కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో తెల్లబంగారం కొనుగోళ్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ భారీవర్షాలతో పంటపై ప్రభావం చూపింది. దీంతో ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మార్కెట్ యార్డులు తెల్లబంగారంతో కళకళలాడనున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. జిల్లా వ్యాప్తంగా 2.45 లక్షల హెక్టార్లలో పత్తిసాగు చేయగా 1.45 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటికే ప్రధాన మార్కెట్ యార్డులైన జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్‌లలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
జిల్లావ్యాప్తంగా శుక్రవారం అన్ని మార్కెట్ యార్డులలో వ్యాపారులు, అడ్తీదారులు రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో దళారులు కూడా రైతులను దోచుకునేందుకు కాచుక్కూర్చున్నారు. ప్రస్తుతం పత్తి కనీస మద్దతు ధర రూ.3900 ఉండగా, క్రమంగా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆరంభంలోనే క్వింటాలు పత్తికి రూ.3900 కావడంతో సీజన్ ముగిసే వరకు రూ.5వేల వరకు చేరుకునే అవకాశముందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. గతంలో రైతుల నుంచి కొనుగోళ్లు పూర్తయి వ్యాపారుల వద్ద నిల్వ ఉన్న క్రమంలో పత్తి ధరలు అమాంతం పెరిగి రూ.6 వేల పైచిలుకు చేరుకుంది. దీంతో రైతులు నష్టపోగా వ్యాపారులకు కాసుల వర్షం కురిసింది.
కొనుగోళ్లకు ఏర్పాట్లు
పత్తి కొనుగోళ్లు సవ్యంగా జరిగేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి మార్కెట్ యార్డులలో కొనుగోళ్లతోపాటు జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి 12 సీసీఐ కేంద్రాలు రంగంలోకి దిగుతున్నాయి. శని, ఆదివారాలు మార్కెట్ యార్డుకు సెలవు కావడంతో సోమవారం నుంచి సీసీఐ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ పద్మావతి తెలిపారు.జమ్మికుంటలో వ్యాపారుల నిర్ణయం మేరకు ఈ నెల 23న కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ఈసారి గొల్లపల్లి మండలం చెప్యాలలో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ లేఖ రాయగా అక్కడ కొనుగోళ్లు జరిగేందుకు మార్గం సుగమమైంది.
మార్కెట్‌లో ధర మద్దతు ధరకన్నా ఆశాజనకంగా ఉన్న క్రమంలో సీసీఐ పరిశీలనకే పరిమితం కానుంది. పత్తి ఒకేసారి రావడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేసే అవకాశముండడంతో సీసీఐ నెమ్మదిగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఎంబీఏ చదివిన ఆరుగురు విధ్యార్థులను నియమిస్తారు. వీరు పరిశీలించిన నివేదికను మార్కెటింగ్‌శాఖ ఏడీకి చేరవేస్తారు. పెద్దపల్లి, వేములవాడ, హుస్నాబాద్, మంథని, కాటారం, గొల్లపల్లి, ధర్మారం, గంగాధర, సిరిసిల్ల కేంద్రాలలో సీసీఐ కొనుగోళ్లు చేయనుంది. పెట్టుబడులు పెరిగినందున క్వింటాలుకు రూ.5వేలు చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
మద్దతు దక్కేనా..!
Published Fri, Oct 18 2013 4:17 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement