29న రాష్ర్ట బంద్‌ను జయప్రదం చేయండి
రాయచోటి : ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 29 వతేదీన చేపట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమరనాథ్‌రెడ్డి కోరారు. స్థానిక ఎస్‌ఎన్‌కాలనీలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బంద్‌ను విజయవం తం చేయడం ద్వారా ఈ రాష్ర్ట ప్రజల మనోభావాలను జాతీయ స్థాయిలో చాటాలన్నారు.
ఆనాడు పార్లమెంటులో బీజేపీ నేతలు అరుణ్‌జైట్లి, వెంకయ్యనాయుడు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదని, 10ఏళ్ల పాటు అవసరమని వాదించి ప్రస్తుతం ప్యాకేజీ అంటూ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ప్రత్యే క హోదా సాధన కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి డిల్లీలో ధర్నా చేపట్టి జాతీయ,అంతర్జాతీయ స్థాయికి ఈ సమస్యను తీసుకెళ్లారన్నారు. సీఎం చంద్రబాబు డిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలు గట్టిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసనలు తెలియజేయడం ఒక్కటే మార్గమని, తద్వారా నే ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. అనంతరం ఎమ్మె ల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కేవలం రాజధానిపై గ్రాఫిక్స్ తయారు చేసి ప్రకటనలు ఇస్తూ ప్రత్యేక హోదాపై తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తొలి నుంచి రాయలసీమకు అన్యాయం జరుగుతూనే వస్తోందన్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బంద్‌కు సంపూర్ణ మద్దతు
కడప అగ్రికల్చర్ : రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నిలువునా మోసం చేసిన బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామని నమ్మబలికిన టీడీపీ తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 29వ తేదీన ఇచ్చిన బంద్ పిలుపునకు సీపీఐ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ అంటూ నమ్మబలికి నేడు చావుకబురు చల్లగా సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నారని పేర్కొన్నారు.