రీ షెడ్యూల్ ఇప్పట్లో లేనట్టే | no rescheduled farm loans | Sakshi
Sakshi News home page

రీ షెడ్యూల్ ఇప్పట్లో లేనట్టే

Published Fri, Jul 25 2014 1:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రీ షెడ్యూల్ ఇప్పట్లో లేనట్టే - Sakshi

రీ షెడ్యూల్ ఇప్పట్లో లేనట్టే

సాక్షి ప్రతినిధి, ఏలూరు : రుణమాఫీ అంశంపై స్పష్టత ఇవ్వకుండా జాప్యం చేస్తూ  వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రుణాలు రీ షెడ్యూ ల్ చేస్తామని చెబుతోంది. అది కూడా ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రీ షెడ్యూల్ చేయాలంటే ముందుగా రైతుల రుణాలకు సంబంధించిన వివరాలను, ఏయే బ్యాంకుల్లో ఏయే కుటుంబాలకు ఎన్నేసి రుణాలు ఉన్నాయనే సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. ఇందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈలోగా రుణాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు.
 
 ఈ తతంగమంతా గడిచి రీ షెడ్యూల్ అమలయ్యేసరికి ఖరీఫ్ పుణ్యకాలం కూడా గడిచిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై మూడు నెలలు గడుస్తున్నా జిల్లాలోని రైతులకు బ్యాంకుల నుంచి నయాపైసా కూడా రుణం అందలేదు. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో ఇదే సమయానికి వివిధ బ్యాంకుల నుంచి రైతులు రూ.600 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో జిల్లాలో బ్యాంకర్లు ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా రుణం ఇవ్వలేదు. ప్రభుత్వం కుటుం బానికి రూ.లక్షన్నర రుణం రీషెడ్యూల్ చేస్తామని ప్రకటించినా ఇంతవరకు ఆర్‌బీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, ఎప్పుడు వస్తాయో తెలియదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఆర్‌బీఐ నుంచి స్పష్టత వచ్చేవరకు రైతులకు ఒక్క పైసా కూడా రుణం ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు.
 
 రీ షెడ్యూల్ చేస్తే 10.50 శాతం వడ్డీ
 గడువులోగా చెల్లించి ఉంటే వ్యవసాయ రుణాలపై ఏడు శాతం వడ్డీ పడేది. రుణాల  చెల్లింపులో జాప్యం కారణంగా ఇప్పుడు 10.50  శాతం పడుతోంది. ఆర్‌బీఐతో ప్రభుత్వం చర్చిస్తే వడ్డీ తగ్గే అవకాశం ఉందని, ఇప్పటివరకైతే దీనిపైనా స్పష్టత లేదని బ్యాంకర్లు  చెబుతున్నారు. ఇప్పుడు రైతులు రుణం మొత్తాల్ని తిరిగి చెల్లించినా 10.50 శాతం వడ్డీ వసూ లు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
 
 డ్వాక్రా రుణాలపై 13 నుంచి 15 శాతం వడ్డీ
 ఇదిలావుంటే డ్వాక్రా రుణాలు రీ షెడ్యూల్ చేసే అవకాశమే లేదని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. గడువులోగా డ్వాక్రా రుణమొత్తాలను చెల్లిస్తే ఒక్క రూపాయి కూడా వడ్డీపడదని, ఆ మొత్తాల చెల్లిం పు జాప్యమైన కారణంగా బ్యాంకులను బట్టి 13 నుంచి 15శాతం వడ్డీ పడుతుందని చెబుతున్నారు. ఈ వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందా అనే దానిపైనా స్పష్టత లేదని అంటున్నారు. జిల్లా విషయూనికి వస్తే 61,120 సంఘాలు రూ.925 కోట్ల రుణాలు పొందాయి.
 
 అయోమయంలో కౌలు రైతులు
 రుణమాఫీ విషయంలో కౌలు రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. జిల్లాలో రెండున్నర లక్షలమంది కౌలు రైతులు ఉన్నారు. గతేడాది  వీరిలో 54వేల మందికి రూ.138 కోట్ల రుణాలిచ్చారు. వీరికి రుణమాఫీ వర్తిస్తుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. భూ యజమాని, కౌలు రైతు ఒకే సర్వే నంబర్‌పై రుణం పొంది ఉంటే తొలి ప్రాధాన్యం కౌలు రైతుకే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. దీంతో తమ రుణాలు మాఫీ అవుతాయో లేదోనన్న ఆందోళన కౌలు రైతుల్లో నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వపరంగా కౌలు రైతులకిచ్చిన రుణం తక్కువ. ఈ తక్కువ కూడా మాఫీ చేసేందుకు సిద్ధం కాకపోవడం బాధాకరమని కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆధార్ లింకుతో ఆందోళన
 ఆధార్, పట్టాదార్ పాస్‌పుస్తకాల నంబర్లను రైతుల ఖాతాలకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు సూచించారు. ఆధార్ నంబర్ ఇచ్చినవారికే రుణమాఫీ వర్తిస్తుందనే విషయూన్ని రైతులకు చెప్పాల్సిందిగా ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆదేశించారు. ప్రస్తుతానికి జిల్లాలో 3 లక్షల మందికి ఆధార్ కార్డులు లేవు. వీరిలో రైతులే ఎక్కువ. ఆధార్ నంబర్‌ను సాకుగా చూపి రుణమాఫీని మరింత జాప్యం చేయడం గానీ లేదా పూర్తిగా ఎత్తేసే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆధార్ కార్డులున్న వారిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రుణమాఫీ అయిన రైతుకు భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిలో కోత పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రైతులను నట్టేట ముంచేందుకే ఆధార్ లింకు పెడుతున్నారని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
 
 త్వరలోనే స్పష్టత వస్తుంది
 రుణాల రీ షెడ్యూల్ విషయమై వచ్చే వారంలో స్పష్టత వస్తుంది. త్వరలో రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత రీ షెడ్యూల్ విషయమై స్పష్టత వస్తుంది.
 - ఎం.లక్ష్మీనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్
 
 సాగు విస్తీర్ణం తగ్గుతుంది
 రైతులకు వ్యవసాయ రుణాలు అందని కారణంగా జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణ భారీగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్ మొదలై మూడు నెలలు గడచినా ఎక్కడా వ్యవసాయ పనులు పుంజుకో లేదు. ఇప్పటివరకూ జిల్లాలో కేవలం 32వేల హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేశారు. గతేడాదితో పోలిస్తే..  15 శాతానికి లోపే పంటలు సాగయ్యే పరిస్థితి  నెలకొంది.                       
 - కె.శ్రీనివాసరావు,
 కౌలు రైతుల సంఘం నాయకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement