అసెంబ్లీ వీడియోలన్నీ బహిరంగపర్చాలి | Public assembly videos | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ వీడియోలన్నీ బహిరంగపర్చాలి

Published Thu, Mar 19 2015 2:31 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

Public assembly videos

  • చెవిరెడ్డి, రోజా, ప్రతాప్ కుమార్‌రెడ్డి సవాలు
  • అధికారపక్షానికి అనుకూలంగా ఉండేవే చూపిస్తే చాలదు
  • లోకేష్ అవినీతిని ప్రశ్నించకూడదనే పట్టిసీమపై చర్చ సాగనివ్వలేదు
  • ముఖ్యమంత్రే స్వయంగా ఎమ్మెల్యేలను మాపై ఉసిగొల్పుతున్నారు

  • సాక్షి, హైదరాబాద్: అధికారపక్షానికి నిజంగా నిజాయితీ, దమ్మూ ధైర్యం ఉంటే శాసనసభ బడ్జెట్ సమావేశాల వీడియో క్లిప్పింగ్‌లన్నింటినీ(మొత్తం దృశ్యాలను) బహిరంగపర్చాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్.కె.రోజా, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సవాలు విసిరారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి సంబంధించిన కేవలం అరగంట వీడియాను విడుదల చేస్తే సరిపోదని, అధికారపక్ష సభ్యులు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరును కూడా ప్రజల ముందుకు తేవాలని డిమాండ్ చేశారు.

    అసెంబ్లీ వ్యవహారాల్లో ఎవరు తప్పుగా ప్రవర్తించినా చర్యలు తీసుకోవాలని, తాము తప్పు చేసి ఉన్నా, అధికారపక్షం తప్పుచేసినా బాధ్యులను చేయాలని కోరారు. మొత్తం వీడియో క్లిప్పింగ్‌లను ఇవ్వాలని తాము స్పీకర్‌కు లేఖ ఇవ్వబోతున్నామని వారు తెలిపారు. ‘‘అసలు ఈరోజు(బుధవారం) టీడీపీ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు విడుదల చేసిన క్లిప్పింగ్ ఎలా బయటికొచ్చింది. స్పీకర్ ఇచ్చారా..? లేక ప్రసారహక్కులున్న ఏబీఎన్ చానల్ వారు టీడీపీకిచ్చారా? స్పీకర్ ఇచ్చిఉంటే ఆయన సమాధానం చెప్పాలి... ఏబీఎన్ చానల్ ఇచ్చి ఉంటే వారిపై చర్య తీసుకోవాలని కోరతాం’’ అని ఎమ్మెల్యేలు చెప్పారు.

    అసలు ‘లైవ్’లోకి రాని దృశ్యాల చిత్రీకరణను బయటకు విడుదల చేశారంటే టీడీపీ వారి దురుద్దేశమేమిటో తెలిసిపోతోందన్నారు. అసెంబ్లీ సొత్తు అయిన దృశ్యాల క్లిప్పింగ్‌లు ఎలా బయటికొచ్చాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్నారని, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు. ఇరువైపులా ఏం జరిగిందో ఆ దృశ్యాలను విడుదల చేస్తే తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎలా ఉసిగొల్పుతున్నారో... చేతులతో సంజ్ఞ లు చేస్తూ ప్రతిపక్షంపైకి వెళ్లండి అని ఎలా చెబుతున్నారో స్పష్టంగా తెలుస్తుందని వారన్నారు. ముఖ్యమంత్రి శాసనసభలో చాలా దిగజారి వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షానికి అసలు మాట్లాడే అవకాశమే లేకుండా అడ్డుపడుతున్నారని వారు చెప్పారు.
     
    అసెంబ్లీలో సీఎం కుల రాజకీయం చేస్తున్నారు: రోజా

    చంద్రబాబు అసెంబ్లీలో కుల రాజకీయం చేస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. తమవైపు నుంచి ఎవరైనా రెడ్డి మాట్లాడితే అదే కులం వారిని అటువైపు నుంచి రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని, అలాగే తమలాంటి వారిపై అనవసరంగా ఎస్సీ వర్గంవారితో విమర్శలు చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ ఎస్సీ ఎమ్మెల్యేగానీ, మంత్రిగానీ తమపై చేసే విమర్శలకు తాము ప్రతి విమర్శలు చేస్తే ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టించాలనేది చంద్రబాబు దుష్ట వ్యూహమని రోజా అన్నారు. అయితే ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు.

    మంత్రి పీతల సుజాత అసెంబ్లీలో సందర్భం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, అంగన్‌వాడీ సమస్యలు, చేనేత రుణాల మాఫీ గురించి తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆమె లేచి ‘ప్రతిపక్ష సభ్యులు పనీపాటా లేకుండా మాట్లాడుతున్నారు’ అని విమర్శిస్తారని రోజా తప్పుపట్టారు. బుధవారం సాయంత్రం టీడీపీ విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్‌లలో తన హావభావాలపై రోజా వివరణనిస్తూ... నేనసలు అసెంబ్లీలో తొలుత పీతల సుజాతవైపే చూడలేదు. మేం స్పీకర్ పోడియం వద్ద ఉన్నపుడు సుజాత మధ్యలో లేచి చంద్రబాబు ‘కాలిగోటికి కూడా రోజా సాటి రాదు...’ అని విమర్శించాకే నేను కూడా అందుకు స్పందనగా చేతులూపుతూ ‘నీలాగా బంగారు వడ్డాణాలు తీసుకుని ఫైళ్లపై సంతకాలు పెట్టడం లేదు’ అని ఆమె అవినీతిని ప్రశ్నించానని వివరించారు.

    అసలు చంద్రబాబు రెండున్నర ఎకరాల ఆస్తితో ఈ స్థాయికి వచ్చారని, తాను ఒక ఆర్టిస్టుగా కష్టపడి పైకొచ్చానని, పదేళ్లు కష్టపడి  పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. ‘‘నా హావభావాలపై ప్రశ్నిస్తున్నవారికి నేను టీడీపీలో ఉన్నపుడు మాత్రం నచ్చాయా?’’ అని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసమస్యలపై సూటిగా అడిగే ప్రశ్నలకు అధికారపక్షం సమాధానం చెప్పకుండా ఎంతసేపూ ఆయన అవినీతిపరుడని, లక్షకోట్లని నిందించడం ఏ తరహా సంప్రదాయమని రోజా మండిపడ్డారు.
     
    లోకేష్ అవినీతిని కప్పిపుచ్చడానికే..: చెవిరెడ్డి


    చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన కుమారుడు లోకేష్ అవినీతిని కప్పిపుచ్చడానికే పట్టిసీమపై ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. పట్టిసీమ వ్యవహారంలో లోకేష్‌కు రూ.350 కోట్లు ఇవ్వాలనేది ఒప్పందమని, అందుకే ఈ అంశంపై ఎక్కువ చర్చ జరిగితే అవినీతి సొమ్ము రాకుండా పోతుందేమోనన్న భయంతోనే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. మీ అంతు చూస్తానని మంగళవారం చంద్రబాబు, మిమ్మల్ని పాతరేస్తానని బొండా ఉమామహేశ్వరరావు బుధవారం మాట్లాడిన తీరు దారుణమన్నారు.
     
    బాబు తీరు దారుణం: వైఎస్సార్‌సీపీ

    సభలో పాలకపక్షం హేయమైన చర్యలకు పాల్పడుతూ సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తోందని, సాక్షాత్తూ సీఎం చంద్రబాబు మీ అంతు తేలుస్తా..నంటూ ప్రతిపక్షాన్ని బెది రిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు రాజన్నదొర, కిడారి సర్వేశ్వరరావు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, చిర్ల జగ్గిరెడ్డి, జయరాములు, పి.డేవిడ్‌రాజు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు.

    బాబు ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. తమ నేత జగన్  మాట్లాడుతుంటే.. వాటికి సమాధానం చెప్పలేక సభను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘‘వెంకటేశ్వర వర్సి టీలో మీరు చేసిన లీలలు.. మీ కొడుకు లోకేష్‌పైనా పలు కథనాలు ప్రచారంలో ఉన్నా యి. నీ మామను వెన్నుపోటు పొడిచిన తర్వాత ఎవరి ఇంట్లో ఉన్నావో... సభలో మేమూ మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారు’’ అని బాబునుద్దేశించి కోటంరెడ్డి అన్నారు. జగ్గిరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌పై నిందారోపణలు.. బూతు పదజాలంతో ఆరోపణలు చేయడం జుగుప్సాకరమన్నారు.

    సభలో పాలకపక్ష తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించా రు. పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పుష్పశ్రీవాణి, గౌరు చరితారెడ్డిలతో కలసి ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లా డారు. అప్పుడే వేదిక వద్దకొచ్చిన మంత్రి రావెల ఎస్సీనైన తనకు మాట్లాడే అవకాశమివ్వాలంటూ  వారితో వాదనకు దిగారు. వారు ఇక్కడున్నది గిరిజన మహిళలని చెప్పడంతో మంత్రి వెనుదిరిగారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement