జిల్లాలో వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం మళ్లీ మళ్లీ వేయిదా వేయడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మే నెలలో రెండు సార్లు టెట్‌ నిర్వహించారు. టెట్‌లో అర్హత సాధిస్తేనే 

డీఎస్సీ పరీక్షల రాసేందుకు అర్హులవుతారు. అయితే ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్‌ను నాలుగు సార్లు వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 10న డీఎఎస్సీ నోటిఫికేషన్‌ను విడదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. దీన్ని కూడా మళ్లీ వాయిదా వేయడంతో అభ్యర్థులు నిరుత్సాహ పడుతున్నారు. ఈ ఏడాది 12 వేలకు పైగా అభ్యర్థులు టెట్, డీఎస్సీకి కోచింగ్‌ తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతకు ముందు సంవత్సరాల అభ్యర్థులను కూడా కలిపితే జిల్లాలో 50 వేల మందికి పైగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కటాఫ్‌ తేదీని కుదించడం, పాఠశాలల్లో పోస్టులను సర్దుబాటు చేయడం పేరుతో జిల్లాలో 164 పోస్టులకు ఎసరుపెట్టింది. 

తొలుత ఈ ఏడాది జూన్‌ వరకు ఆయా పాఠశాలల్లో ఉన్న ఖాళీలను తెలియజేయాలని విద్యాశాఖ జిల్లా అధికారులను కోరింది. ఆయా గ్రేడ్ల వారీగా 264 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. తాజాగా జూన్‌ నెల కటాఫ్‌ను కుదించి మార్చి నాటికి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పాలని ఆదేశించింది. దీంతో 160 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు నివేదిక పంపారు. దీన్ని బట్టి సుమారు 104 పోస్టులకు ఎసరు పెట్టేసేలా ప్రభుత్వం వ్యవహరించింది తేట తెల్లమవుతోంది. అంతేకాకుండా సర్ధుబాటు పేరుతో మరో 60 పోస్టులను కుదించి వేసింది. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీ భారీగా తగ్గిపోయింది. 

అప్పులు తెచ్చి మరీ కోచింగ్‌ 
బయట నుంచి అప్పులు తీసుకు వచ్చి డీఎస్సీ కోచింగ్‌కు చేరినట్లు పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. కొంత మంది అప్పులు తీసుకు వస్తే, మరికొంత మంది తమ ఆస్తులను తనఖా పెట్టిమరి డబ్బులు తీసుకుని కోచింగ్‌ సెంటర్లలో చేరినట్లు చెబుతున్నారు. ఉద్యోగం వస్తే మంచి జీవితాన్ని గడపవచ్చన్న ఆశతో అప్పులు చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అదిగో డీఎఎస్సీ.. ఇదిగో డీఎస్సీ అంటూ రెండేళ్లుగా నిరుద్యోగులను మభ్యపెడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

కోచింగ్‌ సెంటర్లకు కాసుల పంట 
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటనలతో కోచింగ్‌ సెంటర్లకు కాసుల వర్షం కురిసింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటనతో జిల్లాలో దాదాపు 12 వేల మందికి పైగా విద్యార్ధులకు ఆయా సెంటర్లుల్లో కోచింగ్‌ తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెట్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో పలువురి నుంచి పలు అభ్యంతరాలు రావడంతో మళ్లీ మే నెలలో టెట్‌ నిర్వహించారు. టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా డీఎస్సీలో 20 వెయిటేజి మార్కులు కలపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి నుంచి ఆయా సెంటర్లుల్లో కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఒక్కొ అభ్యర్ధి  సరాసరి రూ.50వేలు ఖర్చు పెట్టినా 12వేల మందికి కలిపి రూ. 60 కోట్లు మేర కోచింగ్‌ సెంటర్లుల్లో వ్యాపారం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగల ప్రకటనతో కోచింగ్‌ సెంటర్లుకు కాసుల వర్షం కురుస్తుందని నిరుద్యోగులకు మాత్రం ఒరిగింది లేదని  విమర్శిస్తున్నారు.

టెట్‌ సిలబస్‌ వేరు, డీఎస్సీ సిలబస్‌ వేరు 
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్‌ సిలబస్, డీఎస్సీ సిలబస్‌లు వేర్వేరుగా ఉన్నాయి. టెట్‌కు కోచింగ్‌ తీసుకున్నా డీఎస్సీకి పనికిరాదు. డీఎస్సీ కోసం మళ్లీ ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకోవాల్సి ఉంది. టెట్‌ కం టీఆర్టీ పరీక్షలకు మాత్రమే ఒకే సిలబస్‌ సరిపోతుంది. అయితే ఫిబ్రవరి, మే నెలలో నిర్వహించిన టెట్‌లకు సంబంధం లేకుండా డీఎస్సీ కోసం ప్రత్యేక కోచింగ్‌ తీసుకోవాల్సి ఉంది. దీంతో డీఎస్సీ కోచింగ్‌ తీసుకునే అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. తీరా రెండు సార్లు ఖర్చు పెట్టి చదివితే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement