340 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
Published Fri, Nov 29 2013 3:26 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవని విజిలెన్స్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని విజిలెన్స్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందిన సమాచారం మేరకు గురువారం ఉదయం అంకిరెడ్డిపాలెం వై.జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. ఓ లారీలో పై భాగంలో తెల్లగోతాలతో ఉన్న బియ్యం బస్తాల మధ్య 340 రేషన్‌బియ్యం బస్తాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. లారీ డ్రైవర్‌ను అదుపులో తీసుకుని విచారించగా సంతమాగులూరు మండలం, వేల్చూరు గ్రామంలోని అడవిపాలెం నుంచి రేషన్ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు రవాణా చేస్తున్నట్లు తెలిసిందన్నారు.
విచారణలో రేషన్ బియ్యం అక్రమరవాణాకు బాధ్యులుగా నరసరావుపేటకు చెందిన వాసు, వినుకొండకు చెందిన వేణుగోపాలరెడ్డి, గోరంట్ల శంకర్‌లుగా తెలిందన్నారు. లారీలోని 340 రేషన్ బియ్యం బస్తాలను గోడౌన్‌కు తరలించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం అందించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. సమావేశంలో విజిలెన్స్ ఎస్‌ఐ షేక్ ఖాసిం, విజిలెన్స్ తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు మహేష్, రాంబాబు, కానిస్టేబుల్ సత్యసాయి పాల్గొ న్నారు.
Advertisement