‘ఆపరేషన్ వీక్’తో హడల్
Published Tue, Oct 1 2013 1:45 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
చండూరు, న్యూస్‌లైన్ :ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యాన్ని దూరం చేసేందుకు జిల్లా స్థాయిలో ‘ఆపరేషన్ వీక్’ పేరుతో ఏర్పాటు చేసిన బృందాలు ఆకస్మిక దాడులు చేస్తూ హడలెత్తిస్తున్నాయి. దీంతో అన్ని డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న అధికారుల్లో జంకు మొదలైంది. గతంలో రేషన్‌షాపులపై డేగకన్ను వేసేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. కానీ వారు ఒక సివిల్‌సప్లై శాఖకే పరిమితం కావడంతో మిగతా శాఖల్లో నిర్లక్ష్యం నెలకొంది. దీంతో ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ చిరంజీవులు ఆపరేషన్ వీక్ అనే పేరుతో బృందాలను సెప్టెంబర్ 17 తేదీన ఏర్పాటు చేశారు. డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ పౌరసరఫరాల అధికారి టీం లీడర్‌గా, ముగ్గురు డీటీలు, ఇద్దరు ఆర్‌ఐలు, ఏఎస్‌డబ్ల్యూఓ, ఉప విద్యాశాఖాధికారి, ఐసీడీఎస్ శాఖ నుంచి ఓ అధికారి సభ్యులుగా ఉంటారు.
జిల్లా మొత్తంలో 5 టీంలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో ఇద్దరు ఏఎస్‌ఓలు, ముగ్గురు డీటీలతో మరో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. వీరు మిగతా టీంలను పర్యవేక్షిస్తారు. ఈ టీంలకే ఆపరేషన్ వీక్ అనే పేరు పెట్టారు. సోషల్ వెల్‌ఫేర్, ఎస్‌టీ, ఎస్సీ, మైనార్టీ వసతి గృహాలు, సివిల్ సప్లై గోదాంలు, రేషన్ షాపులు, ఐసీడీఎస్ కార్యాలయాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు చేస్తారు. నెలలో ఓ వారం మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన తనిఖీలు నిర్వహిస్తారు. ఆపరేషన్ వీక్ బృందాల దృష్టికి వచ్చిన సమస్యలను 8వరోజు జాయింట్ కలెక్టర్ సమక్షంలో జరిగే ప్రత్యేక సమావేశంలో వివరిస్తారు. దీంతో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటారు.
జిల్లాలో 174 కేసులు నమోదు
కొత్తగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ వీక్ బృందాలు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 24 వరకు వివిధ శాఖల్లో తనిఖీలు చేపట్టి 174 కేసులు నమోదు చేశారు. ఇందులో 26 రేషన్ షాపులపై, 18 శాఖ పరమైనవి, సోషల్ వెల్‌ఫేర్‌లో 40 కేసులు, బీసీ వసతి గృహ అధికారులపై 30, ఐసీడీఎస్‌లో 30, ఎస్‌టీ వసతి గృహ అధికారులపై 30 కేసులు నమోదు చేశారు. వచ్చేనెల చివరి వారంలోనూ తనిఖీలు ఉం టాయి. బృందాల పనితీరును జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు.
Advertisement
Advertisement