డీఎస్సీ ఆశావహులకు నిరాశే మిగులుతోంది. ప్రభుత్వం నుంచి దగాయే ఎదురవుతోంది. ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న నోటిఫికేషన్ మళ్లీ వాయిదా పడేసరికి అభ్యర్థులంతా నీరసపడిపోయారు. పగలూ రేయి కష్టపడుతున్న తమను సర్కారు మోసగిస్తోందని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల క్రితం వీరంతా రోడ్డెక్కారు.
చిత్తూరు ఎడ్యుకేషన్ : డీఎస్సీ నోటిఫికేషన్‌ను సర్కారు అయిదోసారి కూడా వాయిదా వేయడంతో యువత మరోసారి డీలాపడింది. నాలుగున్నరేళ్ల నిరీక్షణ ఫలిస్తుందని ఎదురు చూసినవీరికి సర్కారు మొండిచేయి చూపించింది. నోటిఫికేషన్ వాయిదా వేశారనే ప్రకటనతో నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. 2014 నుంచి డీఎస్సీ నిర్వహణపై ఊరిస్తున్నారే తప్ప ప్రకటన ఇవ్వడం లేదని వీరంతా మండిపడుతున్నారు. భారీగా కోచింగ్ సెంటర్లకు వెచ్చించి శిక్షణ పొందుతున్న తమ జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 జూలై 3న టెట్ రద్దు చేసి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది జూలై 6న నోటిఫికేషన్ అని ఒకసారి, సెప్టెంబర్ 5న అని రెండోసారి ప్రకటించింది. కానీ విడుదల చేయలేదు. 2017 ఆగస్టు 22న వేల పోస్టులకు డీఎస్సీ షెడ్యూలు వస్తుందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మూడోసారి ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 15న నోటిఫికేషన్‌తో రాష్ట్రంలో 12,370 పోస్టులను భర్తీ చేసి, 2018 మార్చి 23, 24, 25 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహిస్తామని నాలుగోసారి ప్రకటించారు. కానీ మాట నిలుపుకోలేదు. ఇటీవల అక్టోబర్ 10న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలచేస్తామని ఐదోసారి మంత్రి చెప్పారు. ఐదోసారి కూడా సర్కారు వాయిదా అంటూ మొండి చేయి చూపడంతో ప్రభుత్వ ప్రకటనపై అభ్యర్థుల్లో నమ్మకం పూర్తిగా సడలిపోయింది. తమను ప్రభుత్వం వంచిస్తోందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్న ఉద్యోగాన్ని వదిలి...
నిరుద్యోగులు బోలెడు సొమ్ము వెచ్చించి డీఈడీ, బీఈడీ కోర్సులను పూర్తి చేశారు. ఎలాగైనా కొలువు సాధించాలన్న పట్టుదలతో చదివారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీఎస్సీ నిర్వహించకపోవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చాలీచాలని జీతానికి పనిచేశారు. తీరా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది ఉన్న ఉద్యోగాన్ని వదిలి కోచింగ్ సెంటర్లల్లో మకాం పెట్టారు. అప్పోసప్పో చేసి ఫీజులు చెల్లించారు. చివరికి ప్రకటన తరచూ వాయిదా పడటంతో కొందరు నిరుద్యోగులు అప్పులపాలయ్యారు. మరోపక్క జిల్లాలో ఖాళీ లను పూర్తిస్థాయిలో చూపకుండా ఎస్జీటీ, పీఈటీ పోస్టుల్లో కోత విధిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
ఖాళీలు ఎక్కువ... పోస్టులు తక్కువ
జిల్లాలో అన్ని కేటగిరిల్లో 1,200 పోస్టులు ఖాళీగా ఉంటే విద్యాశాఖాధికారులు కేవలం 207కు మాత్రమే నివేదికలు పంపారు. 551 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క ఎస్జీటీ పోస్టు కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో నిరుద్యోగులు రోడ్డున పడాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాన్ని రాష్ట్ర సర్కారు పట్టించుకోవవడం లేదని అభ్యర్థులంతా ఆగ్రహంతో ఉన్నారు.
మా కడుపులు కొడుతున్నారు
టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిం చకుండా మా కడుపులు కొడుతోంది. ఇప్పటికి ఐదుసార్లు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్‌లు తీసుకుని ప్రస్తుతం అప్పులపాలయ్యాం.
– జ్యోతి ప్రసాద్, చిత్తూరు
ప్రభుత్వం మోసం చేసింది
డీఎస్సీ పేరిట రోజుకొక ప్రకటన చేస్తూ అభ్యర్థులను ప్రభుత్వం మోసం చేస్తోంది. ఇప్పటికే ఐదుసార్లు వాయిదా వేసింది. అరకొర పో స్టులను చూపిస్తూ మభ్యపెడుతోంది. 50వేల పైచిలుకు ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 9 వేలు మాత్రమే చూపుతోంది.
ఈశ్వర్‌రెడ్డి, డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment