కాకినాడకు కొత్తమాస్టర్ ప్లాన్
కాకినాడ సిటీ :పారిశ్రామికంగానే కాక విద్యా, వైద్యరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరానికి 2031 లక్ష్యంగా కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందుతోంది. 1975లో తయారు చేసిన 39 ఏళ్ల నాటి మాస్టర్‌ప్లానే ప్రస్తుతం కొనసాగుతోంది. ఆప్లాన్‌ను సవరించాలనే ప్రతిపాదన ఉన్నపటికీ వివిధ కారణాలతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే రెండేళ్ల క్రితం కసరత్తు ప్రారంభించినప్పటికీ కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై బుధవారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ హాల్‌లో కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ నీతూప్రసాద్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, హైదరాబాద్‌కు చెందిన ఆర్‌వీ అసోసియేట్స్ కన్సల్టెన్స్ ప్రతినిధులతో వర్క్‌షాప్ జరిగింది.
ఈ సందర్భంగా నగర మాస్టర్‌ప్లాన్‌పై రూపొందించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్‌వీ అసోసియేట్స్ కన్సల్టెన్స్ సంస్థ ఉపాధ్యక్షులు వై.రమేష్ వివరించారు. ఈ ప్రజెంటేషన్‌ను తిలకించిన కలెక్టర్ మాట్టాడుతూ రాజమండ్రి నగరానికి ఇప్పటికే మాస్టర్‌ప్లాన్ డ్రాప్టు ప్రచురించామన్నారు. త్వరలో కాకినాడ నగరానికి 5 కిలోమీటర్లు పరిధిలో అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి అమలు చేస్తామన్నారు. ఈ మాస్టర్‌ప్లాన్‌ను కేవలం అధికారుల సూచనలు, సలహాలకే పరిమితం చేయకుండా నగరంలోని ప్రజల అభిప్రాయాలు, నేతల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అందరి సలహాలతో ఎటువంటి విమర్శలకు తావులేని మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తామన్నారు.
కోస్తా తీరంలో విశాఖ-కాకినాడ మధ్య సీపీపీఐఆర్ రీజియన్ రానుండడం, కాకినాడ పోర్టును రాబోయే రోజుల్లో పెద్ద రేవుగా అభివృద్ధి చేయనుండడంతో వచ్చే 20 ఏళ్లలో పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ ఉంటుందన్నారు. ప్రస్తుతం కాకినాడలో 3లక్షల 20వేల వరకు ఉన్న జనాభా వచ్చే 20 సంవత్సరాలలో సుమారు 10 లక్షలకు చేరి పెద్దనగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాలన్నిటినీ దృష్టిలోకి తీసుకుని అన్ని వర్గాలవారి అభిప్రాయాలను తెలుసుకుని రెండు నెలల్లో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలన్నారు. వర్క్‌షాపులో టౌన్‌ప్లానింగ్ రీజనల్ డెరైక్టర్ రామకృషారెడ్డి, కాకినాడ ఆర్డీవో అంబేద్కర్, డీఎస్‌పీ విజయబాస్కరరెడ్డి, కార్పొరేషన్ కమీషనర్ గోవిందస్వామి, ఎస్‌ఈ నవరోహిణి తదితరులు పాల్గొన్నారు.