ఇదేం ఖర్మ.. బాబూ | dsc notification postponed on 5Th time | Sakshi
Sakshi News home page

ఇదేం ఖర్మ.. బాబూ

Published Thu, Oct 11 2018 9:12 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

 dsc notification postponed on 5Th time - Sakshi

నిరాశ.. నైరాశ్యం.. ఆందోళన.. ప్రస్తుతం ఎక్కడ చూసినా డీఎస్సీ అభ్యర్థుల్లో ఇవే కనిపిస్తున్నాయి. తాజాగా నోటిఫికేషన్‌ వాయిదా పడటంతో ఉద్యోగార్థులు సందిగ్ధంలో పడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, పదే పదే మార్పు మాటలతో తీవ్రంగా నష్టపోతున్నారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ పొంది అప్పులపాలవుతున్నారు. కుటుంబాలకు దూరంగా కోచింగ్‌ సెంటర్లలో పడిన కష్టాన్ని.. తిరిగి రాని కాలన్ని తలచుకుని ఆవేదన చెందుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ సర్కార్‌ నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పదే పదే డీఎస్సీని వాయిదా వేస్తుండటంతో అభ్యర్థులు ‘ఇదేం ఖర్మ బాబూ’ అంటూ నిట్టూరుస్తున్నారు.

‘సత్తెనపల్లి మండలానికి చెందిన కోటేశ్వరరావుది వ్యవసాయ కుటంబం. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే తపనతో డీఎస్సీకి సన్నద్ధమవుతున్నారు. 2009లో ఓ ప్రైవేటు కళాశాలలో సోషల్‌ విభాగంలో బీఈడీ పూర్తి చేశారు. ఇందుకు రూ.50 వేలు ఖర్చయ్యింది. బీఈడీ పూర్తి చేసిన తర్వాత అవనిగడ్డలో రెండు నెలల పాటు డీఎస్సీకి శిక్షణ తీసుకున్నారు. ఇందుకు మరో రూ.30వేలు ఖర్చయ్యింది. 2012లో డీఎస్సీ రాయగా స్పల్ప తేడాతో అర్హత సాధించలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఒక ప్రైవేటు స్కూల్లో నెలకు రూ.1 2వేల  వేతనంపై టీచర్‌గా చేరారు. నాలుగేళ్ల పాటు పని చేసి, తిరిగి డీఎస్సీ కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారు. 2014లో మరోసారి రాయగా ఐదు మార్కుల తేడాతో అవకాశం చేజారింది. ఈ విధంగా ప్రైవేటు స్కూల్లో నెలకు రూ.12 వేలు వచ్చే ఉద్యోగాన్ని వదులుకోవడంతో ఇప్పటి వరకూ 2.50 లక్షలు ఆదాయాన్ని కోల్పోగా, శిక్షణ కోసం ఎదురు రూ.లక్షకు పైగా ఖర్చు చేసి అప్పుల పాలయ్యారు.   ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడటంతో  దిక్కుతోచని స్థితిలో పడ్డారు’.

గుంటూరు ఎడ్యుకేషన్‌: గౌరవ ప్రధమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే నిరుద్యోగ ఉద్యోగార్థుల ఆశలు అడియాశలవుతున్నాయి. చదువుకు గుర్తింపుగా ఉద్యోగాన్ని సాధించి కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నేరవేరడం లేదు. ఆర్థిక పరమైన సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతూ, అప్పులు చేసి మరీ కోచింగ్‌ పొందుతున్న అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ షెడ్యూల్‌లో భాగంగా బుధవారం విడుదల కావాల్సిన నోటిఫికేషన్‌ వాయిదా పడటంతో జిల్లాలోని నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన డీఎస్సీ నోటిఫికేషన్‌ ఈసారైనా విడుదలకాకపోతుందా అని ఎదురు చూసిన వారి ఆశలు నిరాశలయ్యాయి.

ప్రభుత్వ కొలువు వస్తుందా?
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ ఉద్యోగార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై గత నాలుగున్నరేళ్లుగా నాన్చుడు ప్రకటనలు చేస్తూ వచ్చిన ప్రభుత్వం మరోసారి మొండి చెయ్యి చూపింది. దీనిపై సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులు చేసిన ప్రకటనలు సైతం టీడీపీ ఎన్నికల హామీల మాదిరిగా గాలిలో కలిసిపోయాయి. వేల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో వ్యవప్రయాసల కోర్చి నెలల తరబడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులను అసలు తమకు ఈ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టే అవకాశం ఉంటుందా అనే సందేహం పట్టిపీడిస్తోంది. జిల్లాలో గత నాలుగేళ్లలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు వేల సంఖ్యలో ఉండగా,  ప్రభుత్వం ఆర్నెళ్ల కిందట నిర్వహించిన ఉపాధ్యా అర్హత పరీక్ష (టెట్‌)లో 15 వేల మంది క్వాలిఫై అయ్యారు.

మొక్కుబడిగా పోస్టుల సంఖ్య..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని విద్యాబోధనకు 1,500 మంది ఉపాధ్యాయులు అవసరమని విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఉన్నత పాఠశాలలను పట్టి పీడిస్తున్న దాదాపు 800 మేరకు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు మరో 700 వరకూ ఎస్జీటీ, ఎల్‌పీటీ, పీఈటీ పోస్టులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 259 పోస్టులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 

సిలబస్‌ ఖరారు చేయకపోవడంతో గందరగోళం
డీఎస్సీకి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అందుకు ప్రామాణికమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. గత డీఎస్సీతో పోల్చితే రాష్ట్ర విభజన దరిమిలా పాఠ్యాంశాల్లో సమూల మార్పులు చోటు చేసుకునే పరిస్థితుల్లో శిక్షణ పొందడం ఇబ్బందిగా మారింది. సాధారణంగా డీఎస్సీ ప్రకటన వెలువడే ముందుగా వందలాది మంది అభ్యర్థులతో కిట, కిటలాడే కోచింగ్‌ సెంటర్లు ప్రస్తుతం వెల వెల బోతున్నాయి. నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేసేది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకటించకపోవడం, తరచూ వాయిదాలతో కాలయాపన చేస్తుండటంతో కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రకటన వచ్చిన ప్రతిసారీ బ్యాచ్‌లను ప్రారంభించడం, తర్వాత వాటిని నిలిపివేయం చేస్తున్నారు. ఇటీవల కాలం వరకూ గుంటూరు జిల్లా కేంద్రంలో కొన్ని బ్యాచ్‌లకు శిక్షణ నిర్వహించిన కోచింగ్‌ సెంటర్లు ప్రస్తుతం డీఎస్సీ శిక్షణ నిలిపివేశాయి. ప్రస్తుతం జిల్లాలోని చెరుకుపల్లి మినహా మరెక్కడా శిక్షణా తరగతులు జరగడం లేదు. 

రూ.లక్షలు దారపోస్తున్నారు..                        
జిల్లాలోని నిరుద్యోగ యువత డీఎస్సీ కోచింగ్‌ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టు శిక్షణకు మూడు నెలల కాలానికి కోచింగ్‌ సెంటర్లు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 వేలు నుంచి రూ.12 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. అదే విధంగా ఎస్జీటీ పోస్టుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ ఉంది. ఇది డే స్కాలర్‌ అభ్యర్థులకే పరిమితం. గ్రామీణ ప్రాంతాల నుంచి శిక్షణ పొందే వారు భోజన, వసతి సదుపాయాలకు నెలకు అదనంగా మరో ఐదు వేలు చెల్లించారు. ఈ విధంగా గత మూడు,నాలుగేళ్ల నుంచి పలు దఫాలుగా శిక్షణ పొందిన అభ్యర్థుల్లో ఒక్కొక్కరూ రూ. 2 నుంచి రూ. 3 లక్షల వరకూ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో డీఎస్సీ కోసం 40 వేల మంది అభ్యర్థులు ఎదురు చూస్తుండగా, అందులో శిక్షణ పొందిన, పొందుతున్న వారు 15 వేల మంది ఉన్నారు. 

వయో పరిమితిపై ఆందోళన
డీఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో వందలాది మంది వయో పరిమితిదాటి పోయిన వారు ఉన్నారు. 35ఏళ్లు పైబడిన ఐదు వేల మంది అభ్యర్థులు తాజా డీఎస్సీ నోటిఫికేషన్‌లో వయో పరిమితి పెంపుదలపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో మూడు, నాలుగుసార్లు డీఎస్సీ రాసి కొద్దిపాటి తేడాతో విజయావకాశాన్ని జారవిడుచుకుని, చివరి ప్రయత్నంగా సన్నద్ధమవుతుండగా, ప్రభుత్వం  నోటిఫికేషన్‌ను వాయిదా వేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు
డీఎస్సీ–2018 ద్వారా ఎస్జీటీ తెలుగు–19, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు–16, గణితం–15, జీవశాస్త్రం–28, సాంఘికశాస్త్రం–54, ఇంగ్లిష్‌–5, హిందీ–5, భౌతికశాస్త్రం–5, ఎస్జీటీ ఉర్దూ–7 పోస్టులను కలుపుకుని 154 పోస్టులతో పాటు మున్సిపల్‌ పాఠశాలలకు మరో 105 పోస్టులు కేటాయించనున్నారు. 

పదే పదే మాట తప్పి 
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లు గడిచింది. ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయకుండా పోస్టుల సంఖ్యపై పదే పదే మాటలు మారుస్తూ వచ్చింది. డీఎస్సీ–2018ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10,300కు పైగా పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం గత ఆర్నెళ్ల వ్యవధిలో  మూడు సార్లు మాట తప్పింది. చివరికి కేవలం 6,700 పోస్టులకు పరిమితమైంది. కాగా ఇప్పటి వరకూ జిల్లాకు ఎన్ని పోస్టులు ఇచ్చేది అధికారికంగా ప్రకటించలేదు. దీనికి తోడు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, సిలబస్‌ను ఖరారు చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

భవిష్యత్‌ అగమ్యగోచరం
మరోమారు డీఎస్సీని వాయిదా వేయడంతో మా భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. చిన్న చిన్న ఉద్యోగాలతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. మానసికంగా కుంగి పోతున్నాం. పదే పదే నోటిఫికేషన్‌లను పొడిగించుకుంటూ పోవడం దారుణం. ఒక్కొక్క టీచర్‌ ఎల్జిబులిటీ టెస్ట్‌ (టెట్‌)కు రూ.15వేలు వరకు ఖర్చుచేశాం. ఇప్పుడు టెట్, టీఆర్‌టీని కలిపి ఒకేసారి నిర్వహిస్తూ యూపీపీఎస్‌సీ ఉద్యోగాలకు కూడాలేని పోటీని దీనిలో సృష్టించారు. 
– వి.లక్ష్మీనారాయణ, నరసరావుపేట

నోటిఫికేషన్‌ విడుదలలో కాలయాపన
ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నేను నా భార్య వేదమణి రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నాం.  మధ్య తరగతి కుటుంబమైనప్పటికీ ఉద్యోగం వస్తుందనే ఆశతో స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, సాంఘికశాస్త్రం పోస్టులకు ఇప్పటికి శిక్షణకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశాం. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, సిలబస్‌ ప్రకటించకుండా నోటిఫికేషన్‌ను తరచూ వాయిదా వేస్తుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 
– శానం రాంబాబు, వేదమణి, తుళ్లూరు మండలం

వయస్సు కూడా దాటిపోయింది 
మాది మధ్య తరగతి కుటుంబం. ఎంతో ఆశతో బీఈడీ చదివాను. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ అక్కడా, ఇక్కడా ప్రైవేటు విద్యాలయాల్లో చిన్నపాటి టీచర్‌గా ఉద్యోగం చేస్తూ చాలీచాలనీ జీతంతో నెట్టుకొస్తున్నాను.  ఐదోసారి నోటిఫికేషన్‌ విడుదలవుతుందనే ఆశతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి డీఎస్సీకీ సన్నద్ధమవుతున్నాను.  నా వయస్సు అర్హత  దాటిపోయింది.       
 – బి.రామాంజిరెడ్డి, నరసరావుపేట

చంటి బిడ్డను వదిలి
ప్రభుత్వ కొలువులో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోనే ఆరు నెలల చంటిబిడ్డను సైతం ఇంటి వద్దనే వదిలి కోచింగ్‌ తీసుకుంటున్నాను. ఇప్పటికే రెండుసార్లు టెట్‌ పరీక్షలను రాశాను. టెట్‌ పరీక్షల్లో వెయిటేజి మార్కులు ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం వెంటనే డీఎస్సీ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా నోటిఫికేషన్‌ను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలి.
–తాడిపర్తి నాగరాణి, ఐలవరం


రెండు సార్లు టెట్‌ రాసినా
ఇప్పటికే రెండు సార్లు టెట్‌ రాసి డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం గత ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నాను. గుళ్లపల్లిలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో ఎంతో కష్టపడి ఉద్యోగ సాధనకై పట్టుదలతో కృషిచేస్తున్నాం. నోటిఫికేషన్‌ విషయంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారంతో ఆందోళనగా ఉంది. నోటిఫికేషన్‌ విడుదల కాకుండా చదివిన చదువుకు, పొందిన శిక్షణకు ప్రయోజనం లేకుండా పోతుంది. 
–బంకా జ్యోతి, పిడుగురాళ్ల

15 వేలు
టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య

259
డీఎస్సీ–2018 ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్న పోస్టులు

40 వేలు
డీఎస్సీ కోసం 
ఎదురుచూస్తున్న 
అభ్యర్థులు

15 వేలు
ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ 
పొందిన వారి సంఖ్య

డీఎస్సీ కోచింగ్‌కు ఖర్చు..
స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 
మూడు నెలలకు    రూ.12 వేలు
స్టడీ మెటీరియల్‌      రూ. 3 వేలు
వసతి, భోజనం     రూ.15 వేలు
మొత్తం      రూ.30 వేలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement