ప్రమాదం కాదు.. హత్యే
'సాక్షి' కథనంతో పోలీసుల రంగప్రవేశం
ప్రమాదం కేసు హత్యకేసుగా మార్పు
నాయుడుపేట టౌన్: ఈనెల 15న ప్రమాదవశాత్తూ మిద్దెపై నుంచి పడి మృతి చెందిన రమణయ్యది ప్రమాదం కాదు హత్యేనని పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో కేవలం రూ. 250 నగదుకోసం విచక్షణారహితంగా సొంత అన్నపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి మృతికి తమ్ముడే కారణమన్న విషయాన్ని పోలీసులు శుక్రవారం వెలుగులోకి తెచ్చారు. ఈ విషయమై సాక్షిలో ప్రచురితమైన కథనం ఆధారంగా పోలీసులు రంగప్రవేశంచేసి తమ్ముడే హత్యచేసినట్లుగా గుర్తించిన సంఘటన సంచలనం కలిగించింది. మిద్దెపై నుంచి పడి చికిత్సలు పొందుతూ మృతిచెందినట్లుగా వాస్తవాలను దాచి మృతుని భార్య ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులను శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయానికి పిలిపించి సీఐ విచారించగా జరిగిన సంఘటనపై నిజాలను వెల్లడించారు.
స్థానిక సీఐ రత్తయ్య తెలిపిన వివరాలు మేరకు.. మండల పరిధిలోని వద్దిగుంటకండ్రిగ దళితవాడకు చెందిన సగ్గం రమణయ్య (47) కూలిపనులు చేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకొనేవాడు. ఈ క్రమంలో ఈ నెల 15రాత్రి రమణయ్య భార్య వెంకటమ్మతో కలిసి గ్రామసమీపంలో రహదారి పక్కనేవున్న బీడీబంకు వద్దకు వచ్చాడు. అక్కడేవున్న తమ్ముడు సగ్గం పరంధామయ్య సాగునీటిబోరుకు సంబంధించి రూ. 250 బకాయి వుందని చెప్పడంతో ఇద్దరిమద్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరువురు రహదారి సమీపంలోనే ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు.
అక్కడి నుంచి అరుచుకుంటూ పెట్రోలుబంకు సమీపానికి వచ్చేసరికి రమణయ్యను కోపంతో తమ్ముడు పరంధామయ్య బండరాయి తీసుకొని తలపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన రమణయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి 16న నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి అక్కడి వైద్యసేవలు అందిస్తుండగా 17న మృత్యువాతపడ్డాడు.
అయితే వాస్తవాలు చెప్పకుండా మిద్దెపైనుంచిపడి మృతిచెందినట్లుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రమాదంలో గాయపడి చికిత్సలు పొందుతూ మృతిచెందినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ విషయమై రమణయ్యను దారుణంగా కొట్టి చంపారు అన్న కథనం సాక్షి పత్రికలో వె లువడడంతో దీని ఆధారంగా పోలీసులు రంగప్రవేశంచేసి నిజాలు నిగ్గుతేల్చారు. ఈ మేరకు అన్నను తమ్ముడే దాడిచేసి హత్యచేసినట్లుగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో వున్న రమణయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.