పెప్పర్ స్ప్రే.. కాంగ్రెస్ డ్రామానే: వైఎస్ జగన్‌ | Pepper spary is part of congress drama, says Ys Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

పెప్పర్ స్ప్రే.. కాంగ్రెస్ డ్రామానే: వైఎస్ జగన్‌

Published Tue, Feb 18 2014 1:25 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

పెప్పర్ స్ప్రే.. కాంగ్రెస్ డ్రామానే: వైఎస్ జగన్‌ - Sakshi

పెప్పర్ స్ప్రే.. కాంగ్రెస్ డ్రామానే: వైఎస్ జగన్‌

‘ఎకనమిక్ టైమ్స్’ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
సమైక్యవాదుల ఆగ్రహం
పోలీసులతో వాగ్వాదం.. తోపులాట.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
గంట తర్వాత జగన్ విడుదల.. శాంతించిన కార్యకర్తలు

 
 సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో గురువారం నాడు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడే పెప్పర్ స్ప్రే చల్లటం ప్రణాళికలో భాగమేనని, సభలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవటానికి తిరుగుబాటు చేసిన ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయటం వంటివన్నీ కాంగ్రెస్ అధిష్టానం నాటకంలో అంతర్భాగమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సోమవారం ఢిల్లీలో సమైక్య దీక్ష చేపట్టటానికి ముందు ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు వెళుతున్న బీజేపీ.. సాధారణ ఎన్నికల అనంతరం తమ పార్టీ మద్దతుపై ఏ మాత్రమైనా ఆశలు పెట్టుకోవాలనుకుంటే.. ముందు పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని స్పష్టంచేశారు. జగన్ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...
 ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్రం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మీ స్పందనేమిటి?
 
 రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను యూపీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినా, తెలుగు ప్రజలు విభజనకు ఇష్టపడకపోయినా.. వారిని విడగొట్టాలని ప్రయత్నిస్తోంది. గతంలో రాష్ట్రాలను విభజించినపుడు ఒక పద్ధతిని పాటించారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరించాలని ఎస్‌ఆర్‌సీ సిఫారసు చేసినపుడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. లేదా సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా విభజనను ఆమోదిస్తూ తీర్మానాలు చేసి పంపినపుడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఇపుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే ఉత్తమమని సిఫారసు చేసినా దాన్ని పక్కన పెట్టేశారు. 3వ అధికరణను నిరంకుశంగా, నియంతృత్వంగా దుర్వినియోగం చేస్తున్నారు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన తీరు కూడా చాలా ప్రమాదకరమైనది. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ బిల్లును ప్రవేశపెట్టిన తీరు దిగ్భ్రాంతికరం.. కుట్రపూరితం.
 
 కుట్రపూరితం ఎలా..?
 విభజన బిల్లును ప్రవేశపెట్టిన తీరును పరిశీలిస్తే తెలుస్తుంది. లోక్‌సభ స్పీకర్ సభలోకి అప్పుడే వచ్చారు.. పది సెకన్లలోనే బిల్లు ప్రవేశపెట్టినట్లు ప్రకటించేశారు. గతంలో ఉన్న ఎలాంటి సంప్రదాయాలనూ పాటించలేదు. బిల్లు ప్రతిపాదించేందుకు సంబంధిత మంత్రి లేచి నిలబడాలి. బిల్లు ప్రతిపాదనకు అనుమతిని కోరుతూ ‘ఎస్’ అని ఎవరంటారో.. ‘నో’ అని ఎవరంటారో.. స్పీకర్ అడగాలి. మెజారిటీ సభ్యులు ‘ఎస్’ అన్నపుడే బిల్లును సభలో ప్రతిపాదించాలి. అలాంటివేవీ ఇక్కడ జరగలేదు. దీనిపై తర్వాత ఎల్.కె.అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటి నేతలు, నేను, జేడీయూ, బీజేడీ, ఏఐఏడీఎంకె లోక్‌సభా పక్షాల నాయకులందరం స్పీకర్‌ను, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కలిసి మా నిరసనను నమోదు చేయాలని కోరాం. కానీ వారు తిరస్కరించారు. మేం స్పీకర్ చాంబర్ నుంచి వాకౌట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కాంగ్రెస్ పన్నిన పథకంలో భాగమే! ‘పెప్పర్ స్ప్రే’ దాడి జరిగిందనే సంఘటనతో సహా. విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎంపీలను సభలో లేకుండా చేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ఒక దుష్ట పన్నాగంతో కాంగ్రెస్ ఇలా చేసింది.
 
 కాంగ్రెస్ నుంచి సస్పెండైన ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‘పెప్పర్ స్ప్రే’తో దాడి చేసిన సంఘటన కూడా ఆ పార్టీ నాటకంలో భాగమే నంటారా?
 
 కచ్చితంగా. ల గడపాటి రాజగోపాల్ గతమేంటో మీకు బాగా తెలుసు. లగడపాటికి చెందిన కంపెనీకి 9,000 కోట్ల రూపాయల మేరకు మళ్లీ రుణం ఇస్తూ ప్రయోజనం చేకూర్చిన వైనం ఎకనామిక్ టైమ్స్ పత్రికలోనే మొదట ప్రచురితమైంది. కార్పొరేట్ సంస్థల రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకం (సీడీఆర్) కింద ఈ రుణం ఆయన కంపెనీకి వచ్చింది. దివాళా తీసిన లగడపాటి కంపెనీని గట్టెక్కించడానికి రూ. 3,500 కోట్ల రుణాన్ని కేవలం 239 కోట్ల రూపాయల ఈక్విటీతో 27 బ్యాంకులు ఎలా ఇచ్చాయన్న విషయం కూడా ఎకనమిక్ టైమ్స్ రాసింది. కాంగ్రెస్ అధినాయకత్వం, యూపీఏ ప్రభుత్వం ఆయనకు సహకరించకుండానే ఇంత పెద్ద మొత్తంలో రుణం వచ్చిందా? ఇప్పుడు చెప్పండి.. రాజగోపాల్ వంటి కాంగ్రెస్‌కు విధేయమైన వ్యక్తి అధిష్టానాన్ని ధిక్కరిస్తారని కలలో కూడా ఎవరైనా ఊహించగలరా! రాజగోపాల్ పెప్పర్ స్ప్రే దాడి చేశారనే పేరుతో, టీడీపీ ఎంపీ తన సొంత పార్టీ సభ్యుడితోనే కొట్లాటకు దిగారని, మాతో సహా విభజనను వ్యతిరేకిస్తున్న వారందరినీ సభలో లేకుండా చేసి తెలంగాణ బిల్లును ఆమోదింప జేసుకోవాలని చూశారు. నేను సభలో ఎలాంటి హింసకైనా దిగటం ఎవరైనా చూశారా? లేదు. కనుకనే ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకం.
 
 తెలంగాణ ఇవ్వాలన్న కేంద్రం, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిఘటిస్తున్నారు కదా! ఆయన కొత్త పార్టీ పెడతారని కూడా చెప్తున్నారు?
 మనందరికీ తెలుసు కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతటి సమర్థుడో. విమానాశ్రయాల లాంజ్‌ల్లో ముఖ్యమంత్రులను బహిష్కరించేస్తుందనే పేరున్న కాంగ్రెస్ పార్టీలో.. ఒక బలహీనుడైన కాంగ్రెస్ సీఎం పార్టీలో తిరుగుబాటు చేస్తున్నట్లుగా నటిస్తున్న జోక్‌ను చూడండని నేను తరచుగా చెప్తూనే ఉన్నా. కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్టానాన్ని ధిక్కరించేంత రాజకీయ సత్తా లేదు. తెలంగాణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగుల చేత కిరణ్ సమ్మె విరమింపజేసి అధిష్టానానికి సహకరించలేదా? రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజున కిరణ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటే అభినందించేవాడిని. కిరణ్ అధిష్టానానికి ఎప్పుడేం కావాలంటే అది చేస్తూ పూర్తిగా సహకరిస్తూనే.. తిరుగుబాటు చేస్తున్నట్లుగా నటిస్తున్నారు.
 
  అయినా మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ, శాసనసభకు ఎన్నికలు ప్రకటించనుండగా కిరణ్ పదవిలో ఉంటే ఏమిటి? వైదొలిగితే ఏమిటి? విభజనకు అనుకూలంగా తెలంగాణలోనూ, వ్యతిరేకంగా సీమాంధ్రలోనూ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎలాగైతే ద్వంద్వ ప్రమాణాలకు ప్రతీకగా నిలిచారో.. అలాగే కిరణ్ కూడా అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా మారారనేది తేటతెల్లమవుతోంది. ఆంధ్రప్రదేశ్ సమైక్యతను పరిరక్షించేందుకు చిత్తశుద్ధితో ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే పోరాడి గెలుస్తుంది. నన్ను లోకసభ నుంచి బయటకు గెంటేసినందున.. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు అన్ని ప్రతిపక్షాల నుంచీ సాధ్యమైనంత ఎక్కువ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలా ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిశాను. బిల్లును అడ్డుకోవటంలో, రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా నిరోధించటంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పాత్ర కీలకమైనదని నేను భావిస్తున్నా.
 
 తెలంగాణ బిల్లును అడ్డుకున్నట్లయితే నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తారా? నాకు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్ సమైక్యత చాలా ముఖ్యం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు, పాలనానుభవం ఉన్న మోడీ.. ప్రజాస్వామ్యంలో సమాఖ్య సిద్ధాంతం ప్రాధాన్యత ఏమిటో, ఆ సమాఖ్య సూత్రాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారో అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నా. అందుకే నేను మోడీతో సహా బీజేపీ నేతలందరికీ చెప్తున్నా.. పూర్తి స్పష్టతతో నిలవాలని, పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని కోరుతున్నా. ఇప్పుడు మాకు కావాల్సింది.. బీజేపీ ముందున్న పరీక్ష అదే. తదుపరి విషయాలు ఎలా ఉంటాయో చూద్దాం.
 
 కాంగ్రెస్ పార్టీకి కూడా మీపై ఆశలున్నాయి. వైఎస్సార్ సీపీ ఎన్నికల తరువాత తమకు మద్దతు నిస్తుందని. మీరిప్పటికీ మనసులో కాంగ్రెస్ వాదేనని వారు భావిస్తున్నారు?
 కాంగ్రెస్‌వాది అంటే ఏమిటో నిర్వచనం వాళ్లనే (కాంగ్రెస్ వారినే) చెప్పమనండి. తెలంగాణపై రెండో ఎస్సార్సీ (రాష్ట్రాల పున ర్వవస్థీకరణ కమిటీ)ని నియమిస్తామని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ వాగ్దానం చేసింది. 2009 ఎన్నికల  ప్రణాళికలో రోశయ్య కమిటీ నివేదికతో పరిష్కరిస్తామని పేర్కొంది. ఇపుడు ఏ కమిషన్ నివేదిక లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ వాది అంటే నిర్వచనమిదేనా? అలా అయితే, నన్ను చెప్పనివ్వండి.. నేను ైవె ఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిని. నేను మా నాన్నలాగే ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేసి తీరతాను.
 
 సోనియాగాంధీకి మీ నాన్న సన్నిహితుడు. ఆయన నేతృత్వంతో రెండుసార్లు కాంగ్రెస్ ఘన విజయాలను సాధించింది. మిమ్మల్ని ఆ పార్టీ నుంచి వీడేలా చేశారు. జైల్లో పెట్టారు. ఇదంతా ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది!
 నిజానికి.. ఆ బాధాకరమైన అంకాన్ని నేను వెనుదిరిగి చూడాలనుకోవటం లేదు. దేవుడు అన్నీ చూస్తున్నాడని నాకు తెలుసు. ఆయనకు తెలుసు ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో.. అది ఆయనకే వదలేస్తున్నా. నేను పట్టించుకోను. తప్పులు ఎవరు చేశారో వారిని క్షమించాల్సింది ఆయనే. అవును, నేను 16 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. బెయిల్ పొందడమనే నా ప్రాథమిక హక్కును కూడా.. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాననే అతిబలహీనమైన సాకుతో నిరాకరించారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఉన్న సాక్షులను ఒక ప్రతిపక్షంలో ఉన్న నేతగా ఎలా ప్రభావితం చేస్తాను! ప్రజల మద్దతుతో, దేవుడి దయతో ఇప్పటికీ నేను పోరాడుతూనే ఉన్నాను.
 
 మీకూ సోనియాకు మధ్య మనస్పర్థలకు, కాంగ్రెస్‌ను వీడిపోవడానికి కారణం కొన్ని కుట్రలేనన్న వదంతులు ఉన్నాయి...
 ఒక్కటే చెప్పగలను. మా నాన్నగారు చనిపోయిన కొద్ది రోజులకు ఆయన హెలికాప్టర్  ప్రమాదానికి గురై మరణించిన ప్రదేశానికి వెళ్లాను. మా తండ్రిగారి మరణాన్ని తట్టుకోలేక సుమారు 800 మంది మరణించారు. మరణించిన ప్రతి ఒక్కరి ఇళ్లకూ వెళ్లి పరామర్శిస్తాన నే మాటను అపుడే చెప్పాను. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో నేను వారి ఇళ్లకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకత్వం అనుమతిని ఆరు నెలల పాటు నిరాకరించింది. నేను సోనియాగాంధీని, అహ్మద్‌పటేల్‌ను మరికొందరు నేతలను కొన్నిసార్లు కలిశాను. వారి కుటుంబాలను ఎందుకు సందర్శించాలనుకుంటున్నానో కూడా వారికి చెప్పాను. నేను, మా అమ్మ కలిసి సోనియాగాంధీ వద్దకు వెళ్లి మళ్లీ అంతా చెప్పాం కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement