నాలుగైదుసార్టు టెట్ ఎగ్జామ్ రాశారు. దాని కోసం కోచింగ్‌సెంటర్‌లకు వేలకు వేలు అప్పులు తీసుకొచ్చి పెట్టారు. ఒక పక్క వయస్సు పెరిగి పోతుంది. మరో పక్క డీఎస్సీ ఈ ఏడాది ఈ ఏడాది అంటూ గత నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం వాయిదా వేసుకొస్తుంది. ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగాను, ఎంఆర్‌సీలలో సీఆర్‌పీలు, ఎంఐసీ కోఆర్డినేటర్‌లుగా పనిచేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం వేయికళ్ళతో ఎదురు చూసిన డీఎస్సీ చివరకు రానే వచ్చింది. కాని ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల సంఖ్యను చూసి అభ్యర్ధులు ఇన్నాళ్ళు పెట్టుకున్న ఆశలన్ని ఆవిరైపోయాయి
చీమకుర్తి: జిల్లాలో టీచర్ ట్రైనింగ్, బీఈడీ పూర్తి చేసిన వారు డీఎస్సీ కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటే ప్రభుత్వ ప్రకటన అభ్యర్థులను నిరాశ పరిచింది. సెకండరీ గ్రేడ్ పోస్టులు కేవలం 228 మాత్రమే ప్రకటించటం అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లిందని వాపోతున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, ఎన్‌ఎస్, పీఎస్, సోషల్ అన్ని రకాల స్కూలు అసిస్టెంట్‌ల పోస్టులు కలిపి 69 మాత్రమే అంటే ఒక్కో సబ్జెక్టుకు సింగిల్ డిజిట్‌కు కూడా రానటువంటి పరిస్థితి ఉందని అభ్యర్ధులు వాపోతున్నారు. లాంగ్వేజ్ పండిట్ల సంఖ్య అయితే 5, పీఈటీలు 26, మ్యూజిక్ పోస్టులను 5 మాత్రమే కేటాయించింది.
ఏడాదికి 20 వేల మంది అభ్యర్ధులు ట్రైనింగ్ పూర్తి
జిల్లాలో టీచర్ ట్రైనింగ్‌కాలేజీలో 145 ఉన్నాయి. వాటన్నిటిలో కలిపి గత ఏడాది 14 వేల మంది టీచర్ ట్రైనింగ్‌పూర్తి చేసిన వారంతా ఇప్పుడు డీఎస్సీకి అర్హత కలిగిన వారే. బీఈడీ కాలేజీలో మరో 45 వరకు ఉన్నాయి. వాటన్నిటిలో కలిపి మరో 5 వేల మంది అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారు. గత నాలుగేళ్లలో ఇన్ని కాలేజీలు లేకపోయినా మొత్తం మీద కలిపి జిల్లాలో దాదాపు 45 వేల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాలేజీ అధ్యాపకుల వద్దనున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు మాత్రమే సెకండరీ గ్రేడ్ పోస్టుకు ఎలిజిబిలిటీ ఉండేది. ఇటీవల కోర్టు ఉత్వర్వులతో బీఈడీ పూర్తి చేసిన వారు కూడా సెకండరీగ్రేడ్ పోస్టులకు ఎలిజిబిలిటీ రావడంతో ఎస్‌జీటీ పోస్టులకు డిమాండ్ పెరిగింది. కానీ ఎస్‌జీటీ పోస్టులను మాత్రం 228 మాత్రమే జిల్లాకు కేటాయించటంతో హెవీ కాంపిటీషన్ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన డీఎస్సీలలో కనీసం ఎస్జీటీ పోస్టులు సరాసరిన 500–800 వరకు ఉండేవి. 2014లో ఏకంగా 10,700 పోస్టులను ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు కేవలం 228 పోస్టులంటే పోస్టు కొట్టటం చాలా కష్టమని నిరుద్యోగులు వాపోతున్నారు.
టెట్ కం టీఆర్‌టీ పద్ధతిలో పరీక్ష
డీఎస్సీ పరీక్ష రాసే ముందు అభ్యర్థులలో టీచింగ్ నైపుణ్యాలను పరీక్షించేందుకు టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టీట్) నిర్వహిస్తున్నారు. దానిలో వచ్చిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజి ఉంటుంది. గత నాలుగేళ్లలో ఇప్పటికీ నాలుగు సార్లు టెట్‌నునిర్వహించారు. ఎన్నిసార్లు అయినా టెట్ రాసుకోవచ్చు. ఏ టెట్‌లో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులను డీఎస్సీలో పరిగణనలోకి తీసుకుంటారు. దాని వలన ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించినప్పుడల్లా వెయిటేజి మార్కుల కొరకని అభ్యర్థులు టెట్ పరీక్ష నోటిఫికేషన్ పడినప్పుడల్లా రాస్తునే ఉన్నారు.
అలా ప్రతి టెట్ కోచింగ్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కోచింగ్ సెంటర్లలో పోశారు. తీరా ఆ టెట్‌ల మార్కులతో పనిలేకుండా ఇప్పుడు ప్రకటించిన డీఎస్సీ పరీక్షను టెట్ కమ్ టీఆర్‌టీ పద్ధతిలో నిర్వహిస్తుంది. అంటే ఇప్పటి వరకు టెట్ ద్వారా సాధించిన మార్కులన్ని వృథాగానే పోయాయని వాపోతున్నారు. స్కూలు అసిస్టెంట్‌ల పరిస్థితి అయితే మరీ దారుణం. ఒక్కో సబ్జెక్టుకు 5–10 లోపే పోస్టులు ఉన్నట్లు తెలుస్తుంది.
సంవత్సరాల తరబడి ఎదురు చూసినందుకు ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలను చూసి ఉపాధ్యాయ అభ్యర్థులకు దిమ్మతిరిగిందని వాపోతున్నారు. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులు ఒక ఎత్తు అయితే మళ్లీ డీఎస్సీ పరీక్ష కోసం కోచింగ్ సెంటర్‌లలో మరో రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాలసి ఉంటుందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయాలజీ పోస్టులు కేవలం 18 మాత్రమే ఉన్నాయి
బయాలజీ స్కూలు అసిస్టెంట్ పోస్టులు కేవలం 18 మాత్రమే ఉన్నాయి. కానీ బయాలజీ సబ్జెక్టు చేసిన అభ్యర్థులు జిల్లాలో దాదాపు 3500 మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఇలాగైతే పోస్టు సాధించాలంటే ఇంకెన్నేళ్లు ఆగాలో మరి.
– బొడ్డు ఏడుకొండలు, చీమకుర్తి
Comments
Please login to add a commentAdd a comment