డబ్బున్న వారికే డాక్టర్ చదువు! | Read Dr money to them! | Sakshi
Sakshi News home page

డబ్బున్న వారికే డాక్టర్ చదువు!

Published Thu, Apr 9 2015 1:11 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

డబ్బున్న వారికే డాక్టర్ చదువు! - Sakshi

డబ్బున్న వారికే డాక్టర్ చదువు!

  • ప్రైవేటు కళాశాలల్లో ఇకపై 50 శాతం సీట్లు యాజమాన్యాల చేతుల్లోనే...
  • రూ.5.5 లక్షల నుంచి రూ.11.5 లక్షలకు పెరిగిన యాజమాన్య కోటా ఫీజు
  • సాక్షి, హైదరాబాద్: పేదవాడి మెడిసిన్ కల చెదిరిపోనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. డాక్టర్ అవుదా మనుకున్న లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలు అడియాసలు కానున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో సగం సీట్లను యాజమాన్యాల ఇష్టానికే వదిలేయడం, ఉన్నఫళంగా ఫీజులు లక్షలాది రూపాయలు పెంచడాన్ని చూస్తే ప్రభుత్వం డబ్బున్న వారికే వైద్య డిగ్రీని పరిమితం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఇకమీదట ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీటు కావాలంటే అధికారికంగా ఏడాదికి రూ.11.50 లక్షలు చెల్లించాలి.
     
    బి కేటగిరీ ఎత్తివేత

    ఇప్పటివరకు ప్రైవేటు వైద్య కళాశాలల సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద, 10 శాతం బి-కేటగిరీలో, మిగిలిన 40 శాతం.. యాజమాన్య (25), ఎన్‌ఆర్‌ఐ (15) కోటా సీట్లుగా భర్తీ చేసేవారు. కానీ వచ్చే విద్యా సంవత్సరం (2015-16) నుంచి ప్రభుత్వం బి- కేటగిరీ సీట్లనూ యాజమాన్య కోటాలో కలిపేస్తోంది. అంటే మొత్తం యాజమాన్య కోటా 50 శాతం అవుతుందన్నమాట. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు చెల్లించి వైద్య విద్యను చదవాలనుకునేవారికి ఆ అవకాశం లేకుండా పోతోంది. బి- కేటగిరీ కింద చేరే విద్యార్థులకు ఏడాదికి రూ.2.40 లక్షల ఫీజు ఉండేది. అయితే అర్హత ఉన్న విద్యార్థులకు అప్పట్లో ప్రభుత్వమే ఈ ఫీజును రీయింబర్స్ చేసేది. తాజాగా ఈ సీట్లన్నీ యాజమాన్య కోటాలోకి వెళుతున్నాయి కాబట్టి వీటికి ఇక ఫీజు రీయింబర్స్‌మెంటు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు పొందే వారు ఏడాదికి 60 వేలు ఫీజు చెల్లిస్తున్నారు. బి-కేట గిరీ ఎత్తేయడంతో కన్వీనర్ కోటా సీట్ల ఫీజులను తగ్గించాలని భావిస్తున్నారు. ప్రైవేటు కాలేజీల ఒత్తిడితో యాజ మాన్య కోటా సీట్లకు ఏడాదికి 11.5 లక్షల ఫీజును నిర్ధారిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  
     
    అమ్మకానికి అదనంగా 200 ఎంబీబీఎస్ సీట్లు

    సర్కారు తాజా నిర్ణయం ప్రకారం ప్రైవేటు కళాశాలలకు 200 సీట్లు అమ్ముకునేందుకు అవకాశం లభించింది. గతంలో బి- కేటగిరీ సీట్లను ప్రభుత్వమే భర్తీ చేసేది. ప్రస్తుతం ఈ 10 శాతం సీట్లను ప్రైవేటు కళాశాలలే యాజమాన్య కోటా కింద భర్తీ చేసుకోనున్నాయి. ఈ సీటు పొందిన విద్యార్థి ఏడాదికి రూ.11.5 లక్షలు చెల్లించాలి. వైద్య విద్య టెర్మ్ నాలుగున్నరేళ్లే అయినా ప్రైవేటు కళాశాలల్లో ఐదేళ్లకూ ఫీజు వసూలు చేస్తారు. అంటే ఐదేళ్లకు రూ.57.5 లక్షలు అవుతుంది. 200 సీట్లకు ఏడాదికి రూ.23 కోట్లు లెక్కన ఐదేళ్లలో రూ.115 కోట్లు లభిస్తాయన్న మాట.
     
    ఇదెక్కడి న్యాయం
    ఇప్పటికే పేద విద్యార్థులు చాలామంది ఫీజులు చెల్లించలేక వైద్యవిద్యకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బి కేటగిరీ సీట్లను ప్రైవేటుకు అప్పజెప్పడం, యాజమాన్యకోటా సీట్ల ఫీజులు పెంచడం ఎంతవరకు సమంజసం? కర్ణాటక తరహాలోనే వైద్య విద్యను ప్రైవేటుకు అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.
     - డాక్టర్ స్నిగ్ధ, పీజీ వైద్యవిద్యార్థిని, సిద్ధార్థ ప్రభుత్వ
     వైద్య కళాశాల, విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement